రోనాల్డో.. మెస్సిలపై జోకులే జోకులు

Update: 2018-07-01 09:52 GMT
క్రిస్టియానో రొనాల్డో.. లియొనెల్ మెస్సి.. ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాళ్లలో వీళ్లిద్దరికీ చోటుంటుంది. క్లబ్ ఫుట్‌ బాల్ వీళ్లు సాధించిన ఘనతలు అన్నీ ఇన్నీ కావు. కానీ అంతర్జాతీయ ఫుట్‌ బాల్‌ లో మాత్రం రొనాల్డో - మెస్సి ఆశించిన స్థాయిలో రాణించలేదు. ప్రపంచకప్‌ లోనూ వీరి ప్రదర్శన అంతంతమాత్రం. ఇప్పటికే తలో మూడుసార్లు ప్రపంచకప్ ఆడారు కానీ తమ జట్లకు కప్పు అందించలేకపోయారు. మెస్సి జట్టు గత ప్రపంచకప్‌ లో ఫైనల్ దాకా వెళ్లింది కానీ.. కప్పు అందుకోలేకపోయింది. రొనాల్డో టీం పోర్చుగల్.. అతను ఆడినపుడు ఒక్కసారి కూడా క్వార్టర్స్ కూడా చేరలేదు. ఈసారి ఈ రెండు జట్లూ ప్రిక్వార్టర్స్‌ లోనే వెనుదిరిగాయి. ఈ రెండు మ్యాచ్‌ లూ శనివారం రాత్రే జరిగాయి.

ఫ్రాన్స్‌ పై మెస్సి.. ఉరుగ్వేపై రొనాల్డో విఫలమయ్యారు. ఈ ఇద్దరు సూపర్ స్టార్ల ప్రపంచకప్ కల ఒకే రోజు చెదిరిపోయింది. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. మెస్సి కానీ.. రొనాల్డో కానీ.. ఇప్పటిదాకా నాకౌట్ దశలో ఒక్కటంటే ఒక్క గోల్ కొట్టకపోవడంతో వారిని ట్రోల్ చేస్తూ పెద్ద ఎత్తున జోకులు పేలుస్తున్నారు. రెండు గొర్రెల్ని చూపిస్తూ ఎయిర్ పోర్టులో స్వదేశానికి వెళ్లే విమానం కోసం ఎదురు చూస్తున్న మెస్సి, రొనాల్డో అని ట్వీట్ చేశాడు ఓ కుర్రాడు. మరో వ్యక్తి నాకౌట్ వీళ్లు గోల్ చేయకపోవడాన్ని ఎద్దేవా చేస్తూ జోక్ పేల్చాడు. వీళ్లు క్లబ్ ఫుట్‌ బాల్‌ లో మాత్రమే హీరోలని.. ప్రపంచకప్‌ లో జీరోలని మరో వ్యక్తి ఎద్దేవా చేశాడు. ప్రస్తుతం మెస్సి వయసు 31 ఏళ్లు. రొనాల్డోకు 33 ఏల్లు పూర్తయ్యాయి. ఇంకో నాలుగేళ్ల తర్వాత వీళ్లిద్దరూ మళ్లీ ప్రపంచకప్ ఆడటం దాదాపు అసాధ్యమే అని భావించాలి.


Tags:    

Similar News