ర‌విప్ర‌కాశ్ మాట‌ల్లో అస‌త్యాలు ఎన్నంటే?

Update: 2019-06-12 04:44 GMT
టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ చేసిన ఆరోప‌ణ‌ల్లో నిజం లేదంటూ టీవీ9 కొత్త యాజ‌మాన్యం అలంద మీడియా అండ్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌.. పాత యాజ‌మాన్యం శ్రీ‌నిరాజు సంస్థ‌లైన చింత‌ల‌పాటి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్.. ఐల్యాబ్స్ వెంచ‌ర్ క్యాపిట‌ల్ ఫండ్ స్పందించాయి.

త‌న బెయిల్ పిటిష‌న్ పై కోర్టులో జ‌రుగుతున్న విచార‌ణ సంద‌ర్భంగా టీవీ9 స్టార్టింగ్ లో హ‌వాలా మార్గంలో పెట్టుబ‌డులు వ‌చ్చిన‌ట్లుగా ఆరోపించ‌టం తెలిసిందే. అదే రీతిలో కొత్త యాజ‌మాన్యం సైతం హ‌వాలా మార్గంలో డ‌బ్బులు గుమ్మ‌రిస్తున్న‌ట్లుగా మ‌ర‌కేశారు ర‌విప్ర‌కాశ్‌.

అయితే.. ఆయ‌న మాటల్లో నిజం కంటే అబ‌ద్ధాలే ఎక్కువ‌ని పేర్కొంటున్నారు. ఫోర్జ‌రీకి పాల్ప‌డి క్రిమిన‌ల్ కేసుల్లో ఇరుక్కొని.. అరెస్ట్ ను ఎదుర్కొంటున్న ర‌విప్ర‌కాశ్‌.. ఎలాగైనా బెయిల్ పొంద‌టానికి త‌మ మీద లేనిపోని ఆరోప‌ణ‌ల్ని ప్ర‌చారంలోకి తేవ‌టాన‌ని కొత్త పాత యాజ‌మాన్యంలోని సంస్థ‌లు తాజాగా వివ‌ర‌ణ ఇస్తున్నాయి.

తాను కేసుల్లో ఇరుక్కొని.. వాటి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు.. విచార‌ణ‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు ర‌విప్ర‌కాశ్ కొత్త త‌ర‌హా ఆరోప‌ణ‌ల‌కు దిగార‌న్న వాద‌న‌ను వినిపిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పాత యాజ‌మాన్యం నుంచి కొత్త యాజ‌మాన్యానికి మ‌ధ్య జ‌రిగిన షేర్ ప‌ర్చేజ్ డీల్ మీద ర‌విప్ర‌కాశ్ కూడా సంత‌కం పెట్ట‌టం ఒక ఎత్తు అయితే.. డీల్ జ‌రిగిన తొమ్మిది నెల‌ల త‌ర్వాత‌.. అది కూడా మోసం కేసు మీద ప‌డిన త‌ర్వాత ఏదేదో జ‌రిగింద‌ని ర‌విప్ర‌కాశ్ రియాక్ట్ కావ‌టం దేనికి నిద‌ర్శ‌నం అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌.

ఇందులో భాగంగా టీవీ9 అమ్మిన పాత‌.. కొన్న యాజ‌మాన్యాలు క‌లిసి ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశాయి. ఇందులో.. డీల్ కు సంబంధించిన అన్ని వివ‌రాల్ని వారు వెల్ల‌డించారు. ర‌విప్ర‌కాశ్ ఆరోప‌ణ‌లకు అస‌లు నిజం ఏమంటే?

+  ‘2018 - ఆగస్టు నాటికి చింతలపాటి హోల్డింగ్స్ - ఐ ల్యాబ్స్ - క్లిపోర్డ్‌ ఫెరీరా - ఎంవీకేఎన్‌ మూర్తిలకు టీవీ9 మాతృసంస్థ ఏబీసీఎల్‌ లో 90.54 శాతం వాటా ఉండేది. ఈ వాటా మొత్తాన్ని ఆగస్టు 24 - 2018న అలంద మీడియా కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ రూ.414 కోట్లు. దీనికి సంబంధించిన షేర్‌ పర్చేజ్‌ ఒప్పందాన్ని చట్టబద్ధంగా చేసుకుని - నిధుల బదిలీని పూర్తిగా బ్యాంకుల ద్వారానే జరిపింది.

+  రవిప్రకాశ్‌ ఆరోపిస్తున్నట్లు ఇందులో ఎలాంటి నగదు లావాదేవీ అన్నదే జరగలేదు. ఏబీసీఎల్‌ కు అప్పటికి ఉన్న బకాయిలను చెల్లించడానికి అలంద మీడియా రూ.150 కోట్లు నేరుగా సంస్థ ఖాతాల్లోకి బదిలీ చేయగా - మిగిలిన రూ.264 కోట్లు పాత ప్రమోటర్లకు బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరిగాయి.

+  ఈ లావాదేవీలు పాత - కొత్త ప్రమోటర్ల రికార్డుల్లో నమోదయ్యాయి. సంస్థ యాజమాన్య బదిలీపై కేంద్ర సమాచార ప్రసార మం త్రిత్వ శాఖకు కూడా సమాచారమిచ్చాం. ఈ వ్యవహారమంతా చట్టపరిధిలోనే జరిగింది తప్ప - ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదు.

+  బదిలీ వ్యవహారం ఆగస్టు 2018 లోనే జరిగింది. ఆ సమయంలో టీవీ9 సీఈవోగా ఉన్న రవిప్రకాశ్ - షేర్‌ పర్ చేజ్‌ అగ్రిమెంట్‌ పై సంతకం కూడా చేశారు. అయినప్పటికీ, 9 నెలల తర్వాత - రవిప్రకాశ్‌ ఈ ఆరోపణలు చేయడం చూస్తుంటే, ఫోర్జరీ కేసుల విషయంలో తాను ఎదుర్కొంటున్న క్రిమినల్‌ విచారణను పక్కదారి పట్టించడానికి - తనను తాను కాపా డుకోవడానికి చేస్తున్న పనే అని అర్థమవుతోంది.

+   సైఫ్‌ త్రీ మారిషస్‌తో కుదిరిన సెటిల్ మెంట్‌ వ్యవహారం పైనా రవిప్రకాశ్‌ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. టీవీ9 విక్రయం జరిగే సమయానికి హైదాబాద్‌ లోని నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ లో సైఫ్‌ త్రీ కంపెనీ వేసిన ఓ కేసు పెండింగ్‌ లో ఉంది.

+   ఐ విజన్‌లో ఉన్న వాటాల విషయంలో సైఫ్‌ త్రీ ఈ కేసు వేసింది. అయితే.. ఇది సెటిల్ మెంట్‌ అగ్రిమెంట్‌ ద్వారా పరిష్కారం అయ్యింది. దీనికి సంబంధించి ఆర్‌ బీఐ నియమ నిబంధనలకు లోబడి బ్యాంకుల ద్వారానే చెల్లింపు జరిగింది. నిధులను స్వీకరించిన తర్వాత - సైఫ్‌ త్రీ కేసును ఉపసంహరించుకోవడానికి ఎస్‌ సీఎల్‌ టీ అనుమతి కూడా ఇచ్చింది.

+  ర‌విప్ర‌కాశ్ చేసిన ఆరోప‌ణ‌ల్లో అవాస్త‌వాల‌పై న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాం.


Tags:    

Similar News