రైతుల‌ను అవ‌మానించిన వివాదంలో వెంక‌య్య‌

Update: 2017-06-22 09:42 GMT
మాట‌ల మాంత్రికుడిగా పేరొందిన బీజేపీ అగ్ర‌నేత‌ -  కేంద్ర మంత్రి వెంక‌య్యనాయుడు తాజాగా అదే కామెంట్ల ద్వారా వివాదంలో ప‌డిన‌ట్లు క‌నిపిస్తోంది. అన్న‌దాత‌ల‌ను అవ‌మానించార‌నే వివాదంలో వెంక‌య్య చిక్కుకున్నారు. ఇవాళ ముంబైలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో వెంక‌య్యనాయుడు మాట్లాడుతూ రైతుల రుణ మాఫీ ఫ్యాష‌న్‌ గా మారింద‌ని అన్నారు. బుధ‌వారం క‌ర్నాట‌క ప్ర‌భుత్వం రైతుల‌కు రుణ మాఫీ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో కేంద్ర మంత్రి ఈ ర‌కంగా వ్యాఖ్యానించిన‌ట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వామ‌ప‌క్షాలు మండిప‌డ్డాయి. రైతుల‌ను అవ‌మానించేలా వెంక‌య్య వ్యాఖ్యానించార‌ని మండిప‌డ్డారు.

ముంభైలో జ‌రిగిన స‌ద‌స్సులో వెంక‌య్య మాట్లాడుతూ రైతు రుణ మాఫీ ఫ్యాష‌న్‌ గా మారింద‌ని వ్యాఖ్యానించారు. కేవ‌లం కొన్ని సంద‌ర్భాల్లో మాత్ర‌మే రుణాలు మాఫీ చేయాల‌ని, అదే చివ‌రి ప‌రిష్కారం కారాద‌ని అన్నారు. రైతుల బాగోగులు ప్ర‌భుత్వాలు చూసుకోవాల‌ని కేంద్ర మంత్రి వెంక‌య్య సూచించారు. కేంద్ర మంత్రి వెంక‌య్య చేసిన వ్యాఖ్యల ప‌ట్ల సీపీఎం నేత సీతారాం ఏచూరి స్పందించారు. వెంకయ్య వ్యాఖ్య‌లు అన్న‌దాత‌ను అవ‌మానించిన‌ట్లుగా ఉన్నాయ‌ని మండిప‌డ్డారు. గ‌త మూడేళ్ల‌లో దేశ‌వ్యాప్తంగా వేల మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డార‌ని, అలాంటి సంద‌ర్భంలో రైతుల రుణ‌మాఫీని ఫ్యాష‌న్ అన‌డం అన్న‌దాత‌ల‌ను అవ‌మానించ‌డ‌మే అవుతుంద‌ని ఏచూరి అన్నారు.

ఇదిలాఉండ‌గా దేశంలోని ఆయా రాష్ర్టాల్లో రుణ‌మాఫీ ప్ర‌క‌ట‌న‌లు జోరందుకున్నాయి. యూపీలో బీజేపీ విజ‌యంలో రుణ‌మాఫీ హామీ ప్ర‌ధాన కార‌ణంగా నిలిచింద‌నే విశ్లేష‌ణ‌లు ఉన్నాయి. తాజాగా క‌ర్నాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య సైతం రుణ‌మాఫీ ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే పంజాబ్ సీఎం అమ‌రేందర్ సింగ్ కూడా స‌న్న‌- చిన్న‌కారు రైతుల‌కు రుణ మాఫీ ప్ర‌క‌టించారు. మహారాష్ట్ర కూడా ఇటీవ‌లే రైతుల నిర‌స‌న‌ల నేప‌థ్యంలో  రుణ మాఫీ క‌ల్పించింది. ఇదిలాఉండ‌గా...రైతుల‌కు ఇచ్చే రుణ‌మాఫీల‌కు కేంద్రం నిధులు ఇవ్వ‌దని, ఆయా రాష్ట్రాలే భారం భ‌రించాల్సి ఉంటుంద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఓ సంద‌ర్భంలో తేల్చిచెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News