టీఆర్ఎస్‌ లో ఒక్క స్థానం కోసం ఇంత పోటీయా...!

Update: 2021-11-29 07:31 GMT
త్వ‌ర‌లో ఖాళీ కానున్న రాజ్య‌స‌భ స్థానం కోసం టీఆర్ఎస్‌ నేత‌లంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ఒక్క పెద్ద పోస్టు కోసం ప‌దుల సంఖ్య‌లో ఆశావ‌హులు ఆరా తీస్తున్నారు. ఇటీవ‌ల ఎమ్మెల్యేల కోటాలో బండ ప్ర‌కాష్ ఎమ్మెల్సీగా ఎన్నికైన విష‌యం తెలిసిందే. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ అవ‌స‌రాల దృష్ట్యా రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న బండ ప్ర‌కాష్‌ను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఎమ్మెల్సీగా ఎంపికైన‌ బండ ప్ర‌కాష్ త్వ‌ర‌లో త‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేయాల్సి ఉంది. ఇంకా మూడు సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉండ‌గానే రాజ్య‌స‌భ ప‌ద‌విని వ‌దులుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

పెద్ద పోస్టుకు ఎంపిక‌య్యే పెద్ద ఎవ‌రో..?

బండ ప్ర‌కాష్ రాజీనామా చేయ‌బోయే రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం కోసం భారీ స్థాయిలో ఆశావ‌హులు ఎదురుచూస్తున్నారు. త‌మ అధినేత కేసీఆర్ ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దాదాపు 50 మందికి పైగానే ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ తిరుగుతున్నారు. ఇంత‌మందిలో అధినేత ఆశీస్సులు ఎవ‌రికి ఉంటాయో న‌న్న చ‌ర్చ స‌ర్వ‌త్రా జ‌రుగుతోంది.

జిల్లాకు ఇద్ద‌రు ముగ్గురు పోటీ..!

ఖాళీ అయ్యే రాజ్య‌స‌భ ప‌ద‌వి కోసం ఒక్కో జిల్లాకు ఇద్ద‌రు ముగ్గురు చొప్పున ఆశ‌లు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే కోటాలోని ఆరు స్థానాల‌కు, స్థానిక సంస్థ‌ల కోటాలో 12 స్థానాల్లో ఆశ‌లు పెట్టుకున్న చాలామంది వాటిలో త‌మ పేరు లేక‌పోవ‌డంతో హ‌త‌హాశుల‌య్యారు. క‌నీసం ఇప్పుడు ఖాళీ కాబోతున్న రాజ్య‌స‌భ ప‌ద‌వినైనా ద‌క్కించుకునేందుకు వారి శ‌క్తియుక్తులు ఒడ్డుతున్నారు.

పార్టీ విధేయ‌తాకా! బీటీ బ్యాచ్‌కా!

పార్టీకి ఎన్నో ఏళ్లుగా విధేయ‌త‌గా ఉన్న వారికి అవ‌కాశం ల‌భిస్తుందా? లేదా ఇటీవ‌ల పార్టీలో చేరిన బంగారు తెలంగాణ బ్యాచ్‌కు అవ‌కాశం వ‌స్తుందా అని అంద‌రూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో కేసీఆర్ ద‌గ్గ‌రి బంధువు, ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడిగా ఉన్న‌బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్‌, కేసీఆర్ ఆత్మీయ స్నేహితుడు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, మాజీ మంత్రి వెంక‌టేశ్వ‌ర‌రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి, ఇటీవ‌ల పార్టీలో చేరిన మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, మోత్కుప‌ల్లి న‌ర్సింహులు అధినేత మెప్పు కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. వీరితో పాటు ఇటీవ‌ల ఎమ్మెల్సీ పొడ‌గింపు ద‌క్క‌ని క‌ర్నె ప్ర‌భాక‌ర్, ఆకుల ల‌లిత‌, బి వెంక‌టేశ్వ‌ర్లు, నేతి విద్యాసాగ‌ర్ రావు త‌దిత‌రులు కేసీఆర్ నిర్ణ‌యం కోసం ఎదురుచూస్తున్నారు.

కేటీఆర్ ముద్ర ఉండేనా...?

రాజ్య‌స‌భ ప‌ద‌వి ఎంపిక‌లో కేటీఆర్ ముద్ర కూడా ఉండే అవ‌కాశం లేక‌పోలేద‌ని పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. కేటీఆర్ దృష్టిలో ప‌డేందుకు చాలా మంది పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌తో పాటు ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌లు కూడా ఎదురుచూస్తున్నార‌ట‌. చూడాలి మ‌రి ఆ పెద్ద‌ స‌భ‌కు వెళ్లే యోగం ఏ పెద్ద నేత‌కు ప‌డుతుందో.




Tags:    

Similar News