తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటుందన్న అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. సినీరంగ ప్రముఖుడు.. ప్రముఖ కొరియో గ్రాఫర్.. సామాజిక అంశాల్లో ముందుండే లారెన్స్ రాఘవ అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. తాను అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వెనుకే ఉంటానని.. ఆయనకే తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.
సోమవారం సాయంత్రం చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో.. వేచిచూసి నిర్ణయం తీసుకుందామని ప్రముఖులు కొందరు భావిస్తున్న వేళ.. వారికి భిన్నంగా లారెన్స్ సోమవారం రాత్రి తనకు తాను స్వయంగా పన్నీర్ సెల్వం ఇంటి వద్దకు చేరుకున్నారు. జల్లికట్టు ఉద్యమ సమయంలో మెరీనా బీచ్ లో లక్షలాది మంది యువతకు అండగా నిలవటమేకాదు.. ఆర్థికంగా కూడా భారీ సాయాన్ని (రూ.కోటి పైనే) ఇచ్చి.. ఉద్యమాన్ని మరింత ఉధృతంగా సాగేందుకు అండగా నిలిచిన విషయాన్ని మర్చిపోకూడదు.
త్వరలో రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందంటూ వ్యాఖ్యలు చేసిన లారెన్స్.. తనకుతాను స్వయంగా పన్నీర్ వద్దకు వచ్చి.. ఆయనకు మద్దతుగా నిలవటం ఆసక్తికరంగా మారింది. చెన్నైలోనిగ్రీన్ వేస్ రోడ్డులోని పన్నీర్ నివాసానికి వచ్చిన ఆయన.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటిని నిశితంగా పరిశీలించానని.. తన మద్దతు పన్నీర్ సెల్వానికే అంటూ ఆయన ప్రకటించారు. అమ్మ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ల సత్తా పన్నీర్ కు మాత్రమే ఉందన్న ఆయన.. అన్నీ ఆలోచించిన మీదటే తానీ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ప్రకటించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/