పడి లేచి పడ్డ టీమ్ ఇండియా

Update: 2015-08-20 14:20 GMT
భారత్-శ్రీలంక రెండో టెస్టు తొలి రోజు అనూహ్య మలుపులు తిరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా  ఇన్నింగ్స్ ను పేలవంగా ఆరంభించినా.. మళ్లీ పుంజుకుంది. కానీ పటిష్ట స్థితిలో తొలి రోజు ఆటను ముగించాల్సిన కోహ్లి సేన.. చివర్లో వికెట్లు కోల్పోయింది. చివరికి భారత్ దే కాస్త పైచేయి అయినా.. శ్రీలంక కూడా సంతృప్తికరంగానే ఆటను ముగించింది. ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన ఓపెనర్ కేఎల్ రాహుల్ (108; 190 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో తొలి రోజు హీరోగా నిలిచాడు. రాహుల్ ఆస్ట్రేలియాలో సైతం తన తొలి టెస్టులో పేలవంగా ఔటైనా.. రెండో టెస్టులో సెంచరీ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఇక కెప్టెన్ కోహ్లి 78 పరుగులు చేయడమే కాక.. రాహుల్ తో కీలక భాగస్వామ్యం నెలకొల్పి భారత ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్ శర్మ ఎట్టకేలకు మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అతను 79 పరుగులు చేశాడు.

ఉదయం టాస్ గెలిచి బ్యాటింగ్ 64 ప భారత్.. ఇన్నింగ్స్ ను పేలవంగా ఆరంభించింది. లంక పేసర్ దమ్మిక ప్రసాద్ (2/72)..  ఓపెనర్ విజయ్ (0), మూడో స్థానంలో వచ్చిన రహానె (4)లను స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేర్చి భారత్ ను దెబ్బ కొట్టాడు. గాయం నుంచి కోలుకుని వచ్చి ఈ మ్యాచ్ ఆడిన విజయ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగ్గా.. రోహిత్ బదులు మూడో స్థానంలో వచ్చిన రహానె స్లిప్ లో క్యాచ్ ఇచ్చాడు. ఈ దశలో రాహుల్, కోహ్లి మూడో వికెట్ కు 164 పరుగుల భాగస్వామ్యంతో భారత్ ను రక్షించారు. సెంచరీ దిశగా సాగుతున్న కోహ్లిని హెరాత్ ఔట్ చేసినా.. ఆ తర్వాత రోహిత్ నిలబడటంతో భారత్ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. సెంచరీ తర్వాత రాహుల్ ఔటవగా.. బిన్నీ (10) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఇంకో వికెట్ కోల్పోకుండా ఆటను ముగిస్తే భారత్ దే ఆధిపత్యం అయ్యేది. కానీ చివర్లో రోహిత్ ఔటయ్యాడు. సాహా 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రెండో రోజు భారత్ స్కోరు 400 దాటుతుందా లేదా అన్నది ఆసక్తికరం. ఈ మ్యాచ్ కు భారత్ మూడు మార్పులు చేసింది.  గాయపడ్డ ధావన్ స్థానంలో విజయ్, హర్భజన్ స్థానంలో బిన్నీ, ఆరో స్థానంలో ఉమేశ్ యాదవ్ జట్టులోకి వచ్చారు. తొలి టెస్టులో భారత్ అనూహ్య ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News