టెన్నిస్ దిగ్గజం అలాంటి పాడు పని చేశాడా?

Update: 2022-02-26 03:02 GMT
భారత టెన్నిస్ దిగ్గజ ఆటగాడిగా లియాండర్ పేస్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా అతడికి ముంబయి కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు ఎనిమిదేళ్ల పాటు సహజీవనం చేసిన పేస్ తనను తీవ్రమైన వేధింపులకు గురి చేసినట్లుగా మాజీ భార్య రియా పిళ్లై కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. తాజాగా తీర్పును ఇచ్చింది. దీని ప్రకారం రియాకు నెలవారీ నిర్వహణ ఖర్చులకు రూ. లక్ష చొప్పున చెల్లించాలని పేర్కొంది.

పేస్.. రియా పిళ్లైలు 2006-07 నుంచి సహజీవనం చేసిన విషయం తెలిసిందే. అయితే.. 2014లో మాత్రం రియా కోర్టును ఆశ్రయించారు. లియాండర్ పేస్ మీద గృహ హింస ఆరోపణలు చేశారు. మహిళలకు రక్షణగా నిలిచే సదరు చట్టం కింద తనకు న్యాయం చేయాలని కోరింది. తన మాటలతో.. చేతలతో పేస్ తనను అన్ని రకాలుగా దూషించటమే కాక హింసించినట్లుగా పేర్కొన్నారు. దీంతో తాను తీవ్రమైన మానసిక క్షోభకు గురైనట్లుగా పేర్కొంది.

ఈ నేపథ్యంలో దాఖలైన కేసును విచారించిన కోర్టు.. రియా ఆరోపణలకు అనుకూలంగా స్పందించింది. రియా నెలవారీ నిర్వహణ ఖర్చులకు రూ.లక్ష చొప్పున చెల్లించాలని పేస్ ను ఆదేశించింది. అంతేకాదు.. వారిద్దరు కలిసి నివసించిన ఇంటినుంచి రియాను బయటకు వెళ్లిపోతే.. ఆమెకు నెలకు రూ.50వేల చొప్పున అదనంగా చెల్లింపులు జరపాలని పేర్కొంది. ఒకవేళ ఒకే ఇంట్లో ఉంటే మాత్రం రూ.50వేలు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. మార్చి మొదట్లో ఇచ్చిన ఆదేశాలు కాస్త ఆలస్యంగా బయటకు వచ్చాయి.
Tags:    

Similar News