జమిలి ఎన్నికలకు మద్దతు

Update: 2021-03-17 06:30 GMT
జమిలి ఎన్నికల నిర్వహణకే పార్లమెంటరీ కమిటి మద్దతు పలికింది. దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంటు-అసెంబ్లీలకు ఎన్నికలు జరపాలనే ప్రతిపాదనను నరేంద్రమోడి తెచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఈ ప్రతిపాదనపై జాతీయస్ధాయిలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. మొదట్లో జమిలి ఎన్నికలు సాధ్యం కాదని అభిప్రాయపడిన కేంద్ర ఎన్నికల కమీషన్ కూడా తర్వాత మనసు మార్చుకున్నది.

జాతీయస్ధాయిలోని రాజకీయపార్టీల నేతలతో ఇదే విషయమై అభిప్రాయాలు కూడా సేకరించింది. అందులో సహజంగానే ప్రధానమంత్రి ప్రతిపాదనకు మొగ్గు కనిపించింది. అప్పటి నుండి కేంద్ర హోంశాఖ సూచనల ప్రకారం ఎన్నికల కమీషన్ జమిలిపై కసరత్తులు చేస్తోంది. ఈ నేపధ్యంలోనే జమిలి ఎన్నికల నిర్వహణపై అధ్యయనం చేయటానికి కేంద్ర న్యాయశాఖ పార్లమెంటరీ కమిటిని నియమించింది.

అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న కమిటి జమిలి ఎన్నికల నిర్వహణ వల్ల చాలా లాభాలున్నట్లు తేల్చింది. సమయం ఆదా అవటంతో పాటు ఎన్నికల నిర్వహణకు నిధులు కూడా తగ్గుతుందని చెప్పింది. అలాగే రాజకీయపార్టీల వ్యయం కూడా బాగా తగ్గిపోతుందని తేల్చింది. 1952, 1957, 1962లో జమిలి ఎన్నికలే జరిగిన విషయాన్ని కూడా కమిటి తన రిపోర్టులో గుర్తుచేసింది. అయితే జమిలి ఎన్నికలు పెట్టాలంటే రాజ్యాంగాన్ని సవరించాలని కూడా గుర్తుచేసింది.

కమిటి రిపోర్టు బాగానే ఉంది కానీ అసలు సమస్యను ప్రస్తావించలేదు. పార్లమెంటుకు అయినా అసెంబ్లీకి అయినా షెడ్యూల్ కాలపరిమితి 5 ఏళ్ళు. మరి మధ్యలోనే ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వం కూలిపోతే అప్పుడేం చేయాలి ? లేకపోతే కేంద్రప్రభుత్వమే పడిపోతే అప్పుడేం చేయాలి ? అన్నదే అసలైన ప్రశ్న. ఎక్కడైనా మధ్యంతర ఎన్నికలు వస్తే అప్పుడు జమిలి స్పూర్తి దెబ్బతింటుంది.

1962 ఎన్నికల తర్వాత వివిధ రాష్ట్రాల్లో లేదా పార్లమెంటుకు మధ్యతర ఎన్నికలు వచ్చిన కారణంగానే జమిలి గతి తప్పింది. ఇదే సమస్య భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఎక్కడైనా మధ్యంతర ఎన్నికలు వస్తే ఏమి చేయాలనే ప్రశ్నకు పార్లమెంటరీ కమిటి సమాధానం చెప్పకపోవటం గమనార్హం.  అసలైన సమస్యకు  పరిష్కారం కనుక్కోకుండా మిగిలిన అంశాలపై ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఉపయోం ఉండదు.
Tags:    

Similar News