మోడీ బుల్లెట్ ట్రైన్ అంద‌రిని చంపేస్తుంద‌ట‌

Update: 2017-10-01 04:59 GMT
ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దిగారు మాజీ ఆర్థక‌మంత్రి చిదంబ‌రం. మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబ‌యి రైల్వే స్టేష‌న్లో జ‌రిగిన తొక్కిస‌లాట నేప‌థ్యంలో ఆయ‌న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై మండిప‌డుతున్నారు. ఈ ప్రాజెక్టు పెద్ద నోట్ల ర‌ద్దు లాంటిదేన‌న్నారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ప్ర‌తి ఒక్క‌రిని చంపుకుంటూ పోతుందంటూ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

రైలు భ‌ద్ర‌త‌ను మెరుగుప‌ర్చ‌కుండా ఈ ప్రాజెక్టుపై చేస్తున్న భారీ ఖ‌ర్చుపై ఆయ‌న త‌ప్పు ప‌డుతున్నారు. ముంబ‌యి రైల్వేస్టేష‌న్ లో చోటు చేసుకున్న తొక్కిస‌లాట నేప‌థ్యంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ప్ర‌స్తావ‌న‌ను చిదంబ‌రం తీసుకురావ‌టం గ‌మ‌నార్హం భ‌ద్ర‌త‌తో పాటు బుల్లెట్ ట్రైన్ ప్ర‌తి విష‌యాన్ని చంపుకుపోవ‌టం ఖాయ‌మ‌న్న వాద‌న‌ను ఆయ‌న వినిపించారు.  

బుల్లెట్ ట్రైన్ కంటే కూడా రైలు భ‌ద్ర‌త‌కు అవ‌స‌ర‌మైన స‌దుపాయాల పైనా మోడీ స‌ర్కారు దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. బుల్లెట్ ట్రైన్ సాధార‌ణ ప్ర‌యాణికుల కోసం కాద‌ని.. డ‌బ్బు.. ప‌లుకుబ‌డి ఉన్న వారి కోస‌మే త‌ప్పించి మ‌రొక‌టి కాద‌న్నారు. రూ.1.10ల‌క్ష‌ల కోట్ల‌తో నిర్మిస్తున్న‌బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ప్రాజెక్టు విష‌యంపై విప‌క్ష నేత ఒక‌రు ఇంత తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

2022 నాటికి పూర్తి చేయాల‌ని భావిస్తున్న తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించిన మొద‌టి అడుగు సెప్టెంబ‌రు 14న ప్ర‌ధాని మోడీ.. జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబేలా చేతుల మీదుగా శంకుస్థాప‌న జ‌రిగింది. 500 కిలోమీట‌ర్ల దూరాన్ని  ఈ బుల్లెట్ ట్రైన్ కేవ‌లం రెండు గంట‌ల స‌మ‌యంలోనే చేరుకుంటోంది. దేశ ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను మ‌రింత వేగ‌వంతం చేసే అవ‌కాశం ఉన్న ఈ ప్రాజెక్టుపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇలాంటి వేళ‌.. చిదంబ‌రం మాట‌లు కొత్త ఆలోచ‌న‌ల్ని తీసుకురానున్నాయి. కొద్ది మంది ప్ర‌యోజ‌నాల కోసం భారీ ఎత్తున పెట్టుబ‌డులు పెట్టే క‌న్నా.. దేశ వ్యాప్తంగా ఉన్న రైళ్ల కొర‌త‌ను.. ర‌ద్దీని త‌గ్గించే అంశంపైనా.. అద‌న‌పు లైన్ మీద దృష్టి సారిస్తే బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News