ఆ రాష్ట్రంలో లాక్డౌన్‌.. ప్ర‌క‌టించిన సీఎం!

Update: 2021-05-02 08:30 GMT
దేశంలో కొవిడ్ క‌ల్లోలం ఉధృతంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికిప్పుడు అదుపులోకి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపించ‌ట్లేదు. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. కేసులు పెరుగుతున్నాయే త‌ప్ప త‌గ్గ‌ట్లేదు. దీంతో.. లాక్ డౌనే శ‌రణ్యంగా భావిస్తున్నాయి రాష్ట్రాలు. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు లాక్డౌన్ పాటిస్తుండ‌గా.. మ‌రికొన్ని మినీ లాక్ డౌన్ అమ‌లు చేస్తున్నాయి. తాజాగా.. మ‌రో రాష్ట్రం పూర్తిస్థాయి లాక్డౌన్ ప్ర‌క‌టించింది.

ఒడిశాలో పూర్తి లాక్డౌన్ విధిస్తున్న‌ట్టు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ్ ప్ర‌క‌టించారు. మొత్తం 14 రోజులు ఈ ఆదేశాలు అమ‌ల్లో ఉంటాయ‌ని వెల్ల‌డించారు. మే 5 నుంచి మొద‌ల‌య్యే లాక్ డౌన్‌.. 19 వరకు కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. క‌రోనా సమీక్షా సమావేశం తర్వాత నవీన్ పట్నాయక్ లాక్డౌన్ ప్ర‌క‌ట‌న చేశారు.

ఆ రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. గ‌డిచిన‌ 24 గంటల్లో 10,413 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో.. మొత్తం కేసుల‌ 4,62,622కు పెరిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు 2,068 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,91,048 రికవరీ అయిన‌ట్టు ఆ రాష్ట్రం వెల్ల‌డించింది.

మరోవైపు.. ఇత‌ర రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొన‌సాగుతోంది. ఢిల్లీలో లాక్ డౌన్ కొన‌సాగుతుంద‌ని సీఎం కేజ్రీవాల్ మ‌రోసారి ప్ర‌క‌టించారు. దీంతో.. వ‌రుస‌గా మూడో వారం అక్క‌డ మూసివేత కొన‌సాగ‌నుంది. ఇక‌, కర్ణాటక, తమిళనాడులోనూ కఠినమైన ఆంక్షలు అమ‌ల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు మాత్ర‌మే నైట్ కర్ఫ్యూను అమ‌లు చేస్తున్నాయి.
Tags:    

Similar News