హోదా ముగిసిన ఎపిసోడ్ అంటే.. మండిపోద్దంటూ సీరియస్ వార్నింగ్

Update: 2021-12-02 04:33 GMT
ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటనను ఏ ముహుర్తంలో అన్నారో కానీ.. దాని మీద పడినన్ని పీటముడులు అన్నిఇన్ని కావు. దేశ ప్రధాని తనకు తానుగా రాజ్యసభలో ప్రకటన చేయటమే కాదు.. స్వయంగా హామీ ఇచ్చిన మాటను.. తర్వాత ప్రధాని కుర్చీలో కూర్చున్న నరేంద్ర మోడీ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ససేమిరా అనటం తెలిసిందే. విభజన వేళలో అడ్డగోలుగా రెండు ముక్కలు చేశారే కానీ ఎలాంటి శాస్త్రీయతను పాటించలేదన్న విషయాన్ని పలువురు బలంగా స్పష్టం చేయటం తెలిసిందే. ఓపక్క విభజన కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయిందని చెబుతూనే.. దానికి పరిహారం ఇచ్చేందుకుససేమిరా అనటం మోడీ సర్కారుకే చెల్లింది.

ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా అంశాన్ని పలు మెలికలు తప్పిసే.. ఇప్పుడేమో ముగిసిన అధ్యాయంగా తేల్చేస్తున్న వైనంపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తమవుతోంది. తాజాగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్య విన్న ఏపీ వాసికి మంట పుట్టేలా చేసింది. ప్రత్యేక హోదా మీద స్పష్టత ఇవ్వాలని కోరిన టీడీపీ ఎంపీని ఉద్దేశించి.. అదో ముగిసిన అధ్యాయంగా తేల్చేయటం తెలిసిందే. ఆయన మాటలు విన్న ప్రతి ఏపీ వాసి గుండె మండేలా చేసింది.

అడ్డదిడ్డంగా రాష్ట్రాన్నిరెండు ముక్కలు చేసేసి.. జరిగిన నష్టాన్ని ప్రత్యేక హోదాతో సర్దుబాటు చేస్తామని చెప్పి.. ఈ రోజు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరుపై తాజాగా లోక్ సత్తా ఏపీ అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తీరు బోడి గుండుకు మోకాలికి సంబంధం ఏమిటన్నతీరుకు తగ్గట్లే.. ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘానికి మధ్య ఎందుకు లేని లింకు పెడుతున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు.

కావాలంటే బీజేపీ నేతలు ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా పేరును తమకు తోచిన రీతిలో మార్చేసుకోవాలని.. కాకుంటే హోదా మాత్రం ఇవ్వాల్సిందేనని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఆర్థిక సాయం చేయాలే తప్పించి ముగిసిన అధ్యాయం లాంటి మండే మాటల్ని మాత్రం మాట్లాడొద్దని కోరుతున్నారు.ఇంతకీ ఏపీకి సాయం చేయటానికి కేంద్రానికి ఎందుకు మనసు రాదని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు.

ఏపీకి ఎంతో చేశామని చెప్పే కేంద్రంలోని మోడీ సర్కారు.. విభజన హామీలన్నీ తీర్చేసినట్లుగా చెప్పటాన్ని ప్రశ్నించిన ఆయన.. దానికి సంబంధించి ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయగలరా? అని సవాలు విసిరారు. విభజన వేళ ఇచ్చిన హామీల అమలుకు దిక్కు లేని వేళ.. భీశెట్టి కోరుతున్నట్లుగా శ్వేతపత్రాన్ని ప్రకటించే సాహసాన్ని చేయగలరా? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చే వారెవరు?
Tags:    

Similar News