వైఎస్ అవినాష్ కోసం జగన్ అన్నిసార్లు ఢిల్లీకి వెళ్లారా?

Update: 2022-02-16 12:30 GMT
వైఎస్ వివేకానంద హత్య కేసులో తొలి నుంచి పరోక్ష ఆరోపణలు వినిపిస్తూ.. ఆయనపై అనుమానాలు వ్యక్తమవుతున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీద అనుమానం ఉన్న విషయాన్ని సీబీఐ తన తాజా చార్జిషీట్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. సదరు చార్జిషీట్ వివరాలు బయటకు వెల్లడి కావటం ఇప్పుడు సంచలనంగా మారింది. అదే సమయంలో ఏపీ అధికారపక్షం ఇరుకున పడింది.

అయితే.. సీబీఐ చార్జిషీట్ లో వైఎస్ అవినాష్ రెడ్డి పేరు లేకుండా చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేశారంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ నేత బొండా ఉమ.

ఇటీవల కాలంలో పెద్దగా బయటకురాని బొండా ఉమ.. తాజాగా సీఎం జగన్ మీద ఘాటు విమర్శలకు దిగారు. సొంత బాబాయ్ ను చంపిన వారిని శిక్షించాల్సింది పోయి సీబీఐ విచారణను జగన్ ఉపసంహరించుకున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. వివేకా హత్య కేసులో నిందితుల్ని కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డేనని పేర్కొన్న ఆయన.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణ కోరిన జగన్ ఇప్పుడు పిటిషన్ ను ఉపసంహరించుకోవటానికి కారణం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో జరిగిన వివేకా హత్య ఉదంతంలో.. వేళ్లు అన్ని టీడీపీ మీద చూపించటం.. అప్పట్లో ఆ దిశగా ప్రచారం జరగటం తెలిసిందే. తర్వాతి కాలంలో పరిస్థితుల్లో చోటు చేసుకున్న మార్పుల గురించి తెలిసిందే. వివేకా హత్య కేసులో వైసీపీ నేతలు మౌనంగా ఎందుకు ఉన్నారు? సీఎం జగన్ ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు.

వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడుకోవటానికి సీఎం జగన్ చేయని ప్రయత్నాలు లేవన్నారు. ఆయన కోసం సీఎం జగన్ ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్తున్నారో లెక్కే లేదన్న బొండా ఉమ.. వివేకా హత్య కేసు వివరాల్ని సీబీఐ సగమే వెలికి తీసిందన్నారు. సాక్ష్యాలు దొరక్కుండా జాగ్రత్తపడ్డారన్నారు. తమపై విష ప్రచారం చేసిన అవినాష్ రెడ్డి నాటకాలాడారన్నారు. ఎన్నికలనోటిఫికేషన్ వేళ వివేకా హత్య కేసును వాడుకున్న వైసీపీ..అధికారంలోకి వచ్చిన తర్వాత కేసునే తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారంటూ బొండా ఉమ ఆరోపిస్తున్నారు.

విపక్షంలో ఉన్న వేళలో నాటి విపక్ష నేత జగన్ తో పాటు.. విజయసాయి రెడ్డి వివేకా హత్య గురించి ఏమేం మాట్లాడారన్న విషయాల్ని వీడియోలతో సహా చూపించిన బొండా ఉమ మండిపాటు ఇప్పుడు అందరిని ఆలోచనల్లో పడేలా చేస్తోంది.
Tags:    

Similar News