100 మంది రైతులకు ఒక‌టే `ఆధారం`!

Update: 2017-10-26 07:18 GMT
భార‌త్ లో ఆధార్ నంబ‌ర్ కు ఉన్న ప్రాముఖ్య‌త గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు మొద‌లుకొని సిమ్ కార్డు వ‌ర‌కు అన్నిటికీ `ఆధారే` ఆధారం. అవినీతిని నిర్మూలించాల‌ని - ప్ర‌భుత్వ ప‌థ‌కాల ఫ‌లాలు నేరుగా ల‌బ్ధిదారుల‌కు అందాల‌నే స‌దుద్దేశంతో ఆధార్ అనుసంధానాన్ని ప్ర‌భుత్వం త‌ప్ప‌నిస‌రి చేసిన సంగ‌తి తెలిసిందే. ఆధార్ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ న‌మోదు కార్య‌క్ర‌మంలో జ‌రిగిన కొన్ని పొర‌పాట్ల వల్లో - మ‌రే ఇత‌ర కార‌ణాల వ‌ల్లో కొన్ని ఆధార్ నంబ‌ర్ల‌లో త‌ప్పులు దొర్లాయి. దాదాపు 100 మంది రైతుల‌కు ఒకే ఆధార్ నంబ‌ర్ ఉండ‌డంతో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాధికారులు ఖంగుతిన్నారు. ఆ విష‌యాన్ని గుర్తించి లోపాల‌ను స‌రిదిద్దే పనిలో ప‌డ్డారు.

రైతుల రుణ‌మాఫీ కార్య‌క్ర‌మాన్ని ఫ‌డ్న‌వీజ్ స‌ర్కార్ ప్ర‌తిష్మాత్మకంగా చేప‌ట్టింది. దాదాపు రూ.34 వేల కోట్ల రుణ‌మాఫీని విడ‌త‌ల వారీగా చేప‌ట్టేందుకు ఫ‌డ్న‌వీజ్ స‌ర్కార్ ప్లాన్ చేసింది. అందులో భాగంగా మొద‌టి విడ‌త రూ. 4 వేల కోట్ల రుణ‌మాఫీ చేసేందుకు సిద్ధ‌మైంది. అందుకోసం రైతులంద‌రూ త‌మ ఆధార్ నంబ‌ర్ల‌ను బ్యాంకు ఖాతాల‌కు అనుసంధానం చేసుకోవాల‌ని అధికారులు సూచించారు. రుణ‌మాఫీ కోసం రైతులు...ఆన్ లైన్ లో రైతుల‌ వివరాల‌ను పొందుపరిచే స‌మ‌యంలో దాదాపు 100 మందికి పైగా రైతులకు ఒకటే ఆధార్‌ నంబర్‌ ఉండటాన్ని అధికారులు గుర్తించారు. అయితే, ఆ రకంగా ఎందుకు జ‌రిగింద‌నే విషయాన్ని అధికారులు గుర్తించలేకపోయారు. ఆధార్ అనుసంధానంతో లబ్ధిదారులకు నేరుగా రుణమాఫీ నగదు అంద‌జేసి నకిలీ ఖాతాలను తొలగించే యోచ‌న‌తో ప్ర‌భుత్వం ఈ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది.

అనూహ్యంగా ఇపుడు ఈ స‌మ‌స్య ఏర్ప‌డ‌డంతో అధికారులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఇప్ప‌టికే రుణ‌మాఫీ ఆల‌స్య‌మైంద‌ని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆ ఆధార్ నంబ‌ర్ల వెరిఫికేష‌న్ కు మ‌రింత స‌మ‌యం ప‌ట్ట‌నుండ‌డంతో అధికారులు దిక్కుతోచ‌ని ప‌రిస్థితిలో ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌హారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీజ్ ....ప్ర‌భుత్వాధికారులు - బ్యాంక‌ర్ల‌తో అత్య‌వ‌స‌ర స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఆధార్ నంబ‌ర్ల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి, రైతుల‌కు స‌త్వ‌ర‌మే రుణ‌మాఫీ జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఆ ఆధార్ నంబ‌ర్ల వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌ర‌పాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. భ‌విష్య‌త్తులో రైతుల‌కు ఎటువంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు.
Tags:    

Similar News