మూడు బిల్లులకి లోక్ సభ ఆమోదం ... ఆ బిల్లుకి మాత్రమే విపక్షాల మద్దతు , ఎందుకంటే ?

Update: 2021-08-09 10:00 GMT
పార్లమెంట్ సమావేశాలు గత నాలుగు వారాలుగా జరుగుతున్నా కూడా ఏ  ఒక్కరోజు కూడా పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగలేదు. పార్లమెంట్‌ లో  విపక్ష పార్టీల ఆందోళనలతోనే ఉన్న సమయం గడిచిపోతుంది. రైతు వ్యతిరేక చట్టాలు, పెగాసెస్‌ నిఘాపై చర్చకే పట్టుబడుతున్నారు. మరోవైపు ప్రతిపక్షాలతో సంబంధం లేకుండా కీలక బిల్లులను సభలో ప్రవేశపెడుతూ బిల్లులను ఆమోదింపజేసుకుంటోంది కేంద్రం. కీలకమైన ఓబీసీ బిల్లును కేంద్రం సభలో పెట్టింది. బీసీలను గుర్తించడం, వారిని ఓబీసీ జాబితాలోకి చేర్చే అధికారం తిరిగి రాష్ట్రాలకే అప్పగించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.  

లోక్‌సభలో ఓబీసీ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. ఓబీసీ బిల్లుకు 15 విపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. హడావుడిగా ఓబీసీ బిల్లు ప్రవేశపెట్టడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. పెగాసస్‌ సహా పలు స‌మ‌స్య‌ల‌పై పార్ల‌మెంట్ ఉభ స‌భ‌ విపక్షాలు ఆందోళనలు చేస్తున్నా నేప‌థ్యంలో ఒకే ఒక్క విష‌యంలో మోడీ స‌ర్కార్‌ కు స‌హ‌క‌రిస్తామ‌ని ప్ర‌తిప‌క్షాలు హామీ ఇచ్చాయి. ప్ర‌తిప‌క్షాల మ‌ద్ద‌తు పొందిన ఆ బిల్లు ఏంటి అంటే ...ఓబీసీ బిల్లు. రాష్ట్రాల స్థాయిలో వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారాన్ని రాష్ట్రాలకే కట్టబెడుతూ కేంద్రం సోమ‌వారం పార్లమెంట్‌ లో ప్ర‌వేశ పెట్టే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు విపక్షాలు ఏకగ్రీవంగా ప్రకటించాయి. ఈ బిల్లు వచ్చినప్పుడు ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా చర్చలో పాల్గొంటామని ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ ప్రకటించాయి.

ఇది చాలా కీల‌క‌మైన బిల్లు అని, అందువ‌ల్లే కేంద్రానికి మద్దతివ్వాలని నిర్ణయించినట్లు విపక్ష నేతలు స్ప‌ష్టం చేశారు. ఈ బిల్లు ఏ ర‌కంగా ముఖ్యమైందో ప్ర‌తిప‌క్షాలు వివ‌రించాయి. ఈ బిల్లు ఆమోదంతో ఓబీసీ జాబితాని నిర్వహించే అధికారం ఇక మీద‌ట రాష్ట్రాల‌కే ద‌క్కుతుంది. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ కు ప్రతిపాదించకుండానే తమ రాష్ట్రాల్లోని ఓబీసీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి నోటిఫై చేసే అధికారం రాష్ట్రాలకు దక్కనుంది. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంట్‌ లో మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. ఈ  సంద‌ర్భంలో బిల్లును అడ్డుకోవ‌డం ద్వారా  ఓబీసీల వ్య‌తిరేకిగా త‌మ‌ను చిత్రీక‌రించి బీజేపీ రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌నే కుట్ర‌ల‌ను భ‌గ్నం చేసేందుకు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు ప్ర‌తిప‌క్షాలు చెప్తున్నాయి.

ఇక ఈ రోజు  లోక్‌ సభలో గందరగోళం నెలకొంది. విపక్షాల ఆందోళనల మధ్యే మూడు బిల్లులకు లోక్‌ సభ ఆమోద ముద్ర వేసింది. రాజ్యాంగ సవరణ (ఎస్టీ) బిల్లు, ది డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్‌ (సవరణ) బిల్లు, ది లిమిటెడ్ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్‌ (సవరణ) బిల్లు ఆమోదం పొందాయి.  ఇందులో రెండు ఆర్ధిక బిల్లులతో పాటు ఓ వైద్య బిల్లు కూడా ఉంది. విపక్షాల నిరసనల మధ్యే ఈ బిల్లులు ఆమోదించడం మరో విశేషం. భారతీయ ఔషధ వ్యవస్దపై జాతీయ కమిషన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన సవరణ బిల్లును కేంద్రమంత్రి శర్బానంద్ సోనోవాల్ లోక్ సభలో ప్రవేశపెట్టగా స్పీకర్ దాన్ని ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు.

పెగాసస్ పై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించడాన్ని విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి తప్పుబట్టారు. అయితే కేంద్రం మాత్రం అన్ని అంశాలపై చర్చించడానికి సిద్ధంగా ఉందని కేంద్రమంత్రులు చెప్తున్నారు.

ఆ తర్వాత ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పరిమిత బాధ్యత కలిగిన భాగస్వామ్య సవరణ బిల్లును లోక్ సభ లో ప్రవేశపెట్టారు. దీన్ని కూడా లోక్ సభ చర్చ లేకుండానే ఆమోదించింది. పెద్ద, చిన్న వ్యాపార భాగస్వాముల మధ్య వివాదాలు తగ్గించేందుకు తీసుకొచ్చిన ఈ కీలకబిల్లు చర్చకు నోచు కోకపోవడంపైనా విపక్షాలు పెదవి విరిచాయి. విపక్షాల నిరసనల మధ్యే నిర్మలా సీతారామన్ మరో బిల్లు కూడా ప్రవేశపెట్టారు. డిపాజిట్ ఇన్సూరెన్స్, మరియు క్రెడిట్ గ్యారంటీ కార్పోరేషన్ సవరణ బిల్లును నిర్మల ప్రవేశపెట్టగా సభ  తెలిపింది. 
Tags:    

Similar News