బీహార్ మంత్రి పైత్యం...శివుడికీ కులం రంగేశాడు!

Update: 2019-08-28 15:56 GMT
దేశంలో కులం - మతం - వర్గం తారతమ్యాలు ఎంతకూ అంతరించడం లేదు. అంతరించడం మాట అటుంచి.. నానాటికీ కుల జాడ్యం పెచ్చరిల్లుతోందనే చెప్పక తప్పదు. సామాన్యులు అయితే ఏదోలే అనుకోవచ్చు గానీ... లక్షలాది మందికి ప్రతినిధులుగా ఎన్నికై చట్టసభల్లో సభ్యులుగా ఉంటూ చట్టాల రూపకల్పనలో తమదైన శైలిలో చక్రం తిప్పుతున్న రాజకీయ నేతలు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తూ కలకలమే రేపుతున్నారు. ఈ విషయంలో బీజేపీ నేతలు ముందు వరుసలో ఉంటే... ఇప్పుడు కొత్తగా జేడీయూ నేతలు కూడా అందులోకి దిగిపోయారు. బీహార్ లో అధికార పార్టీగా ఉన్న జేడీయూకు చెందిన నేత, నితీశ్ కుమార్ కేబినెట్ లో కీలక మంత్రిగా వ్యవహరిస్తున్న బ్రిజ్ కిశోర్ బింద్ ఇప్పుడు ఏకంగా శివుడికి కూడా కులం అంటగట్టేశాడు.

ఇప్పటికే శ్రీరాములు - శ్రీ కృష్ణుడు తమ కులానికి చెందిన వారేనంటూ పలువురు రాజకీయ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా శివుడికి కూడా కులం కార్డును అంటగట్టేస్తూ బ్రిజ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతుతన్నాయి. శివుడు తమ కులమైన బింద్ కులానికి చెందిన వాడేనని బ్రిజ్ సంచలన వ్యాఖ్య చేశారు. నోనియా- బింద్- బేల్దార్ మహా సంఘ్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన బ్రిజ్.... శివుడి కులం గురించి మాట్లాడారు. శివుడు తమ కులానికి చెందిన వాడేనని చెప్పుకున్న బ్రిజ్... అందుకు సంబంధించి తనదైన శైలి వాదనను వినిపించారు. కృష్ణ పరమాత్మ యాదవ కులానికి చెందిన వాడైతే, రాములు క్షత్రియ కులానికి చెందిన వాడు అయినప్పుడు శివుడు బింద్ కులానికి చెందిన వాడు ఎందుకు కాకూడదంటూ బ్రిజ్ తనదైన శైలి వాదనను వినిపించారు.

ఈ వాదనను బ్రిజ్ తన కులానికి చెందిన వారి సమక్షంలో ప్రస్తావించారని చెప్పడానికి వీల్లేదు. బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్ తో పాటు నితీశ్ కేబినెట్ లో మరో కీలక మంత్రి మంగల్ పాండేలు హాజరైన ఈ కార్యక్రమంలో ఏమాత్రం బెరుకు లేకుండా బ్రిజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని బ్రిజ్... తాను ఉంటున్న మంత్రివర్గానికి నేతృత్వం వహిస్తున్న సీఎం నితీశ్ కుమార్ పైనా తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. బీహార్ జనాభాలో కేవలం 2 శాతం జనాభా ఉన్న కులానకి చెందిన వారు 14 శాతం జనాభా ఉన్న కులం వారిపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని కూడా బ్రిజ్ సంచలన కామెంట్లు చేశారు. సరే... తన పార్టీకి చెందిన నితీశ్ పై తన ఆవేదన ఏదో వెళ్లగక్కితే ఓకే గానీ... ఏకంగా శివుడికే కులం మకిలీ అంటించిన బ్రిజ్ నిజంగానే సంచలనంగా మారారని చెప్పక తప్పదు.


Tags:    

Similar News