అవినీతిని అరిక‌ట్టేందుకు కొత్త మార్గం చూపారు

Update: 2016-04-30 08:06 GMT
దాదాపుగా ఏడాది కాలం క్రితం జ‌రిగిన ఓ విస్మ‌య‌క‌ర సంఘ‌ట‌న మీకు గుర్తుండే ఉంటుంది. ప్ర‌భుత్వ అధికారులు నిబంధ‌న‌ల ప్ర‌కారం త‌న ప‌ని చేయాల్సి ఉన్న‌ప్ప‌టికీ దాట‌వేస్తూ ఉండ‌ట‌మే కాకుండా లంచం కోసం వేధిస్తుండ‌టంతో విసుగు చెందిన ఓ సామాన్యుడు... ప్ర‌భుత్వ కార్యాల‌యంలో పాముల‌ను వ‌దిలాడు. ఈ వార్త దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఇపుడు దాదాపుగా అదే స్పూర్తితో నిర్ల‌క్ష్య‌పు అధికారుల‌ను క‌దిలించే ప్ర‌య‌త్నం జ‌రిగింది.

సమస్యలు పరిష్కరించడంలో జాప్యం జ‌రిగి విసుగు చెందితే నిరసన ఎలా ఉంటుంది? ప్రదర్శన చేస్తారు...లేదా టెంట్‌ వేసుకొని ధర్నా చేస్తారు... మహా అయితే పికెటింగ్‌. అయితే ఇలాంటి రొటీన్‌ నిరసనలకు భిన్నంగా మహారాష్ట్ర బుల్దానా జిల్లాలోని ప్రజలు వినూత్నంగా ఆలోచించారు. త‌మ ప్రాంతంలోని ఛత్రపతి శివాజీ మార్కెట్‌ లో రోడ్లు సహా స్థానిక సమస్యలపై ఎన్నిసార్లు విజ్ఞాపనలు ఇచ్చినా ప్రజా పనుల శాఖ పట్టించుకోకపోవడంతో నాగిని డ్యాన్స్‌ తో నిరసనకు దిగారు. పీడబ్ల్యుడీ సమావేశం జరుగుతున్న హాల్లోకి గుంపుగా వెళ్లి  అధికారుల ముందు నాగిని నృత్యాన్ని ప్రదర్శిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్‌ వారిని నివారించేందుకు ప్రయత్నించినా పట్టించుకోకుండా నాగిని డ్యాన్స్‌ తో నిరసన చేశారు. అనంతరం అధికారులకు దండలువేసి - బొట్లు పెట్టారు. వారి ముందు కొబ్బరికాయలు కూడా కొట్టారు. దీంతో అవాక్కవడం అధికారులవంతైంది.

త‌మ నిర‌స‌న‌తో అయినా అధికారుల్లో మార్పు వ‌చ్చి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తార‌ని ఆశిస్తార‌ని ఈ ప్ర‌య‌త్నం చేశామ‌ని బుల్దానా జిల్లా వాసులు చెప్తున్నారు. ఇప్ప‌టికైనా త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తార‌ని ఆశిస్తున్న‌ట్లు వారు ఓపిక న‌శించిన క‌ళ్ల‌తో మీడియాకు త‌మ గోడును వెళ్ల‌బోసుకున్నారు.
Tags:    

Similar News