రివీల్‌: మోడీ హ‌త్య‌కు స్కెచ్ వేసిన ఐసిస్

Update: 2018-05-12 07:41 GMT
ప్ర‌ధాని మోడీని హ‌త‌మార్చేందుకు ఐసిస్ స్కెచ్ వేసిన వైనం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. గ‌త ఏడాది గుజ‌రాత్ యాంటీ టెర్ర‌ర్ స్క్వాడ్ కి ప‌ట్టుబ‌డిన నిందితుల్ని విచారించిన సంద‌ర్భంగా ఈ దారుణ‌మైన ప్లాన్ వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

మోడీని ఓ స్నైప‌ర్ రైఫిల్ తో హ‌త‌మార్చేందుకు ప్లాన్ చేసిన‌ట్లుగా గుజ‌రాత్ ఏటీఎస్ త‌న ఛార్జ్ షీట్లో పేర్కొంది. త‌మ అదుపులోకి తీసుకున్న ఐసిస్ కు చెందిన అహ్మ‌ద్ మీర్జా.. మ‌హ్మ‌ద్ ఖాసీం స్టింబెర్ వాలాలు ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు వెల్ల‌డించారు. నిందితుల్లో ఒక‌రైన మీర్జాకు గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ద్వారా మోడీ హ‌త్య‌కు సంబంధించి వాట్సాప్ ద్వారా మాట్లాడిన సంద‌ర్భంలో ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఫెరారీ అనే మారుపేరుతో 2016 సెప్టెంబ‌రు 10న మీర్జాతో వాట్సాప్ చాట్ చేసిన‌ట్లుగా ఏటీఎస్ చార్జిషీట్లో పొందుప‌ర్చారు. తుపాకుల కొనుగోలుకు సంబంధించి కూడా వారి మ‌ధ్య సంభాష‌ణ సాగిన‌ట్లుగా తేలింది. ఒక స్నైప‌ర్ రైఫిల్ తో మోడీని హ‌త్య చేద్దాం.. ఇన్షా అల్లా అని ఫెరారీ పేర్కొన్న‌ట్లుగా ఛార్జిషీట్ లో పేర్కొన్నారు.

అదే స‌మ‌యంలో ఓ ర‌ష్య‌న్ త‌యారీ గ‌న్ గురించి ఫెరారీ ప్ర‌స్తావించ‌గా.. త‌న‌కు ఆ తుపాకీ కావాల‌ని మీర్జా చెప్పిన‌ట్లుగా గుర్తించారు. అంతే కాదు వీరిద్ద‌రి మ‌ధ్య వాట్సాప్ చాట్ జ‌రిగిన వైనాన్ని గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి జ‌మైకాకు చెందిన అబ్దుల్లా ఫైజ‌ల్ అనే మ‌త‌బోధ‌కుడు పరారీలో ఉన్న‌ట్లుగా ఏటీఎస్ పేర్కొంది. మోడీ హ‌త్య‌కు ప్లాన్ చేసిన నిందితులు దేశంలోని యూదుల‌పై కూడా దాడుల‌కు ప్లాన్ చేసిన‌ట్లుగా గుర్తించారు. ప‌లు సెక్ష‌న్ల కింద వీరిపై కేసులు న‌మోదు చేశారు.

అయితే, ఈ వార్త‌పై కొన్ని ఆరోప‌ణ‌లు కూడా వ‌స్తున్నాయి. స‌రిగ్గా ఎన్నిక‌ల టైంలో ఆయ‌న హ‌త్య‌కు కుట్ర‌లు బ‌య‌ట‌ప‌డ‌తాయి. ఇది ఎన్నిక‌ల స్టంటా?  కుట్ర నిజ‌మేనా అని కామెంట్లు వ‌స్తున్నాయి. ఏదైనా దేశ‌ ప్ర‌ధాని క్షేమం - దేశ క్షేమం.
Tags:    

Similar News