లిక్క‌ర్ స్కామ్‌: ఢిల్లీ సీఎం కేజ్రీకి సీబీఐ స‌మ‌న్లు.. 16న విచార‌ణ‌

Update: 2023-04-14 22:50 GMT
అనుకున్న‌దే జ‌రిగింది! ఢిల్లీలో వెలుగు చూసిన లిక్క‌ర్ కుంభ‌కోణంలో ఏ క్ష‌ణ‌మైనా.. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌ను విచారి స్తారంటూ... కొన్ని వారాలుగా జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు అదే నిజ‌మైంది. ఈ నెల 16న విచార‌ణ‌కు రావాలంటూ.. సీఎం కేజ్రీవాల్‌కు సీబీఐ స‌మ‌న్లు జారీ చేసింది. ఈ నెల 16న(ఆదివారం) ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి రావాలని కేజ్రీవాల్కు ఇచ్చిన సమన్లలో సీబీఐ పేర్కొంది.

ఇప్ప‌టికే కొంద‌రి అరెస్టు

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఈ కేసులో ఇప్ప‌టికే సీబీఐ, ఈడీ సంస్థ‌లు కొంద‌రిని అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా స‌హా.. తెలంగాణ‌కు చెందిన సంతోష్‌, ఏపీకి చెందిన ఎంపీ మాగుంట కుమారుడు ఉన్నారు. ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. మద్యం స్కామ్ కేసులో అరెస్టు నేపథ్యంలో ఫిబ్రవరి 28న మనీశ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు సిసోడియా జైలులో ఉండగానే.. కేజ్రీవాల్కు సీబీఐ సమన్లు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

ఆప్ ఫైర్‌!!

విచారణకు సీఎం కేజ్రీవాల్‌ను పిలవడంపై ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్‌_ తీవ్రంగా స్పందించింది. "అరవింద్ కేజ్రీవాల్కు సీబీఐ సమన్లు జారీ చేసింది. నోటీసుల్లో పేర్కొన్నట్లుగా.. ఏప్రిల్ 16న కేజ్రీవాల్ సీబీఐ ఎదుట హాజరవుతారు. ప్రధాన మంత్రికి నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నా. మీరు, మీ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయారు. సీబీఐ సమన్లతో అరవింద్ కేజ్రీవాల్ పోరాటాన్ని అడ్డుకోలేరు. ఏప్రిల్ 16న కేజ్రీవాల్ను అరెస్టు చేసి, జైలుకు పంపి, ఆయనపై చర్యలు తీసుకోవాలన్న మీ కుట్ర.. ఢిల్లీ సీఎం వాణిని అణచివేయలేదు" అని ఆప్‌ ఎంపీ సంజయ్ సింగ్ స్పష్టం చేశారు.

ఏం జ‌రిగింది?

రోజు రోజుకూ విస్త‌రిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును ప‌రిశీలిస్తే.. ఇది వాస్త‌వానికి రాజకీయంగానూ దుమారం రేపింది. 2021-22 ఆర్థిక సంవత్సరం కోసం ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రూపొందించిన మద్యం పాలసీలో అనేక లోటుపాట్లు ఉన్నాయనే ఆరోపణలు వ‌చ్చాయి. కొందరికి అనుచిత లబ్ధి చేకూర్చేలా ఈ నూతన మద్యం విధానం తయారు చేశారని విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే విషయమై ఢిల్లీ ప్ర‌భుత్వ ప్రధాన కార్యదర్శి ఓ నివేదిక ఇచ్చారు. ఆ సమయంలో అబ్కారీ శాఖ ఇన్ఛార్జ్ మంత్రిగా మనీశ్ సిసోడియా ఉన్నారు. ఈ వివాదం నేపథ్యంలో కొత్త మద్యం విధానాన్ని అమలు చేయకుండా.. రద్దు చేస్తున్నట్లు కేజ్రీవాల్ ప్ర‌భుత్వం ప్రకటించింది. కానీ, కేసులు మాత్రం వీడ‌డం లేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News