నేడు సోమ‌రిపోతుల దినోత్స‌వం.. ఈ రోజు చేయాల్సింది ఇదే!

Update: 2022-08-10 12:30 GMT
సోమ‌రిపోతుల‌కు కూడా ఒక దినోత్స‌వం ఉందంటే మీరు న‌మ్ముతారా? లేజీ డేగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తున్నారంటే ఆశ్చ‌ర్య‌పోక త‌ప్ప‌దు. ఈ లేజీ డే తొలుత అమెరికాలో ప్రారంభ‌మైంద‌ని తెలుస్తోంది. ఇప్పుడంతా అంతా పోటీ ప్ర‌పంచం. అంద‌రికంటే ముందుండ‌టానికి ఒక‌రితో ఒక‌రు పోటీ ప‌డ‌టం త‌ప్ప‌దు. అంద‌రిదీ తెల్ల‌వారుజామున లేచిన ద‌గ్గ‌ర నుంచి రాత్రి వ‌ర‌కు ఉరుకుల ప‌రుగులతో కూడిన జీవితమై పోయింది. ఒక్క రోజు కాస్త బ‌ద్ద‌కించి ప‌నుల‌న్నింటినీ వాయిదా వేసి.. కాస్త విశ్రాంతి తీసుకోవ‌డానికీ మ‌నిషికి స‌మ‌యం దొర‌క‌డం లేదు.

ఈ నేప‌థ్యంలో లేజీ డే రోజైనా లేజీగా గ‌డిపేస్తే చాలా ప్ర‌యోజ‌నాలే ఉన్నాయంటున్నారు.. నిపుణులు. అయితే అతి బ‌ద్ద‌కంగా ఉండ‌టం మాత్రం ఎప్ప‌టికీ ప్ర‌మాద‌క‌ర‌మేన‌ని చెబుతున్నారు. ఈ లేజీ డే నాడు లేజీగా గ‌డిపిస్తే మెరుగైన ఫ‌లితాలు సొంతమ‌వుతాయంటున్నారు.

ముందుగా ఫోన్ల‌ను స్విచ్చాఫ్ చేసి చ‌క్క‌టి నిద్ర పోతే మంచి విశ్రాంతి ల‌భిస్తుంద‌ని అంటున్నారు. ఇలా చేస్తే ఒత్తిడి, త‌ల‌పోటు త‌గ్గ‌డంతోపాటు మెద‌డుకు మంచి విశ్రాంతి ల‌భిస్తుంద‌ని చెబుతున్నారు. అలాగే జ్ఞాప‌క‌శ‌క్తి కూడా మెరుగుప‌డుతుందంటున్నారు. తగినంత నిద్ర లేక‌పోతే ఆందోళన, నిరాశ, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, గుండె జబ్బులు వంటివి వ‌స్తాయ‌ని అంటున్నారు. కాబ‌ట్టి లేజీ డే నాడు నిద్ర‌కే మొద‌టి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని పేర్కొంటున్నారు.

అలాగే లేజీ డేనాడు మీరు సౌకర్యవంతంగా దుస్తులు ధరించేలా చూసుకోవాలి. మీరు రోజంతా పైజామాలో ఉండాలని నిర్ణయించుకోవచ్చు లేదా మృదువైన బ‌ట్ట‌లు ధరించొచ్చు. అలాగే మీకు ఇష్ట‌మైన టీవీ ప్రోగ్రాములు లేదా వెబ్ సిరీసులు చూడ‌టానికి లేజీ డే ఉత్త‌మ రోజు. మీకు న‌చ్చిన ప్రోగ్రామ్ ను ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణంలో వీక్షించండి.

అలాగే మంచి సంగీతం వింటూ కూడా ఆనందించ‌వ‌చ్చు . లేజీ డే నాడు విశ్రాంతి తీసుకోవడానికి ఒక జత హెడ్‌ఫోన్‌లను తీసుకోండి, వాటితో మీకు ఇష్టమైన పాటలను వినండి. మంచి సంగీతం ద్వారా ప్రశాంతంగా ఉండొచ్చు. ఉల్లాసం, ఉత్సాహం ల‌భిస్తాయి. త‌ద్వారా మాన‌సిక స్థితి కూడా మెరుగుప‌డుతుంది.

అదేవిధంగా లేజీ డే నాడు సోష‌ల్ మీడియాకు పూర్తి దూరంగా ఉండండి. అలాగే అన్ని ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల‌ను ఆఫ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించండి. ఫోన్లు, మెయిళ్లు, వాట్సాప్ మెసేజులు వ‌స్తుంటే లేజీగా గ‌డ‌పడం కుద‌ర‌దు. కాబ‌ట్టి వాటిని లేజీ డే నాడు ఆఫ్ చేసేయండి.

లేజీగా గడపడం కూడా ఒక రకంగా చికిత్స వంటిదే. శరీరాన్ని, మనసును పూర్తిస్థాయిలో పునరుత్తేజితం చేయడానికి దోహద‌పడుతుంద‌ని అంటున్నారు. ఈవిధంగా లేజీ డే నాడు ఇష్టమైన పనులు చేయడం ద్వారా ఎక్కువ సంతోషం పొందొచ్చు. అంతేకాదు ఇష్టమైన ఆహారాన్ని తిని ప్రశాంతంగా నిద్రపోతే మెమరీ పవర్ కూడా పెరుగుతుందంట. ఇంకెందుకు ఆలస్యం ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా లేజీ డే.. హ్యాపీ డే అనేయండి.
Tags:    

Similar News