దివాలా అంచున పాకిస్ధాన్ ?

Update: 2022-06-15 23:30 GMT
దాయాది దేశం కూడా దివాలా వైపు ప్రయాణం చేస్తోంది.  ఆర్థిక సంక్షోభం పెరిగిపోయిన కారణంగా  శ్రీలంక దివాలా తీసినట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రీలకంలో పరిస్ధితులు ఎంత దారుణంగా ఉన్నాయో అందరు చూస్తున్నదే.

ఇపుడు పాకిస్తాన్ లో పరిస్ధితులు కూడా దాదాపు అలాగే కనబడుతున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక పరిస్ధితి ఘోరంగా తయారైపోయింది. ఈ విషయాలన్నీ ఎవరో నిపుణులు అంచనా వేసినవి కావు. స్వయంగా పాకిస్ధాన్ ఆర్ధికశాఖ మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ చెప్పినవే.

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్ధాన్ కూడా తొందరలోనే శ్రీలంక లాగ అయిపోవటం ఖాయమని ఆందోళన వ్యక్తంచేశారు. తమ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పై రు. 19, డీజల్ పై 53 రూపాయలు రాయితీ ఇస్తోందట. ఇలాంటి రాయితీల వల్లే శ్రీలంక పరిస్ధితి ఇలాగైపోయిందన్నారు. కాబట్టి పాకిస్థాన్ లో పరిస్ధితులు శ్రీలంకలాగ మారకూడదంటే వెంటనే రాయితీలు ఎత్తేయాలని స్పష్టంగా ప్రకటించారు.

ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) కూడా పెట్రోలియం ఉత్పత్తులపై రాయితీలను ఎత్తేయాలని ఒత్తిడి పెడుతున్నట్లు మిఫ్తీ చెప్పటం సంచలనంగా మారింది. విద్యుత్ చార్జీలను కూడా పెంచాలని ఐఎంఎఫ్ గట్టిగా చెబుతోందన్నారు. దేశ ఆర్ధిక పరిస్ధితి గాడినపడాలంటే వెంటనే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని తాము ప్రధానమంత్రికి చెప్పినట్లు వివరించారు. ఎక్కువగా ఖర్చుచేసి శ్రీలంకలో చమురును కొంటున్నట్లే తమ దగ్గర కూడా తొందరలోనే అలాంటి పరిస్ధితులు తప్పవన్నారు.

తక్షణమే దేశం ఆర్థిక స్థిరత్వం సాధించాలంటే పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెంచక తప్పదని మంత్రి చెప్పారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఐఎంఎఫ్ నుంచి ఒత్తిడి తగ్గుతుందని అనుకుంటున్నట్లు మిఫ్తీ ఆశాభావం వ్యక్తంచేశారు.

పాకిస్ధాన్ ఆర్థిక పరిస్థితిపై ఐఎంఎఫ్ ఇంకా తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు మంత్రి చెప్పారు. చైనా బ్యాంకుల నుండి అప్పులు పుడితే తిరిగి ఆర్ధిక పరిస్థితి గాడినపడుతుందని అనుకుంటున్నట్లు చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయటంలో తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని మిఫ్తీ ప్రకటించారు.
Tags:    

Similar News