సీఎం అభ్యర్థి మీరేనా? త్రివర్ణ పతాకాన్ని డీపీగా మార్చాలా? కేటీఆర్ ఆన్సర్లు ఇవే

Update: 2022-08-06 07:14 GMT
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం అంత తేలికైన విషయం కాదు. అందునా.. కీలక పదవుల్లో ఉన్న వారికి ఇది కత్తి మీద సాముతో కూడుకున్నది. ఇలాంటి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలన్న దానిపై మంత్రి కేటీఆర్ కు బాగానే అవగాహన ఉందని చెప్పాలి. అందుకే ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అందులోని వారిని ఎలా డీల్ చేయాలో ఆయనకు బాగానే తెలుసు. తాజాగా ఆస్క్ కేటీఆర్ పేరుతో లైవ్ నిర్వహించారు. తనను ఏదైనా అడగొచ్చన్న మంత్రి కేటీఆర్.. నెటిజన్లు అడిగిన వివిధ ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు.

చిక్కరు దొరకరు.. అన్న చందంగా మంత్రి కేటీఆర్ సమాధానాలు ఉన్నాయని చెప్పాలి. ఇటీవల ప్రగతిభవన్ లో ఆయన జారి పడటం.. ఆయన్ను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పిన నేపథ్యంలో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఉత్సాహంతో బదులిచ్చారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగిన ప్రశ్నలకు తాను బాగున్నట్లుగా చెప్పిన కేటీఆర్.. టీఆర్ఎస్ నుంచి సీఎం అభ్యర్థి మీరేనా? అన్న సూటి ప్రశ్నను సంధించారు. దీనికి బదులిచ్చిన ఆయన.. ‘కేసీఆర్ గారి రూపంలో సమర్థుడైన ముఖ్యమంత్రి  మనకు ఉన్నారు. తెలంగాణ ప్రజల దీవెనలతో ఆయన హ్యాట్రిక్ కొడతారు’ అన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

బీజేపీ నేతలు ప్రచారంలో దూసుకుపోతుంటే..టీఆర్ఎస్ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నట్లు? అన్న ప్రశ్నకు బదులిచ్చిన కేటీఆర్.. ఒకింత ఘాటు వ్యాఖ్యను చేశారు. ‘ఖాళీ గిన్నెలకు మోత ఎక్కువ’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి కమలనాథులు ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.  

ఇక.. సెక్రటేరియట్ ఎప్పుడు సిద్ధమవుతుందని అడగ్గా.. దసరా నాటికి పూర్తి కావొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జాతీయ జెండాను సోషల్ మీడియాలో డీపీగా మార్చాలని ప్రధానమంత్రి చెప్పటంతో దేశ జీడీపీ పెరుగుతుందా? అన్న ప్రశ్నకు బదులిచ్చిన కేటీఆర్..‘‘సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్ మారిస్తే ఏం జరుగుతుంది? జీడీపీ మారితేనే దేశం ముందుకు వెళుతుంది’’ అంటూ మోడీ సర్కారుపై తనకున్న ఆగ్రహాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.

ఇక.. మోడీ వర్సెస్ కేసీఆర్ మధ్యనున్న పంచాయితీకి సంబంధించిన ప్రశ్నను సైతం మంత్రి కేటీఆర్ ఎదుర్కొన్నారు. ‘ఆర్నెల్లలో సీఎం కేసీఆర్ మూడుసార్లు ప్రోటోకాల్ ఉల్లంఢించారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తే సాదరంగా ఆహ్వానించరా? తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధాని కంటే గొప్పవారా? అని ప్రశ్నించిన సదరు వ్యక్తి.. తాను అడిగిన ప్రశ్నకు సమాధానం హిందీలో రాయాలన్నారు.

దీనికి బదులిచ్చిన మంత్రి కేటీఆర్.. ‘ప్రోటోకాల్ స్పష్టంగా పాటించాం. ప్రవేటు ప్రోగ్రాంలకు ప్రధానమంత్రి తెలంగాణకు వస్తే.. దానికి సీఎం సాదరంగా ఆహ్వానించాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాదు.. నెటిజన్ కోరినట్లుగా తన సమాధానాన్ని హిందీలో రాయాల్సిన అవసరం లేదని చెప్పటం గమనార్హం.
Tags:    

Similar News