తొలిరోజున దెబ్బేసిన ఎల్ఐసీ షేరును ఏం చేయాలి?

Update: 2022-05-18 05:30 GMT
ఇప్పుడు ఇక్కడ చెప్పే అంశాలేవీ మా సొంతం కాదు. స్టాక్ మార్కెట్ మీద అనుభవం.. అవగాహన ఉన్న నిపుణులు చెప్పిన మాటల్ని మాత్రమే చెబుతున్నాం. వీటిని నమ్మేసి.. దాని ప్రకారం నిర్ణయం తీసుకోవటం సరికాదని స్పష్టం చేయదలుచుకున్నాం. షేర్ మార్కెట్ మీద ఎవరికి వారికి సొంత అవగాహన ఉంటుంది. దానికి నిపుణులు చెప్పే అంశాల్ని పరిశీలించి..సొంత విచక్షణతో మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే జరిగే నష్టం అందరికి ఇబ్బంది కలిగించేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. దేశీయ స్టాక్ మార్కెట్ లోకి ఒక షేర్ లిస్టు అయ్యే క్రమంలో జరిగే చర్చ ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. ప్రఖ్యాత బీమా సంస్థ ఎల్ ఐసీ షేర్లు స్టాక్ మార్కెట్లో నమోదైన తొలిరోజునే డీలా పడటం తెలిసిందే.

ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే దాదాపు రూ.81.8 తక్కువకు రూ.867.2 వద్ద బీఎస్ ఈలో నమోదు కాగా..ఇంట్రాడేలో రూ.860.10కు దిగి వచ్చింది. చివరకు రూ.73.55 నష్టం (దగ్గర దగ్గర 7.7 శాతం)తో రూ.875.45 వద్ద ముగిసింది. మొత్తంగా 27.52 లక్షల షేర్లు చేతులు మారాయి. తొలిరోజు ట్రేడింగ్ ముగిసే నాటికి ఎల్ ఐసీ మార్కెట్ విలువ రూ.5.54 లక్షల కోట్లుగా నమోదైంది. దీంతో.. దేశంలోనే అత్యధిక మార్కెట్ విలువ కలిగిన ఐదో కంపెనీగా నిలిచింది.

ఐపీవోలో షేర్లు అలాట్ అయిన మదుపరికి మొదటి రోజు జరిగిన నష్టం ఎంతన్నది చూస్తే.. ఒక లాట్ (15 షేర్లు) కేటాయింపు జరిగాయి. ఇష్యూ ధర రూ.949 ప్రకారం చూస్తే.. ఒక్కొక్కరు రూ.14,235 చెల్లించారు. తొలిరోజు స్టాక్ మార్కెట్లోకి లిస్టు కావటం..మార్కెట్ లో నెలకొన్న కారణాలు కానీ ఇతరత్రా అంశాలతో ఒక్కో షేరు అలాట్ అయిన దాని కంటే రూ.73.55 చొప్పున తగ్గింది. అంటే.. పెట్టిన పెట్టుబడిలో మొదటి రోజు నష్టం రూ.1103.25గా చెప్పాలి.

దీంతో.. పెట్టిన రూ.14,235 పెట్టుబడి కాస్తా రూ.13131.75కు ఒకవేళ తగ్గింది. ఒకవేళ అలాట్ మెంట్ వేళ పాలసీదారుకు డిస్కౌంట్ రూపంలో అలాట్ అయితే మాత్రం వారికి తొలిరోజున వచ్చిన నష్టం రూ.428.25 మాత్రమే. ఎందుకంటే.. మిగిలిన వారితో పోలిస్తే వీరికి ఒక్కో షేరుకు రూ.45 చొప్పున డిస్కౌంట్ ఇవ్వటం తెలిసిందే.  ఎన్నో ఆశలతో ఎల్ ఐసీ షేర్లలో పెట్టుబడి పెట్టి.. అలాట్ అయిన వారంతా మొదటి రోజున నష్టపోవటంతో నిరాశ వ్యక్తమవుతోంది. షేర్లు అలాట్ కాలేదని బాధ పడినోళ్లకు.. మొదటి రోజు తగ్గిన ధరలో కొనుగోలు చేయటం ద్వారా లాభాల్ని స్వీకరించినట్లైంది. మరి.. ఇలాంటి వేళ.. ఈ షేర్లను ఉంచుకోవాలా? వద్దా? అన్నది ప్రశ్నగా మారింది.

దీనికి మార్కెట్ నిపుణులు చెప్పే మాటేమిటన్నది చూస్తే..

- స్టాక్ మార్కెట్లో నెలకొన్న అనూహ్య పరిస్థితులు.. ఒడుదొడుకుల కారణంగానే తొలిరోజున పేలవ ప్రదర్శన జరిగింది.
- మంచి ప్రతిఫలం కోసం దీర్ఘకాలానికి షేరును అట్టి పెట్టుకోవటంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.
- తొలిరోజు జరిగిన నష్టం విషయానికి వస్తే.. డిస్కౌంట్ ధరకు షేర్లు అలాట్ అయినవారికి వాటిల్లిన నష్టం మిగిలిన వారితో పోలిస్తే బాగా తక్కువ.
- ఐపీవోలో కేటాయింపు ద్వారా షేర్లు పొందిన మదుపర్లు రూ.800 దరిదాపులో స్టాప్ లాస్ పెట్టుకొని.. వాటిని దీర్ఘకాలానికి అట్టి పెట్టుకోవటం మంచిది. ప్రతి 5 శాతం ధర తగ్గినప్పుడల్లా మరిన్నిషేర్లు కొనుగోలు చేసుకోవచ్చు.
- కొత్తగా కొనుగోలు చేసే వారు మాత్రం రూ.730 కంటే కిందకు రానంతవరకు ఒక క్రమపద్దతిలో కొంచెం కొంచెం కొనుక్కోవచ్చు.
- గత ఆర్థిక సంవత్సరం ఎల్ ఐసీ ఎలాంటి డివిడెండ్ ఇవ్వలేదు. ఈసారి ఆకర్షణీయమైన డివిడెండ్ ను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఫ్యూచర్ లో షేరు ధర పెరిగే అవకాశం ఉంది.
- పోటీ పరంగా ఎల్ఐసీకి పలు సానుకూలతలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలానికి షేరును అట్టి పెట్టుకోవచ్చు.
- షేరు ధరలో స్థిరత్వం వచ్చే వరకు కొత్తగా కొనాలనుకునే వారు వెయిట్ చేయటం మంచిది. దీర్ఘకాలానికి షేర్లు అట్టిపెట్టుకోవాలనుకునే వారు రూ.735 స్టాప్ లాస్ ను తప్పక పెట్టుకోవటం మంచిది.

ముఖ్య గమనిక.. చివరగా మరోసారి మేం చెప్పేదేమంటే.. ఈ వాదనలన్ని కూడా మార్కెట్ నిపుణులు చెబుతున్నవి. వీటిని నమ్మాలా? వద్దా? అని చెప్పట్లేదు. మార్కెట్ పరిస్థితుల్ని విశ్లేషించి మీకు చెబుతున్నాం. అంతిమ నిర్ణయం మీ విచక్షణతో తీసుకోండి. ఎందుకంటే లాభ నష్టాల్ని భరించాల్సింది మీరే అన్నది మర్చిపోవద్దు.
Tags:    

Similar News