మీడియాకు.. ఐటీకి రేవంత్ పై అజ్ఞాత లేఖ?

Update: 2018-09-28 04:55 GMT
తెలంగాణ‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త‌న‌పై ఐటీ.. ఈడీ దాడులు చేస్తుంద‌ని.. త‌నపైనా త‌న ఆస్తుల‌పైనా అధికారులు త‌నిఖీల పేరుతో త‌న‌ను వేధింపుల‌కు గురి చేస్తార‌ని.. ఇవ‌న్నీ కూడా త‌న రాజ‌కీయంగా త‌న‌ను దెబ్బ తీసేందుకేనంటూ తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌డిచిన నాలుగు రోజులుగా త‌న‌పై అధికారుల త‌నిఖీలు ఉంటాయ‌ని చెప్పిన‌ట్లే.. తాజాగా ఐటీ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించారు. దాదాపు 15 చోట్ల‌కు పైనే ప్రాంతాల్లో ఏక కాలంలో త‌నిఖీలు నిర్వ‌హించ‌టం సంచ‌ల‌నంగా మారింది.

అంతేకాదు.. కొడంగ‌ల్ లో ఉన్న రేవంత్ ను త‌క్ష‌ణ‌మే హైద‌రాబాద్ కు రావాల‌ని అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేప‌థ్యంలో ఆయ‌న హుటాహుటిన న‌గ‌రానికి ప్ర‌యాణం అయ్యారు. ఇదంతా ఒక ఎత్తు అయితే రేవంత్ ఆస్తుల‌కు సంబంధించి మీడియాకు.. ఐటీ అధికారుల‌కు అజ్ఞాత లేఖ ఒకటి అందింది. అందులోని అంశాలు సంచ‌ల‌నంగా మారాయి.

రేవంత్ భారీగా అక్ర‌మాస్తుల్ని కూడ‌బెట్టిన‌ట్లుగా అందులో పేర్కొన‌టం ఒక ఎత్తు అయితే.. ఆ లేఖ‌లో పేర్కొన్న దాని ప్ర‌కారం రేవంత్ 2009.. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ఆఫిడ‌విట్ లో పేర్కొన్న దాని కంటే చాలా ఎక్కువ ఆస్తులు కూడ‌బెట్టిన‌ట్లుగా పేర్కొన్నారు.

2009 ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో రేవంత్ పేర్కొన్న దాని ప్ర‌కారం ఆస్తుల విలువ రూ. 3.6 కోట్లు కాగా అప్పులు రూ.73 ల‌క్ష‌లుగా చూపించారు. అదే స‌మ‌యంలో 2014 లో త‌న ఆస్తుల విలువ 13.2 కోట్లకు పెర‌గ్గా.. అప్పులు  3.3 కోట్లుగా వెల్ల‌డించారు. అయితే.. ఈ లెక్క‌ల‌కు పొంత‌న లేని రీతిలో ఐటీ శాఖ‌కు రేవంత్ స‌మ‌ర్పించిన ప‌త్రాల్లో లేవ‌న్న వాద‌న‌ను లేఖ‌లో పేర్కొన్నారు.

రేవంత్‌కు హాంకాంగ్.. కౌలంపూర్ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న‌ట్లుగా వెల్ల‌డించారు. వీటిల్లో కోట్లాది రూపాయిలు జ‌మ అయిన‌ట్లుగా చెబుతున్నారు. ఒకే రోజు రూ.20 కోట్ల‌కు పైగా విలువైన విదేశీ క‌రెన్సీ రేవంత్ ఖాతాలో జ‌మ అయిన‌ట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఈ మొత్తాన్ని 2014 ఎన్నిక‌ల అఫిడ‌విట్లో చూపించ‌లేద‌ని చెబుతున్నారు.

ఈ భారీ మొత్తం మ‌నీ లాండ‌రింగ్.. హ‌వాలా మార్గాల్లో రేవంత్ బ్యాంకు ఖాతాల్లోకి చేరి ఉంటుంద‌న్న అనుమానాన్ని వ్య‌క్తం చేశారు. అంతేకాదు.. 19 కంపెనీల్లో రేవంత్‌ కు ప్ర‌త్య‌క్షంగా కానీ ప‌రోక్షంగా కానీ సంబంధాలు ఉన్న‌ట్లుగా పేర్కొన్నారు. ఈ కంపెనీల్లో డైరెక్ట‌ర్లుగా ఉన్న 23 మందితో ఆయ‌న‌కు ద‌గ్గ‌రి బంధుత్వం ఉన్నట్లుగా ఆరోపిస్తున్నారు.

రేవంత్ కు చెందిన కంపెనీలు ఉప్ప‌ల్‌.. గోప‌న్ ప‌ల్లి..  కోకాపేట‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ప్లాట్లు.. నంద‌గిరి హిల్స్ లో వాణిజ్య ఫ్లాట్లు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఇత‌ర ప్రాంతాల్లో భూములు కూడా రేవంత్‌కు భారీగా ఉన్న‌ట్లు చెబుతున్నారు. 2014 నుంచి 2017 మ‌ధ్య కాలంలో ఐటీ రిట‌ర్న్స్ ప్ర‌కారం చూస్తే రేవంత్ కానీ ఆయ‌న స‌తీమ‌ణి ఆస్తులు ఏడాదికి రూ.ఐదారు ల‌క్ష‌ల‌కు మించ‌ని ప‌రిస్థితి. అలాంటప్పుడు భారీగా ఆస్తులు ఎలా కూడ‌బెట్టారు? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా  మారింది. ఈ వివ‌రాల్లో నిజం ఎంత‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఇంత‌కీ ఈ అజ్ఞాత లేఖ రాసిందెవ‌రు?  కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఈ త‌ర‌హా లేఖ‌ల మ‌ర్మం ఏమిటి? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.


Tags:    

Similar News