ఆ కంపెనీ చేసిన తప్పు ఖరీదు జస్ట్.. లక్ష కోట్లంట

Update: 2016-06-29 07:05 GMT
తప్పు ఖరీదు ఎంత? అంటే.. చాలామంది చాలానే సమాధానాలు చెప్పొచ్చు. కానీ.. జర్మనీకి చెందిన ప్రముఖ వాహన సంస్థ ఫోక్స్ వ్యాగన్ చెప్పే సమాధానంతో ఎవరి జవాబు మ్యాచ్ కాదనే చెప్పాలి. ఎందుకంటే.. ఒక తప్పు ఖరీదు ఎంత భారీగా ఉంటుందో ఆ కంపెనీకి తెలిసినంత బాగా ఇప్పట్లో మరెవరికి తెలీదనే చెప్పాలి. పొల్యూషన్ టెస్ట్ కు సంబంధించి సాఫ్ట్ వేర్ తో మాయ చేసేసి.. దొరికిపోయిన ఈ కంపెనీ తాను చేసిన తప్పునకు భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తోంది మరి.

ఫోక్స్ వ్యాగన్ తాను చేసిన తప్పును సరిదిద్దుకోవటానికి పెడుతున్న ఖర్చు రూ.లక్ష కోట్ల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.  డాలర్ల రూపంలో చెప్పాలంటే.. జస్ట్ 15.3 బిలియన్ డాలర్లని లెక్కలు చెబుతున్నానరు. పొల్యూషన్ నియంత్రిత నిబంధనల్ని ఉల్లంఘిస్తూ సదరు కంపెనీ చేసిన తప్పులు బయటపడిన నేపథ్యంలో ఆ కంపెనీపై అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని డిస్ట్రిక్ కోర్టులో కేసు నడుస్తోంది.

ఈ కేసును సెటిల్ చేసుకోవటంలో భాగంగా కంపెనీ కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఇందులో ఒకటి తాను అమ్మిన 4.75 లక్షల కార్లను రిపేర్ చేసి ఇవ్వాలని అనుకుంది. అయితే.. ఆచరణలో సాధ్యం కాకపోవటంతో వీటిని కొనేయాలని భావిస్తోంది. దీని కోసమే దాదాపు 10 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి రానుంది. ఇక.. పర్యావరణ ఉపశమనం కింద 2.7 బిలియన్ డాలర్లు.. మరో రెండు బిలియన్ డాలర్లు జీరో పొల్యూషన్ వెహికిల్స్ రీసెర్చ్ కోసం చెల్లించాల్సి ఉంది. ఇలా తాను చేసిన తప్పును సరిదిద్దుకోవటానికి రూ.లక్ష కోట్లకు పైనే ఖర్చు చేయటానికి రెఢీ అయ్యింది.

కొసమెరుపు ఏమిటంటే.. ఇప్పటికి సిద్ధమైన లక్ష కోట్ల నష్టపరిహారం కేవలం 2లీటర్ల డీజిల్ ఇంజిన్ల కార్ల విషయంలో మాత్రమే. ఇలాంటి తప్పునే.. 3 లీటర్ ఇంజిన్ విషయంలోనూ ఈ కంపెనీ పొరపాటు చేసింది. ఈ కార్లు దాదాపుగా 80వేలుగా అమెరికాలో అమ్మారు. దీనికి సంబంధించిన సెటిల్ మెంట్ కోసం కంపెనీ ప్రయత్నిస్తోంది. ఆ మొత్తం కూడా కలిపితే.. భారీ మొత్తం కానుంది. చరిత్రలో ఒక తప్పునకు ఇంత భారీ మూల్యం ఏ కంపెనీ చెల్లించలేదన్న మాట మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Tags:    

Similar News