పవన్ ఆధ్యాత్మిక యాత్ర....ఏపీ రాజకీయాల్లో చర్చ
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాలలో ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టారు.
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాలలో ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆయన మొదట కేరళలోని అగస్త్య ఆశ్రమాన్ని దర్శించుకోవడం ద్వారా ఈ యాత్రను మొదలుపెట్టారు. ఆయన కేరళలోని అనంత పద్మనాభ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుంటారు. అదే విధంగా తమిళనాడులో అనేక ఆలయాలను ఆయన సందర్శిస్తారు.
పవన్ ఆధ్యాత్మిక యాత్ర ఇపుడు ఏపీ రాజకీయాల్లో అతి పెద్ద చర్చగా మారింది. ఆయన సనాతన ధర్మ పరిరక్షణ కోసం గతంలో వారహి సభ పెట్టారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుని కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇపుడు ఈ యాత్ర సందర్భంగా పవన్ ఏ రకమైన ప్రకటనలు ఇస్తారు అన్నది అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది.
అదే సమయంలో పవన్ కూటమి ప్రభుత్వానికి దూరంగా ఉంటున్నారు అన్న ప్రచారం సాగుతోంది. ఆయన రిపబ్లిక్ డే వేళ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే రోజు రాజ్ భవన్ లో గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు హాజరు అయ్యారు. అక్కడ నుంచి పవన్ కనిపించలేదు.
మరో వైపు చూస్తే ఆయన ఈ నెల 6న జరిగిన మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేదు. పవన్ తీవ్రమైన జ్వరంతో పాటు వెన్ను నొప్పితో బాధపడుతున్నారు అని ఉప ముఖ్యమంత్రి ఆఫీస్ అప్పట్లో ప్రకటించింది. ఇక తాజాగా మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రులు కార్యదర్శుల ఉన్నత స్థాయి సమావేశానికి గైర్ హాజరు కావడం పైన చర్చ సాగుతోంది.
ఈ సమావేశంలోనే మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పవన్ అనారోగ్య సమస్యల మూలంగానే రాలేదని చెప్పారు. అయితే చంద్రబాబు అదే సమావేశంలో పవన్ తో తాము ఫోన్ లో మాట్లాడడానికి ప్రయత్నించానని ఆయన అందుబాటులోకి రాలేదని చెప్పడం విశేషం. అంటే చంద్రబాబు ఫోన్ చేసినా పవన్ లిఫ్ట్ చేయలేదా అన్నది చర్చగా ఉంది. బాబు అంతటి వారు ఈ విషయం బాహాటంగా చెప్పడంతో ఇది ఇపుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇక కూటమి ప్రభుత్వంలో విభేదాలు ఉన్నాయన్నది ఇంతవరకూ ప్రచారంగా ఉంటూ వచ్చింది. కానీ పవన్ వరసగా కూటమి ప్రభుత్వ సమావేశాలకు వెళ్ళకపోవడం అదే సమయంలో చంద్రబాబు తాను స్వయంగా పవన్ కి ఫోన్ చేసినా ఆయన నుంచి రెస్పాన్స్ రాలేదని చెప్పడంతో ఇది హాట్ పొలిటికల్ టాపిక్ అయింది.
దీంతో అసలు చంద్రబాబు పవన్ ల మధ్యలో ఏమి జరుగుతోంది అన్న చర్చ అయితే సాగుతోంది. ఒకరు ముఖ్యమంత్రి మరొకరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఈ ఇద్దరి మధ్యన ఏమైనా విభేదాలు ఉన్నాయా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.
ముఖ్యమంత్రి ఫోన్ చేయడానికి ప్రయత్నించినా దానికి స్పందించకపోవడం అంటే ఇటీవల సంభవించిన అనేక పరిణామాల పట్ల పవన్ కళ్యాణ్ ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. ఆయన లేని సమయంలో చంద్రబాబు ర్యాంకులను మంత్రులకు ప్రకటించారు. అందులో పవన్ కి పదవ ర్యాంక్ ఇవ్వడం పట్ల చర్చ సాగుతోంది. అంతే కాదు పవన్ తో చర్చించకుండానే అనేక కీలక నిర్ణయాలు కూటమి ప్రభుత్వంతో తీసుకుంటున్నారు అన్నది కూడా జనసేనలో ఆగ్రహంగా ఉందని ప్రచారం సాగుతోంది.
ఇక ఆ మధ్యన ఉప ముఖ్యమంత్రి లోకేష్ కి ఇవ్వాలన్న డిమాండ్ కాస్తా మరింతగా ముందుకు వెళ్ళి లోకేష్ సీఎం అని ఒక మంత్రి వ్యాఖ్యానించడం వంటివి కూడా జనసేనలో ఆగ్రహం పెరగడానికి కారణం అయ్యాయని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు వెనక కీలకమైన పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ కి సరైన గౌరవం లేదన్న ఆవేదన ఆగ్రహం జనసేనలో ఉందని అంటున్నారు.
ఇదిలా ఉంటే అనారోగ్యంతో కీలక సమావేశాలకు హాజరు కాలేదని ఒక వైపు ప్రచారం సాగుతూంటే మరో వైపు పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక యాత్రలను మొదలుపెట్టడం కూడా కొత్త చర్చకు ఆస్కారం కల్పిస్తోంది. బీజేపీ ఈ విధంగా దక్షిణాదిన సనాతన ధ్రమం పేరిట మరింత ఫోకస్ కావడానికి పవన్ తో ఇలా చేయిస్తోంది అన్నది ప్రచారంలో ఉంది.
ఇదిలా ఉంటే చంద్రబాబు పవన్ ల మధ్య ఏదో ఉంది అన్న ప్రచారాన్ని వైసీపీ బాగా వాడుకుంటోంది. ఆ పార్టీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ మీద విమర్శలు చేశారు. నిన్నటికి నిన్న అనారోగ్యం సమస్యలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ కాల్ కి రెస్పాండ్ కాని పవన్ కల్యాణ్ ఈ రోజు తీర్ధ యాత్రలకు వెళ్ళడం కూటమి ప్రభుత్వానికి ఆనందం కలిగిస్తోంది అని ఆయన సెటైర్లు వేశారు.
బడ్జెట్ కి ముందు నిర్వహించిన కీలక సమావేశానికి పవన్ డుమ్మా కొట్టారని ఘాటు విమర్శలు చేశారు. మొత్తానికి పవన్ చాలా రోజుల తరువాత సనాతన వాదిగా మారి కాషాయ వస్త్రాలతో తీర్ధ యాత్రలతో బిజీగా ఉంటే ఆయన ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో కూటమిలో చర్చ సాగుతోంది. వైసీపీ విమర్శలతో అది రాజకీయ రచ్చకు దారి తీస్తోంది.