ఏపీలోనూ లాక్ డౌన్... జగన్ డీటెయిల్డ్ ప్రకటన ఇదే

Update: 2020-03-22 14:50 GMT
కరోనా వైరస్ ప్రపంచంలోని చాలా దేశాలతో పాటు ఆయా దేశాల్లోని రాష్ట్రాలు కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కోవిడ్-19ను అరికట్టే దిశగా సాగుతున్న ఆయా ప్రభుత్వాలు లాక్ డౌన్, షట్ డౌన్ అంటూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు లాక్ డౌన్ అంటూ ప్రకటనలు వెలువరించిన నేపథ్యంలో... నవ్యాంధ్రప్రదేశ్ ను కూడా అదే బాటలో నడిపించేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం సాయంత్రం అదికార యంత్రాంగంతో కీలక సమీక్ష చేసిన జగన్... ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ నెలాఖరు దాకా రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా జగన్ ఏమన్నారన్న విషయానికి వస్తే... 'కరోనా నివారణకు అధికారులు బాగా కృషి చేస్తున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో 200 ఐసోలేటెడ్‌ పడకలు ఏర్పాటు చేస్తున్నాం. విదేశాల నుంచి 11,670 మంది వచ్చారు.  వైద్య చికిత్స తీసుకున్న తర్వాత కొందరు ఇళ్లకు వెళ్లారు. పదో తరగతి, ఇతర పరీక్షలు యథాతథంగా జరుగుతాయి. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే పరీక్షలు నిర్వహిస్తాం. లాక్‌డౌన్‌ కాలంలో ప్రజలకు నిత్యావసరాలను అందుబాటులో ఉంచుతాం. ప్రజా రవాణాను పూర్తిగా నిలిపేయనున్నాం. ఈ సమయంలో అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతించనున్నాం. నిత్యావసరాలు విక్రయించే దుకాణాలు పూర్తిగా అందుబాటులో ఉంటాయి. నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరకు అమ్మితే పోలీసు కేసులు పెడతాం. అసెంబ్లీ కూడా కొన్ని రోజులే నిర్వహిస్తాం. జాగ్రత్తలు తీసుకోకుంటే కరోనా విజృంభించే ప్రమాదం ఉంది. ఈ నెల 29నే ప్రజలకు రేషన్‌ సరకులను ఉచితంగా అందిస్తాం. రేషన్‌ కార్డు ఉన్న వారికి కిలో పప్పు ఉచితంగా ఇస్తాం. రేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఏప్రిల్‌ 4న రూ. వెయ్యి అందిస్తాం. గ్రామ వాలంటీర్లు ఇంటికి వెళ్లి నగదు అందిస్తారు. అన్ని రాష్ట్రాలతో కలిసి ముందుకెళ్తేనే కరోనాను అరికట్టగలం' అని జగన్‌ తెలిపారు.

మొత్తంగా ఇతర రాష్ట్రాల మాదిరే ఏపీలోనూ ఈ నెలాఖరు దాకా లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్లు జగన్ తెలిపారు. ఈ సమయంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ఆయన సూచించారు. పది మంది కంటే ఎక్కువ సంఖ్యలో గుమికూడవద్దని కూడా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర సరిహద్దులన్నింటినీ మూసివేస్తున్నట్లుగా కూడా జగన్ ప్రకటించారు. వ్యవసాయ కూలీలు పొలం పనుల్లో రెండు మీటర్ల దూరాన్ని పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ సూచించారు. అత్యవసరం అయితే తప్పించి ఈ 14 రోజుల్లో ఎవరూ బయటకు రాకుండా స్వీయ నిర్భందాన్ని పాటించాలని జగన్ సూచించారు. మార్చి 31 తర్వాత పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని జగన్ ప్రకటించారు.
Tags:    

Similar News