లోకేష్ పాదయాత్ర...వైసీపీ అదే చేస్తుందిట...?

Update: 2023-01-16 11:18 GMT
తెలుగుదేశం భావి వారసుడు, చినబాబు నారా లోకేష్ పాదయాత్రకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. పట్టుమని పది రోజుల వ్యవధిలో సుదీర్ఘ  పాదయాత్రకు చినబాబు సిద్ధమవుతున్నారు. కుప్పంలో తొలి అడుగు పడితే అది ఆగకుండా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దాకా సాగనుంది. ఏకంగా నాలుగు వేల కిలోమీటర్ల దూరం. నాలుగు వందల రోజుల పాటు జనంలోనే అంటే టఫ్ టాస్క్ నే లోకేష్ ఎంచుకున్నారని అర్ధమవుతోంది. ఈ మధ్యలోనే మండు వేసవిని దాటాలి. అలాగే భారీ  వానలనూ చూడాలి.

ఏది ఏమైనా నాయకుడిగా తనను తాను రుజువు చేసుకునేందుకు లోకేష్ పాదయాత్ర బాట పడుతున్నారు. మరి లోకేష్ పాదయాత్ర మీద వైసీపీ ఆలోచనలు ఏంటి ఏమి చేయబోతుంది అన్నదే ఇపుడు చర్చగా ఉంది. లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటామని ఆ మధ్యన మంత్రి మేరుగ నాగార్జున ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఆ తరువాత నుంచి ఎవరూ కిమ్మనలేదు. ఇపుడు పాదయాత్రకు గడువు దగ్గరపడుతున్నా వైసీపీ మౌనంగానే ఉంది.

అయితే పార్టీ నాయకులు మంత్రులు ఈ విధంగా ఉండడానికి కారణం అధినాయకత్వం నుంచి వచ్చిన సూచనలు ఆదేశాలే అని అంటున్నారు. లోకేష్ పాదయాత్రను ఎవరూ పట్టించుకోవద్దు అని స్పష్టమైన ఆదేశాలు పార్టీ నుంచి వచ్చాయట. లోకేష్ పాదయాత్రకు ఆటంకాలు కూడా కలగచేయడంలేదని అంటున్నారు. ప్రభుత్వం పరంగా ఈ విషయంలో పూర్తిగా లైట్ తీసుకోవాలని భావిస్తున్నారుట.

ఎందుకంటే పాదయాత్ర అన్నది అత్యంత సున్నితమైన అంశం. ఈ విషయంలో కనుక కఠినంగా వ్యవహరిస్తే మాత్రం లేని పోని తలనొప్పులే కాదు లోకేష్ కి ఎక్కడ లేని పేరు వస్తుంది అన్న భయం వైసీపీ పెద్దలలో ఉంది అంటున్నారు. ఏ మాత్రం బ్రేకులు వేయాలని చూసినా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ దాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారని అంటున్నారు.

అందువల్లనే ఉత్తమమైన మార్గం ఏంటి అంటే లోకేష్ పాదయాత్రను పూర్తిగా ఇగ్నోర్ చేయడమే అని పార్టీ హై కమాండ్ నిర్ణయానికి వచ్చింది అని అంటున్నారు. లోకేష్ ఏడాదికి పైగా ఏపీ నలుమూలలా కలియతిరుగుతారు. ఆయన పాదయాత్రలో ఊరుకుంటారా అధికార పార్టీ మీదనే తన బాణాలను ఎక్కుపెడతారు. జనంలో ఉంటూ నిప్పులు కురిపిస్తారు.

ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఏ మాత్రం పట్టించుకోకపోయినా వారిని తమ వైపునకు ఎలా తిప్పుకోవాలలో లోకేష్ కే కాదు చంద్రబాబుకూ తెలుసు. అందువల్ల వైసీపీ మౌన వ్రతాన్ని భగ్నం  చేసి మాటకు మాట అన్నట్లుగా తూటాలను పేల్చేవిధంగా చేసేందుకు తెలుగుదేశం కచ్చితంగా చేయాల్సింది చేస్తుంది.

అయితే వైసీపీ అధినాయకత్వం అంచనా మాత్రం పాదయాత్రలను ఇప్పుడు ఎవరూ అంత సీరియస్ గా తీసుకోవడం లేదు అనేనట. తెలంగాణాలో బండి సంజయ్ కానీ వైఎస్ షర్మిల కానీ పాదయాత్ర చేసినా పెద్దగా ప్రభావం చూపించలేదు అంటున్నారు. అలాగే రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రను కూడా జనాలు అనుకున్నంతగా తీసుకోలేదని అంటున్నారు.

ఇక ఎన్నికల ముందు గతంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసేవారు. ఇపుడు పాదయాత్రలతో వస్తున్నారు ఇది పూర్తిగా ఎన్నికల రాజకీయం అని జనాలు భావిస్తారు అని వైసీపీ హై కమాండ్ అంచనా వేస్తోందిట. అయితే పాదయాత్రను మామూలుగా చూసినా లోకేష్ ఏమి మాట్లాడుతారు ఆయన ఏ అజెండాను సెట్ చేసుకున్నారు. ఏపీలో ఏఏ సమస్యలను గుర్తించారు అన్న దాని నుంచే సక్సెస్ రేటు ఆధారపడి ఉంది. లోకేష్ వెనకాల బలమైన తెలుగుదేశం ఉంది. చంద్రబాబు ఉన్నారు. అనుకూల మీడియా ఉంది.

అందువల్ల లోకేష్ పాదయాత్రను వైసీపీ లైట్ తీసుకోవాలనుకున్నా కుదిరే పని కాదనే అంటున్నారు. మెల్లగా మొదలై వేడి పుంజుకుందా ఇక వైసీపీ నోరు విప్పక తప్పదని అపుడు అటూ ఇటూ రాజకీయం చెలరేగితే కచ్చితంగా ఏపీలో లోకేష్ పాదయాత్ర హాట్ టాపిక్ అవుతుంది అని తెలుగుదేశం భావిస్తోంది. మొత్తంగా లోకేష్ ని లైట్ తీసుకోవాలనుకుంటే అది ఎంతవరకూ కరెక్ట్ వ్యూహం అవుతుందో వైసీపీకి కొద్ది కాలంలోనే తెలుస్తుంది అన్న వారూ ఉన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News