లాక్ డౌన్ మూడ‌వ ప్ర‌పంచ యుద్ధ‌మే

Update: 2020-03-30 02:30 GMT
ప్ర‌పంచ యుద్ధాలు...వైర‌స్ విజృంభ‌ణ లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనే ప్ర‌పంచ దేశాలు లాక్ డౌన్ లాంటివి ప్ర‌క‌టిస్తాయి. మాన‌వాళి మ‌నుగ‌డ‌కు ముప్పు పొంచి ఉంది.. పెను ప్ర‌మాదం త‌రుముకొస్తోంది! అనుకున్న‌ స‌మ‌యంలోనే ప్ర‌భుత్వాలు ఇలాంటి క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటాయి. ప్ర‌స్తుతం ప్ర‌పంచ దేశాలతో పోలిస్తే భార‌త్ ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉందో తెలిసిందే. క‌రోనా అనే ఒక్క చిన్న వైర‌స్ దాడికి భార‌త‌దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంది. ఎక్క‌డ జ‌నం అక్క‌డే గ‌ప్ చుప్. ఎవ‌రూ గుమ్మం దాట‌డానికి వీల్లేదు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు అతిక్ర‌మించ‌డానికి వీలు లేదు. వీధుల్లో పోలీసులు..మీడియా... ప్ర‌జా ప్ర‌తినిథులకు త‌ప్ప మ‌రొక‌రికి అనుమ‌తి  లేదు.

దేశం మొత్తం ఆల్ మోస్ట్ 144 సెక్ష‌న్ అమ‌ల్లో ఉంది. దీంతో భార‌త్ ఆర్ధిక ప‌రిస్థితి ఎంత‌గా దిగ జారిపోతుందో త‌లుచుకుంటేనే భ‌య‌మేస్తోంది. పేద..ధ‌నిక అనే తార‌త‌త్యం లేకుండా అంద‌రూ ఇప్పుడు ఇబ్బందుల్లోనే ఉన్నారు. చిన్న వైర‌స్ ప్ర‌పంచాన్ని ఎంత‌గా గ‌డ‌గ‌డ‌లాడిస్తోందో క‌ళ్లారా చూస్తున్నాం. కంటికి క‌నిపించిన వైర‌స్ తో  ప్ర‌త్య‌క్షంగా  యుద్ధం  చేస్తున్నాం. ఏప్రిల్ 14 వ‌ర‌కూ లాక్ డౌన్ అని ఇప్ప‌టికే అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే ప్ర‌జానీకం నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఎప్రిల్ 14 త‌ర్వాత ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే?  బ‌తికి బ‌ట్ట క‌ట్ట‌డం ఎలా? అన్న సందేహం అంద‌రిలోనూ మొద‌లైంది. అప్ప‌టి ప‌రిస్థితిని బ‌ట్టి నిర్ణ‌యాలు మారే అవ‌కాశం ఉంది. వైర‌స్ త‌గ్గితే యాథా స్థితిలోకి వ‌స్తాం. లేదంటే? వ‌చ్చే  ఉప‌ద్ర‌వాన్ని ఎదుర్కోవ‌డానికి అంద‌రూ సంసిద్ధ‌మై  ఉండాలి.

సాధార‌ణంగా ఇలాంటి ప‌రిస్థితులు శతాబ్ధానికి ఒక‌సారి వస్తాయేమో. మ‌న ముందు త‌రాలు  ఎప్పుడూ ఇలాంటి జాతీయ విప‌త్తును చూసి ఉండ‌క‌పోవ‌చ్చు. ఇలాంటి పరిస్థితి తొలిసారి మొద‌టి ప్ర‌పంచ యుద్ధం 1914-18 స‌మ‌యంలో త‌లెత్తింది. త‌ర్వాత రెండ‌వ ప్ర‌పంచ యుద్ధ (1939-45) కాలంలో వ‌చ్చింది. అటుపై  ప్ర‌పంచ దేశాల శాంతి కోసం ఏర్పాటైన  ఐకాస పుణ్య‌మా అని అలాంటి ప‌రిస్థితి ఎదుర‌వ్వ‌లేదు. స‌రిగ్గా 75 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ప్ర‌పంచ దేశాలు స‌హా భార‌త్  లాక్ డౌన్ లో కి వెళ్ల‌డం శోచ‌నీయం. అంటే క‌రోనా దాడిని మూడ‌వ ప్ర‌పంచ యుద్ధంగా చెప్ప‌డంలో అతిశ‌యోక్తి ఏమీలేదు. ల‌క్ష‌లాది మంది వైర‌స్ భారిన ప‌డ్డారు. వేలాది మ‌ర‌ణాలు సంభ‌వించాయి. వైర‌స్ ఉధృతి  రోజు రోజుకి పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఈ విష‌యాల‌న్ని  టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లో ఆస‌క్తిక‌రంగా మారాయి. ఇది మూడ‌వ ప్ర‌పంచ యుద్ధ‌మే అంటూ అంతా మౌనం వ‌హిస్తున్నారు. ఇది క‌చ్ఛితంగా మూడో ప్ర‌పంచ యుద్ధ ప‌రిణామ‌మే. వైర‌స్ తో వ‌ర‌ల్డ్ వార్. ఈ యుద్ధంలో వైర‌స్ ఆధిప‌త్య‌మే క‌నిపిస్తోంది కానీ సైన్స్ ఆధిప‌త్యం క‌నిపించ‌లేదు ఇంత‌వ‌ర‌కూ.
Tags:    

Similar News