భీమిలీకి లోకల్ గేట్... బిగ్ షాట్స్ ఏమవ్వాలి...?

Update: 2022-12-03 02:30 GMT
విశాఖలో అందమైన ఊరు భీమిలి. అంతే కాదు రాజకీయ జీవులకు కూడా నచ్చే ప్లేస్. భీమిలీలో పోటీ చేసిన వారు రాజకీయ అదృష్ట జాతకులు అని పేరు మోస్తారు. అలా చాలా మంది మంత్రులు అయ్యారు. కాంగ్రెస్ కాలం నుంచి అది ఆనవాయితీగా వస్తోంది. లేటెస్ట్ గా తీసుకుంటే గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు కూడా భీమిలీ ఎమ్మెల్యేలుగా ఉంటూ మంత్రులుగా పనిచేశారు.

భీమిలీ అంటే ఒక మంచి ఊరు. అక్కడ జనాలు ఒక పార్టీని ఆదరిస్తే అలా గుండెల్లో పెట్టుకుంటారు. కాంగ్రెస్ పార్టీని మూడున్నర దశాబ్దాల పాటు నెత్తిన పెట్టుకున్న భీమిలీ 1983లో ఫస్ట్ టైం టీడీపీని గెలిపించింది. అది లగాయితూ 1999 వరకూ వరసగా అయిదు ఎన్నికల్లో భీమిలీ టీడీపీ జెండాను రెపరెపలు ఆడించింది. 2004లో కాంగ్రెస్ రెండు దశాబ్దాల విరామం తరువాత గెలిస్తే 2009లో కొత్త పార్టీ ప్రజారాజ్యం జెండా పాతింది. 2014లో మళ్లీ టీడీపీ గెలిస్తే 2019 ఎన్నికల్లో ఫస్ట్ టైం వైసీపీ ఫ్యాన్ గిర్రున తిరిగింది.

ఇక 2024 ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అంటే అక్కడ ప్రధాన పార్టీలు అన్నీ బలంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అయితే పునాదుల నుంచి బలంగా ఉంది. జనసేన కూడా ఇపుడు సై అంటోంది. 2019 ఎన్నికల్లో ఏకంగా పాతిక వేల ఓట్లు సాధించింది. దానికి ముందు ప్రజరాజ్యం నుంచి గెలిచిన ట్రాక్ రికార్డ్ కూడా ఉండడంతో జనసేన ఆశలు పెంచుకుంటోని. ఇక వైసీపీ మరోమారు గెలిచి తన పునాదిని పటిష్టం చేసుకోవాలని చూస్తోంది.

ఇవన్నీ పక్కన పెడితే భీమిలీలో ఎవరు పోటీ చేసినా జనాలు గెలిపిస్తూ వస్తున్నారు. అలా విజయనగరం నుంచి వెళ్ళిన నాయకులు విశాఖ నుంచి వచ్చిన వారు అందరూ ఎమ్మెల్యేలు అయ్యారు. అయితే ఈసారి మాత్రం పక్కా లోకల్ కే టికెట్ ఇవ్వాలని అన్ని పార్టీల నుంచి డిమాండ్ వస్తోంది. ప్రతీ రాజకీయ పార్టీ ఎన్నికల వేళకు భీమిలీలో నాన్ లోకల్ ని బిగ్ షాట్ అంటూ నిలబెట్టి గెలిపించుకుని పోతోందని, తామెందుకు ఊరుకోవాలని లోకల్ లీడర్స్ గర్జిస్తున్నారు.

ఈ లోకల్ నినాదం టీడీపీలో స్టార్ట్ అయింది. మెల్లగా వైసీపీ జనసేనలలో కూడా వినిపిస్తోంది. ఎందుకంటే టీడీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో బయట వారు పోటీ చేస్తారు అని టాక్ బాగా ఉంది. దాంతో నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న కోరాడ రాజబాబుతో పాటు టికెట్ ని ఆశిస్తున్న భీమిలీ నాయకులు చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. టికెట్ దక్కితే లోకల్ క్యాండిడేట్ కే దక్కాలి అని వారు ఒక డెసిషన్ కి వచ్చారు.

జిల్లాలో మిగిలిన చోట్ల లోకల్ లీడర్స్ కి టికెట్ ఇస్తున్న అధినాయకత్వం భీమిలీలో మాత్రం నాన్ లోకల్స్ కి ఎలా ఇస్తుంది అని వారు పాయింట్ ని లేవనెత్తుతున్నారు. ఇదే వాదన వైసీపీలో కూడా గట్టిగా సౌండ్ చేస్తూండడంతో అవంతి శ్రీనివాసరావుకు బదులుగా వైసీపీలోకి కొత్తగా చేరబోతున్న ఒక మాజీ మంత్రి గారికి టికెట్ ఇవ్వాలనుకుంటున్న ఆ పార్టీ కూడా ఖంగు తింటోంది అని అంటున్నారు. ఇక వైసీపీలో కూడా లోకల్ లీడర్స్ గట్టిగా ఉన్నారు. వారు తమకే టికెట్ అని చెప్పుకోవడమే కాదు అధినాయకత్వానికి కూడా సూచిస్తున్నారు.

జనసేన విషయం అలాగే ఉంది. ఆ పార్టీ ఇంచార్జి పంచకర్ల సందీప్ కి టికెట్ అని అంటున్నారు. ఆయన లోకల్ లీడర్ కావడంతో ఇబ్బంది లేదని చెబుతున్నారు. మొత్తానికి లోకల్ పేరు చెప్పి భీమిలీ గేట్లు వేసేస్తే ఎలా అని నాన్ లోకల్ లీడర్స్ మధనపడుతున్నారు. అయితే అధినాయకత్వాలు వీరి మాట వింటాయా లోకల్ లీడర్స్ కే టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తాయా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా భీమిలీలో లోకల్ గేట్ పడిపోయింది. గోడ దూకుళ్ళు చేసి భీమిలీ వైపుగా వచ్చేవారికి మాత్రం నో ఎంట్రీ అంటోంది ఈ సీటు. మరి ఏం జరుగుతుందో చూడాలని అంటున్నారు. భీమిలీ లోకల్ స్లోగన్ మాత్రం జిల్లాలోనూ చర్చకు తావిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News