లాక్ డౌన్ 4.0 మార్గదర్శకాలు ఇవే!

Update: 2020-05-17 15:18 GMT
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను మే 31వరకు కేంద్రం పొడిగించింది.  మే 18నుంచి లాక్ డౌన్ 4.0 అమల్లోకి రానుంది.  ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఈ లాక్ డౌన్ లో వేటికి అనుమతి.. వేటికి లేదనే విషయాన్ని మార్గదర్శకాలుగా విడుదల చేసింది. రైలు - విమాన - మెట్రో సర్వీసులపై మే 31 వరకు నిషేధం కొనసాగుతోందని స్పష్టం చేసింది. కంటైన్ మెంట్ జోన్లు మినహా అంతర్రాష్ట బస్సు సర్వీసులు నడుపుకునేందుకు వెసులుబాటు కల్పించింది. రాష్ట్రాల పరస్పర అంగీకారంతో వీటిని నడుపుకోవచ్చని స్పష్టం చేసింది. కంటైన్మెంట్ - రెడ్ - గ్రీన్  - ఆరెంజ్ జోన్లపై నిర్ణయాధికారం రాష్ట్రాలకే అప్పగించింది. కరోనా హాట్ స్పాట్లలో ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది.

రాష్ట్రాల పరస్పర  అంగీకారంతో ప్రజా రవాణాకు అనుమతి ఇచ్చింది. అయితే అంతర్రాష్ట్ర ప్రజా రవాణాకు షరతులతో కూడిన అనుమతులు జారీ చేసింది. ఇక కీలకమైన విద్యావ్యవస్థపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. మే 31 వరకు కాలేజీలు - స్కూళ్లు - మెట్రో - విమాన సర్వీసులు బంద్ చేయాలని డిసైడ్ అయ్యింది. ఇక వీటితోపాటు జనాలు పోగయ్యే హాల్స్ - మాల్స్ - హోటళ్లకు కూడా అనుమతి నిరాకరించింది. ఇప్పటిలాగే రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల దాకా కర్ఫ్యూ కొనసాగుతుందని కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది.
 
+ లాక్‌డౌన్-4.0 మార్గదర్శకాలు:

కంటెయిన్‌ మెంట్ జోన్లలో ప్రజలు రోడ్ల మీదకు రాకూడదని కేంద్రం ఆదేశించింది. ప్రతి ఇంటిపై నిఘా ఉండాలని.. అనుమానితులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలని - పౌరులకు సేవలు అందించాలని పేర్కొంది.

* బస్టాండ్లు - రైల్వే స్టేషన్ లలో ఉన్న క్యాంటిన్లను నడిపేందుకు అనుమతి.

* దేశీయ - అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగింపు. దేశీయ విమానాల్లో వైద్య సేవలు - దేశీయ ఎయిర్‌ అంబులెన్స్‌ లు - భద్రతకు సంబంధించిన వాటికి హోం శాఖ అనుమతితో మినహాయింపులు.

* ఆహారం హోమ్ డెలివరీ చేస్తున్న రెస్టారెంట్లు కిచెన్‌ తెరిచేందుకు అనుమతి.

* సాంస్కృతిక - ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో గుంపులుగా పాల్గొనవద్దు. ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదు.

* రాజకీయ - సామాజిక సభలపై నిషేధం కొనసాగింపు.

* స్కూళ్లు - కాలేజీలు - కోచింగ్ సెంటర్లకు మే 31 వరకు అనుమతి లేదు.

* సినిమా థియేటర్లు - రెస్టారెంట్లు - షాపింగ్ మాల్స్ - స్విమ్మింగ్ పూల్స్ మూసివేతపై మే 31 వరకు ఆంక్షలు కొనసాగింపు.

* రెడ్‌ - గ్రీన్‌ - ఆరెంజ్‌ జోన్ల నిర్ణయం ఇలా..

రెడ్‌ - ఆరెంజ్‌ - కంటెయిన్‌ మెంట్ - బఫర్‌ జోన్ల సరిహద్దులను ఆయా జిల్లా అధికారులు నిర్ణయిస్తారని.. అవి కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గనిర్దేశాలకు అనుగుణంగా ఉండాలని హోం శాఖ తెలిపింది. కంటెయిన్‌ మెంట్ జోన్లలో అత్యవసర సేవలు మినహా ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. ఏయే ప్రాంతాల్లో రెడ్‌ - గ్రీన్‌ - ఆరెంజ్‌ జోన్లు ఏర్పాటు చేయాలనే అంశాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు - కేంద్ర పాలిత ప్రాంతాలే నిర్ణయిస్తాయని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ - భారత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

  


Tags:    

Similar News