మాల్యాకి మించిన మొనగాళ్ల గురించి తెలుసా?

Update: 2016-03-20 08:37 GMT
చక్కగా ఉద్యోగం చేస్తూ.. వచ్చే జీతం రాళ్లను జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటూ..కాస్త పొదుపు చేసుకొని బతికే సగటుజీవికి ఏదైనా అవసరం వచ్చి.. ఓ లచ్చ రూపాయిలు అప్పు అవసరమైతే ఆ కష్టమే వేరుగా ఉంటుంది. ఏళ్లకు ఏళ్లు శాలరీ అకౌంట్ ఉన్న బ్యాంక్ దగ్గర నుంచి.. మిగిలిన బ్యాంకుల దగ్గరకు వెళ్లి అప్పు అడిగితే సవాలచ్చ లెక్కలు చెబుతాయి?

మీ జీతం ఎంత? మీ ఉద్యోగం ఏమిటి? మీరు పని చేసే కంపెనీ ఏమిటి? మీకున్న అప్పులేంది? మీ చదువేంది? ఇలా సవాలచ్చ సందేహాల్ని సంధిస్తారు. అన్ని ఓకే అయ్యాక.. వడ్డీ రేటు చెబితే దిమ్మ తిరిగిపోతుంది. 17శాతం వరకు వడ్డీ రేటు చెబుతారు. అదేంటి అంత ఎక్కువా? అని అడిగితే మీకొచ్చే జీతం.. మీరు తీసుకునే అప్పు లెక్కకు తగ్గట్లు మీకు వేసే వడ్డీ ఉంటుందని చెబుతారు. ఇక..ప్రాసెసింగ్ దగ్గర నుంచి డబ్బులు తిరిగి కట్టే వరకూ చెప్పే లెక్కలు వింటే దిమ్మ తిరుగుతుంది.

లక్ష రూపాయిల అప్పుకు ఇన్ని లెక్కలు ఉంటే.. ఒకే కంపెనీకి వేలాది కోట్ల రూపాయిలు అప్పులు ఇచ్చేటప్పడు ఇంకెన్ని లెక్కలు చూస్తారు? మరెంత జాగ్రత్తగా ఉంటారో అనుకుంటాం. కానీ.. బ్యాంకుల ఆంక్షల కత్తి సామాన్యుడి మీద వాడిగావేడిగా ఉంటుంది కానీ.. పెద్ద మనుషుల యవ్వారంలోకి వెళ్లగానే వారెంత విశాలమైన హృదయంతో ఉంటారో.. తాజాగా వెలువడిన లెక్కలు చూస్తే అర్థమవుతుంది.

ఇలా కంపెనీలకు.. ప్రముఖులకు ఇచ్చిన అప్పుల లెక్కల విషయానికి పక్కన పెడితే.. అలా ఇచ్చిన అప్పుల్లో తిరిగి వచ్చే అవకాశం లేని మొత్తం ఎంతో తెలిస్తే గుండె గుభేల్ మనక మానదు. నిజం ఎంత నిష్ఠూరంగా ఉంటుందో చెప్పేందుకు ఈ అంకెలు ఎంతో సాయం చేస్తాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్ద ఉన్న నిరర్థక ఆస్తుల విలువ ఎంతో తెలుసా? అక్షరాల రూ.3,90443కోట్లు (అక్షరాల్లో చెబితే3.90లక్షల కోట్లు అన్న మాట)

సామాన్యుడికి లక్ష రూపాయిల కోసం చుక్కలు చూపించే బ్యాంకులు.. ఇన్నేసి లక్షల కోట్ల రూపాయిల్ని అప్పనంలా ఎలా ఇచ్చేశాయో అస్సలు అర్థం కాదు.దీనికి బాధ్యులైన వారిని ఏం చేశారో కూడా తెలీదు. ఇక.. ఇలా భారీగా అప్పులు తీసుకున్న మాట వినగానే చప్పున గుర్తుకు వచ్చేది లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా. ఆయన దాదాపు రూ.9వేల కోట్లు బ్యాంకులకు కట్టాల్సి ఉందని లెక్కలు తేల్చారు.

నిజానికి మాల్యా విషయంలో జరుగుతున్న రచ్చ అవసరానికి మించిందన్న భావన కలుగుతుంది. ఎందుకంటే.. బ్యాంకుల లెక్కల్లోకి లోతుగా వెళితే మాల్యా కంటే మొనగాళ్లు చాలామందే కనిపిస్తారు. వారి ముందు.. మాల్యా అప్పు చాలా చిన్నదిగా కనిపించటమే కారణం. కాకుంటే మాల్యాకున్న ఇమేజ్ తో మీడియాలో బాగా నానుతున్నారు కానీ.. పెద్దగా పేరు ప్రఖ్యాతులు లేకున్నా బ్యాంకుల దగ్గర నుంచి వేలాది కోట్లు చెల్లించకుండా ఉన్నోళ్లు చాలామందే ఉన్నారు. అలాంటి కొన్ని సంస్థల లెక్కలు చూస్తే.. ఈ దేశంలో బ్యాంకులు ఏం చేస్తున్నాయి? అన్న ఆగ్రహం కలగటం ఖాయం.

గత ఏడాది అక్టోబర్ నాటికి ఉద్దేశపూర్వకంగా అప్పులు ఎగొట్టిన వారి లెక్క విషయం చూస్తే.. దేశవ్యాప్తంగా 5,275 మంది ఉంటే.. వారు ఎగ్గొట్టిన మొత్తం లక్షల కోట్లుగా ఉంది. బ్యాంకులకు బకాయిలు భారీగా ఉన్న కొన్ని కంపెనీల లెక్కలు చూస్తే..

= అలోక్ ఇండస్ట్రీస్ రూ.15,350 కోట్లు

= గామన్ ఇండియా రూ.14,810 కోట్లు

= మానెట్ ఇస్పాత్ రూ.12,500 కోట్లు

= ఎలక్ట్రో స్టీల్స్ రూ.10,990 కోట్లు

= ఐవీఆర్సీఎల్ రూ.10,340 కోట్లు

= కోస్టల్ ప్రాజెక్ట్స్ రూ.05,810 కోట్లు

= ట్రాన్స్ ట్రాయ్ రూ.04,300 కోట్లు

= శివ్ వాణి ఆయిల్ అండ్ గ్యాస్ రూ.04,010 కోట్లు

= ఆధునిక్ పవర్ రూ.03,120 కోట్లు

= విసా స్టీల్ రూ.03,090 కోట్లు

= జ్యోతి సెక్యూరిటీస్ రూ.02,640 కోట్లు

= రోహిత్ ఫెర్రో టెక్ రూ.02,630 కోట్లు

వీరే కాక మరికొన్ని కంపెనీలు.. ల్యాంకో టీస్టా.. జీఓఎల్ ఆఫ్ షోర్.. ఏఎండబ్ల్యూ మోటార్స్.. అంకిత్ మెటల్.. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ కంపెనీల బకాయిలు రూ.800 కోట్ల నుంచి రూ.2,400 కోట్ల మధ్య ఉంటాయని చెబుతున్నారు. ఇవి కేవలం శాంపిల్ మాత్రమే.. ఇలాంటి వేలాది మంది లక్షలాది కోట్ల రూపాయిలు బ్యాంకులకు అప్పులు చెల్లించని వారిలో ఉన్నారు. దేశంలో ‘‘విజయ్ మాల్యా’’లకు కొదవలేదన్న మాట.
Tags:    

Similar News