చైనాలో లేహ్ .. ట్విట్టర్ ఘనకార్యం , స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన భారత్ !

Update: 2020-10-22 14:10 GMT
ల‌డాఖ్‌ లోని లేహ్‌ మన ఇండియాలో ఉంటుంది. కానీ , ప్రముఖ సోషల్ మీడియా సంస్థ అయిన ట్విట్టర్ మాత్రం లేహ్ ను చైనాలో ఉన్న‌ట్లు చూపించింది. దీనితో భారత‌ భూభాగాలను తప్పుగా చూపించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ట్విట్టర్‌ సీఈవో జాక్‌ డోర్సీకి లేఖ రాసింది. భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను అగౌరవపరిచేందుకు చేసే ఏ ప్రయత్నము ఆమోదయోగ్యం కాదని తీవ్రంగా హెచ్చరిస్తూ లేఖ రాసింది. ట్విట్ట‌ర్ సెట్టింగ్స్‌లో లేహ్ ప్రాంతాన్ని చైనాలో ఉన్న‌ట్లు చూపించ‌డంతో ఎల‌క్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ‌శాఖ ఈ నేప‌థ్యంలో ట్విట్ట‌ర్ సీఈవో జాక్ డోర్సీకి లేఖ రాసింది. భార‌తీయ భౌగోళిక మ్యాప్‌ ను త‌ప్పుడుగా చూపిస్తున్నార‌ని ఆ లేఖ‌లో ట్విట్ట‌ర్ ప‌ట్ల విముఖ‌త వ్య‌క్తం చేసింది. ఐటీశాక కార్య‌ద‌ర్శి అజ‌య్ సాహానే ఈ లేఖ రాశారు.

ఈ తరహా ప్ర‌య‌త్నాల వ‌ల్ల ట్విట్ట‌ర్ సంస్థ‌కు చెడు పేరు వ‌స్తుంద‌ని, దాని విశ్వ‌స‌నీయ‌త‌పైన కూడా అనుమానాలు వ్య‌క్తం అవుతాయ‌న్నారు, కేంద్రం రాసిన లేఖ పై .. ట్విట్ట‌ర్ సంస్థ స్పందించింది. భార‌త ప్ర‌భుత్వంతో ప‌నిచేసేందుకు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు ట్విట్ట‌ర్ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు. సున్నిత‌మైన అంశాల‌ను గుర్తిస్తామ‌ని, భారత ప్రభుత్వం రాసిన లేఖ‌ను అందుకున్న‌ట్లు చెప్పారు. ఆదివారం చోటుచేసుకున్న సాంకేతిక స‌మ‌స్య‌ను గుర్తించామ‌న్నారు. జియో ట్యాగ్ స‌మ‌స్య‌ను వెంట‌నే గుర్తించి ప‌రిష్క‌రించామ‌న్నారు.

ఇకపోతే , గ‌త ఏడాది ల‌డాఖ్‌ను భార‌త ప్ర‌భుత్వం కేంద్ర పాలిత ప్రాంతంగా ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. చట్టసభలలో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ ను, చట్టసభలు లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ను ఏర్పాటు చేసింది. అయితే ఇటీవ‌ల ల‌డాఖ్ స‌రిహ‌ద్దుల్లో చైనాతో స‌రిహ‌ద్దు వివాదం ఉత్ప‌న్న‌మైంది. జూన్ 15న జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌తీయ సైనికులు మృతిచెందారు. లేహ్ ‌లో ప‌లు ప్రాంతాల్లో భార‌తీయ ద‌ళాల‌ ఫార్వ‌ర్డ్ పోస్టులు ఉన్నాయి. ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌ తో పాటు త్రివిధ ద‌ళాల చీఫ్‌లు కూడా లేహ్ ఫార్వ‌ర్డ్ పోస్టుల‌ను సంద‌ర్శించిన విష‌యం తెలిసిందే.
Tags:    

Similar News