ఆట.. సయ్యాట.. వివాదాల బాట.. అతడి జీవితమే ఓ పెనుగులాట

Update: 2022-03-05 10:38 GMT
షేన్‌ వార్న్.. క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. అలాంటి వ్యక్తి అనూహ్య స్థితిలో శుక్రవారం చనిపోయాడు. కేవలం 52 ఏళ్లకే అతడి జీవిత ప్రస్థానం ముగిసింది. క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. క్రికెట్.. మాదక ద్రవ్యం.. జూదం.. విచ్చిలవిడితనం.. అన్నీ కలిసి వార్న్. క్రికెటర్ గా ఎంత ఎత్తుకు ఎదిగాడో వ్యక్తిగత జీవితంలో అంత వివాదాస్పదమయ్యాడు. అదే అతడి క్రికెట్ కెరీర్ ను వెనక్కులాగింది. అయినా కెరటంలా విరుచుకుపడి శిఖరానికి చేరాడు. ఎంతోమంది యువకులకు ఆదర్శప్రాయుడిగా నిలిచాడు.

తొలి టెస్టులో ఒకే ఒక్క వికెట్ తో మొదలుపెట్టి వెయ్యి వికెట్ల మైలురాయిని చేరిన వార్న్ జీవితం కంటే స్ఫూర్తి ఏముంటుంది మరి థాయ్ లాండ్ లోని విల్లాలో కన్నుమూత వార్న్ శుక్రవారం థాయ్ లాండ్ లోని విల్లాలో గుండెపోటుకు గురయ్యాడు. అతడు భోజనానికి రాకపోయేసరికి అనుమానం వచ్చిన స్నేహితులు పిలిచేందుకు వెళ్లారు.

అయితే, అప్పటికే అచేతన స్థితిలో ఉన్న వార్న్ ను బతికించడానికి ముగ్గురు స్నేహితులు విశ్వ ప్రయత్నాలు చేశారు.  సుమారు 20 నిమిషాల పాటు వారు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. వార్న్‌ కొద్ది రోజులుగా ముగ్గురు స్నేహితులతో థాయ్‌లాండ్‌లోని కోహ్‌ సామూయ్‌లోని ఓ ప్రైవేటు విల్లాలో బసచేస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి హఠాన్మరణం చెందాడు. అతడు గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే థాయ్‌లాండ్‌ పోలీసులు అక్కడ ఏం జరిగిందో వివరించారు. ‘షేన్‌వార్న్‌ భోజనానికి రాకపోవడంతో స్నేహితుల్లోని ఓ వ్యక్తి తొలుత అతడి గదికి వెళ్లి చూడగా అప్పటికే అచేతనంగా పడి ఉన్నాడు. దీంతో వెంటనే స్పందించిన ముగ్గురు స్నేహితులు వార్న్‌ గుండెపోటుకు గురై ఉంటాడని భావించి ఛాతి భాగంలో సుమారు 20 నిమిషాల పాటు సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడాలని ప్రయత్నించారు. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. ఆస్పత్రికి తరలించాక వైద్యులు మళ్లీ సీపీఆర్‌ నిర్వహించినా ఫలితం లేకపోయింది’అని ఉన్నతాధికారి వెల్లడించారు.

మురళీతో పోటాపోటీ

1990 ల్లో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్, షేన్‌ వార్న్‌ దీటుగా పోటీపడ్డారు. వార్న్ కెరీర్ మొదలైన  1992లో మురళీ అరంగేట్రం చేశాడు. అలా 2007 వరకు వీరి పోటీ సాగింది. వార్న్‌కు ఆటతో ఎంత పేరు వచ్చిందో.. వివాదాలూ అలానే చుట్టముట్టాయి.  ఓ అద్భుత ప్రదర్శన.. మళ్లీ ఏదొక వివాదం.. జట్టులోకి రావడం.. మళ్లీ మరొక వివాదం.. ఇలా ప్రతిసారీ పైకిలేచి తన సత్తాతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.

1969లో విక్టోరియాలో జన్మించిన వార్న్‌ 23 సంవత్సరాలకు ఆస్ట్రేలియా జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. భారత్‌తోనే 1992లో జరిగిన సిరీస్‌లో అరంగేట్రం చేసిన వార్న్‌  కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే తీశాడు. అది కూడా టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రిది కావడం గమనార్హం. అయితే, ఈ మ్యాచ్ లో రవిశాస్త్రి డబుల్ సెంచరీ కొట్టాడు. అదే ఏడాది శ్రీలంకతో సిరీస్‌లో భాగంగా కొలంబో వేదికగా తొలి టెస్టులో వార్న్‌ లంకేయుల పని పట్టాడు.

కేవలం 30 పరుగులు చేస్తే చాలు లంక విజయం సాధించేదే. ఇంకా లంక చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఫామ్‌లో లేని బౌలర్‌కు బంతిని ఇవ్వరు. తొలి ఇన్నింగ్స్‌లో వార్న్ ప్రదర్శన మరీ దారుణం (0/107). అయితే అప్పటి ఆసీస్‌ కెప్టెన్‌ అలెన్ బోర్డర్‌ మాత్రం వార్న్‌కు బౌలింగ్ ఇచ్చాడు. ఆఖరి మూడు వికెట్లను కేవలం 14 పరుగుల వ్యవధిలో తీసి సంచలనం సృష్టించాడు. దీంతో లంకపై ఆసీస్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.

‘‘అప్పటి వరకు బౌలింగ్‌ యావరేజ్‌ 300కిపైగా ఉన్న బౌలర్‌.. మా చేతుల్లోని విక్టరీని లాగేసుకున్నాడు’’’ అని లంక సారథి రణతుంగ వాపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో (3/11) విజృంభించాడు. అదే ఏడాది మళ్లీ బౌలింగ్‌ ప్రదర్శన బాగోలేకపోవడంతో విండీస్‌తో సిరీస్‌లోని తొలి టెస్టుకు వార్న్‌కు జట్టులో స్థానం దక్కలేదు. అయితే రెండో టెస్టులో మాత్రం వేరొక బౌలర్ స్థానంలో అవకాశం వచ్చింది. దానిని వార్న్‌ రెండు చేజేతులా ఒడిసిపట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో (7/52) అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.  

కెరీర్‌లో తొలిసారి ఏడు వందల వికెట్లు తీసిన బౌలర్‌గా షేన్‌ వార్న్ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు చెప్పేనాటికి షేన్ వార్న్‌ 145 టెస్టుల్లో 708 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ రికార్డును లంక దిగ్గజం దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ అధిగమించాడు.

2003 వరకు ఆసీస్‌ జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగిన షేన్‌ వార్న్‌ ఆ ఏడాది కలిసిరాలేదు. డ్రగ్స్‌ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో క్రికెట్‌ నుంచి బ్యాన్‌ పడింది. అయితే అది ప్రిస్క్రిప్షన్‌ డ్రగ్‌ అని నిరూపించుకోవడంతో ఒక్క సంవత్సరం మాత్రమే నిషేధంతో సరిపెట్టుకున్నాడు. దీంతో 2003 ప్రపంచకప్‌ పోటీలకు దూరమయ్యాడు.

వార్న్‌ స్పిన్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఆటపరంగానే కాకుండా కుటుంబ వివాదాలతోనూ అపఖ్యాతి పాలయ్యాడు. ఓ బుకర్‌ నుంచి సొమ్ము తీసుకున్నట్లు వార్న్‌తోపాటు మార్క్‌వాపై 1998లో ఆరోపణలు వచ్చాయి. పిచ్‌, వాతావరణ పరిస్థితుల గురించి తెలియజేసేందుకు లంకకు చెందిన వ్యక్తితో మాట్లాడినట్లు వివాదం చెలరేగింది.

1999 ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు అప్పటి లంక కెప్టెన్‌ అర్జున్‌ రణతుంగను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేయడంతో రెండు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కొన్నాడు. అలానే 2003 వరల్డ్‌ కప్‌ ముందు డ్రగ్స్‌ వ్యవహారం పెనుదుమారం రేపింది. 2013లో బిగ్‌బాష్‌ లీగ్‌లో మైదానంలో అనుచితంగా ప్రవర్తించినందుకు 4,500 డాలర్ల జరిమానా కట్టాడు.

కరోనా వేళ సహాయం

సహచరుల కష్టసుఖాల్లోనూ షేన్‌ వార్న్‌ ముందుంటాడు. కరోనా సమయంలో ఆసీస్‌లోని ప్రజల కోసం అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. షేన్‌వార్న్‌కు పశ్చిమ ఆస్ట్రేలియాలో ‘సెవెన్‌ జీరో ఎయిర్‌ జిన్’ అనే మద్యం తయారీ సంస్థ ఉంది. కరోనా విజృంభిస్తున్న సమయంలో శానిటైజర్ల కోసం ఇబ్బందిగా మారింది.

దీంతో తన ఫ్యాక్టరీలోని 70 శాతం ఆల్కహాల్‌తో నాణ్యమైన శానిటైజర్‌ సీసాలను తయారు చేయాలని సూచించాడు. దీంతో మిగతా తయారీదారులు కూడా షేన్‌ వార్న్‌ బాట పట్టి సమాజానికి సాయపడ్డారు.

ఇండియా అంటే వీరాభిమానం

ఃవార్న్‌కు భారత దేశం అంటే అమితమైన ప్రేమ. అవకాశం చిక్కినప్పుడల్లా ఆ అభిమానాన్ని చాటుకుంటాడు. గతేడాది భారత్‌లో కరోనా రెండో వేవ్‌ సమయంలో కేసులు, మరణాలు విపరీతంగా పెరిగిన సమయంలో ఆందోళన చెందాడు. అప్పుడు ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో ఉండాలని, తమ కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవాలని ఓ ట్వీట్‌ ద్వారా అభ్యర్థించాడు. కాగా, ఫేవరెట్‌ కొటేషన్‌ ఒకటుంది. ‘స్పిన్‌ బౌలింగ్‌తో ప్రత్యేకంగా ఏదీ జరగకపోయినా.. ఏదో జరుగుతుందని బ్యాట్స్‌మెన్‌ను తికమక పెట్టడం ఓ కళ’. ఇలాంటి ఫీలింగ్‌తోనే వార్న్‌ తన బౌలింగ్‌తో ఎంతో మందిని ఔట్ చేశాడు.
Tags:    

Similar News