ప్రైవేటు ఉద్యోగుల పిల్లలకూ స్థానికత

Update: 2015-08-17 12:52 GMT
నవ్యాంధ్రప్రదేశ్ లో స్థానికత విషయాన్ని ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితం చేయకుండా ప్రైవేటు  ఉద్యోగుల పిల్లలకు కూడా వర్తింపజేయాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వం పైనే ఉంది. నవ్యాంధ్ర రాజధాని మరో ఐదేళ్లకు ఏర్పడుతుంది. ఇప్పటి నుంచి మరో పదేళ్ల వరకు విడతల వారీగా తెలంగాణ మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు అక్కడికి వెళుతూనే ఉంటారు. నవ్యాంధ్ర కు లేదా రాజధానికి ఎప్పుడు వెళ్లాలనేది ఉద్యోగుల చేతిలో ఉండదు.

ఉదాహరణకు, ప్రభుత్వంలో ఏ కార్యాలయాన్ని రాజధానికి తరలిస్తే ఆ శాఖ ఉద్యోగులు అక్కడికి వెళతారు. వారితోపాటే వారి పిల్లలూ అక్కడికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇక, ప్రైవేటు ఉద్యోగులకు సంబంధించి ఆయా కంపెనీలు తమ తమ కంపెనీలను ఎప్పుడు అక్కడికి తరలిస్తే ఆయా ఉద్యోగులూ వాటితోపాటే వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని కంపెనీలు ఇప్పటికే నవ్యాంధ్ర రాజధానికి తరలించాయి. కనక ఉద్యోగులు అక్కడికి వెళ్లారు. రాబోయే ఐదేళ్లలో పదేళ్లలో మరికొంతమంది వెళతారు. మరి వారి పిల్లల స్థానికత మాట ఏమిటి? ఇది రాష్ట్ర విభజనకు ముందు నుంచీ ఉన్న సమస్య. రాజకీయాల కారణంగా విభజన చేసినందుకు సామాన్యులు నష్టపోవాలా?

ప్రభుత్వ ఉద్యోగులకు సంఘాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని అవి డిమాండ్ చేసే స్థితిలో ఉన్నాయి. కనక ప్రభుత్వంతో చర్చల సమయంలో దీనిని మొదటి డిమాండ్ గా పెడుతున్నాయి. దీనిని నెరవేరిస్తేనే నవ్యాంధ్ర రాజధానికి వస్తామని చెబుతున్నాయి. మరి, ప్రైవేటు ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? వీరంతా అసంఘటితంగా  ఉంటారు. ఒకరికి మరొకరికి సంబంధం ఉండదు. ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో విభజన కారణంగా స్థానికత విసయంలో ఎక్కవుగా నష్టపోయేది ప్రైవేటు ఉద్యోగుల పిల్లలే. అందుకే ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని ప్రైవేటు ఉద్యోగుల పిల్లలన స్థానికులుగా గుర్తించాలి.
Tags:    

Similar News