కోడలు.. మనమళ్లు మృతి కేసులో నిర్దోషిగా తేలిన మాజీ ఎంపీ

Update: 2022-03-23 05:41 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ రాజయ్య కోడలు.. మనమళ్లు మృతి కేసులో ఆయనకు.. ఆయన కుటుంబానికి ఊరట లభించింది. తాజాగా సదరు కేసును కొట్టివేస్తూ తీర్పును ఇచ్చారు. 2015 నవంబరు నాలుగు తెల్లవారు జామున రాజయ్య ఇంట్లో ఆయన కోడలు సారిక.. ముగ్గురు మనమళ్లు అనుమానాస్పద స్థితిలో మంటలు చెలరేగి మృతి చెందారు. ఈ ఉదంతం పెను సంచనలంగా మారింది.

ఇదిలా ఉంటే.. రాజయ్య కోడలు సారిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఉదంతంలో ప్రధాన నిందితుడిగా సిరిసిల్ల రాజయ్య కుమారుడు అనిల్ ను.. రెండో నిందితుడిగా రాజయ్యను.. మూడో నిందితురాలిగా రాజయ్య సతీమణిని.. నాలుగో నిందితురాలిగా అనిల్ రెండో భార్య సనాపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా వారంతా కొంతకాలం వరంగల్ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా కాలం గడపాల్సి వచ్చింది.

అయితే.. వీరిది అనుమానాస్పద మృతి కాదని.. హత్య అసలే కాదని తాజాగా తేల్చారు. హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు సైతం గ్యాస్ లీక్ కావటంతోనే ప్రమాదం జరిగిందని నివేదిక ఇచ్చారు. దీంతో.. ఈ కేసు నుంచి రాజయ్య కుటుంబాన్ని నిర్దోషులుగా నిర్ణయిస్తూ నాంపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల కోర్టు కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

దీనికి సంబంధించిన తీర్పును తాజాగా వెలువరించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజయ్య కుటుుంబం తప్పు చేసినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. దీంతో.. తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కొనేలా చేసిన కేసు నుంచి రాజయ్య కుటుంబం బయపడినట్లుగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News