నెలలో రూ.2600 కోట్లు తాగేశారు

Update: 2020-11-09 06:30 GMT
విన్నంతనే ఉలిక్కిపడే రికార్డు ఒకటి తాజాగా నమోదైంది. కేవలం నెల రోజుల వ్యవధిలో తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మద్యం అమ్మకాలు ఎంతో తెలుసా? అక్షరాల రూ.2623 కోట్లు. నెల వ్యవధిలో ఇంత భారీగా మద్యం అమ్మకాలు సాగటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఆల్ టైం రికార్డుగా చెబుతున్న ఈ వైనం అధికారుల్ని మాత్రమే కాదు.. ప్రభుత్వ వర్గాల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మరో ఆసక్తికరమైన అంశం ఏమిటో తెలుసా? గత ఏడాది ఇదే అక్టోబరులో తెలంగాణ వ్యాప్తంగా సాగిన మద్యం అమ్మకాలు కేవలం రూ.1663 కోట్లు మాత్రమే. అంటే.. గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది అదే అక్టోబరులో నెలలో ఏకంగా వెయ్యి కోట్ల (కాస్త తక్కువగా) మేర మద్యం అమ్మకాలు సాగటం విశేషం. ఈ లెక్కన తెలంగాణ వ్యాప్తంగా మద్యం ఎంత భారీగా వినియోగిస్తున్నారో ఇట్టే అర్థం కాక మానదు.

ఇదిలా ఉంటే.. అక్టోబరులో ఇంత భారీ స్థాయిలో అమ్మకాలు నమోదు కావటానికి కారణం.. చివరి వారంలో జరిగిన కొనుగోళ్లుగా చెబుతున్నారు. అక్టోబరు 22 నుంచి 27 వరకు ఏ రోజు కూడా రూ.110 కోట్ల అమ్మకాలకు తగ్గకపోవటం గమనార్హం. మధ్యలో 24న రూ.99.8 కోట్ల మేర అమ్మకాలు సాగితే.. అత్యధికంగా 25.. 26 తేదీల్లో రోజుకు రూ.132 కోట్ల చొప్పున అమ్మకాలు జరగటం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది భారీగా అమ్మకాలు జరగటానికి కారణం ధరలు పెరటం ఒకటిగా చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే..ఈ ఏడాది అక్టోబరులో బీర్ కేసులు వినియోగం తగ్గగా.. లిక్కర్ అమ్మకాలు భారీగా పెరిగినట్లుగా గుర్తించారు. ఏమైనా.. కరోనా దెబ్బకు ప్రభుత్వ ఆదాయం తగ్గిందన్న వేళ.. మద్యం అమ్మకాలు ఇంత భారీగా జరగటంతో.. ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం సమకూరుతుందని చెప్పక తప్పదు.

    

Tags:    

Similar News