యువతకు షాకిచ్చిన నందన్ నీలేకని!

Update: 2016-10-03 14:44 GMT
ఒక ఉద్యోగంలో చేర‌గానే.... ‘హమ్మ‌య్య సెటిల్ అయిపోయామ‌’న్న ధోర‌ణి ఎప్పుడో మారిపోయింది. ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్ అయితేనే ఉద్యోగ భ‌ద్ర‌త‌. ఎప్ప‌టిక‌ప్పుడు నేర్చుకుంటూ ముందుకు సాగితేనే కెరీర్ లో గ్రోత్ ఉంటోంది. అయితే, ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక కొత్త టెక్నాల‌జీ మార్కెట్ లోకి వ‌చ్చేస్తోంది. మ‌న పనుల్ని మ‌రింత సుల‌భ‌త‌రం అవుతూనే ఉన్నాయి. మార్పును  అందిపుచ్చుకోక‌పోతే ఎంత‌టి నైపుణ్య‌వంతుడైనా మ‌రుగునప‌డాల్సిందే. ఇదే విష‌య‌మై ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం, ఇన్ఫోసిస్ కో ఫౌండ‌ర్ నంద‌న్ నీలేక‌ని మాట్లాడారు. ముఖ్యంగా ఈ విష‌యంలో యువ‌త అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ఇప్పుడున్న‌న్ని ఉద్యోగావ‌కాశాలు భ‌విష్య‌త్తులో ఉండ‌క‌పోవ‌చ్చ‌ని ఆయ‌న యువ‌త‌కు షాక్ ఇచ్చారు. ప్ర‌స్తుతం మ‌నం చూస్తున్న ఎన్నో ఉద్యోగాలు స‌మీప భ‌విష్య‌త్తులో క‌నుమ‌రుగైపోయే అవ‌కాశం ఉంద‌ని నంద‌న్ నీలేక‌ని జోస్యం చెప్పారు. ఈ స‌వాలును స‌మ‌ర్థంగా ఎదుర్కొనేందుకు అంద‌రూ సిద్ధంగా ఉండాల‌న్నారు.

ప్ర‌స్తుతం మ‌న విద్యావ్య‌వ‌స్థ‌లో చాలా మార్పులు అవ‌స‌రం అని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ముఖ్యంగా నిరుద్యోగుల విష‌యంలో కొత్త స్కిల్స్ డెవెల‌ప్ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. యువ‌త‌లో క్రియేటివిటీ పెర‌గాలన్నారు. ఆ దిశ‌గా వారిని ఆలోపించ‌జేసే శిక్ష‌ణ ఉండాల‌ని నంద‌న్ అన్నారు. స‌మీప భ‌విష్య‌త్తులో మ‌న విద్యా వ్య‌వ‌స్థ స‌మూలంగా మారితేనే ఈ ఛాలెంజెస్ ను స‌మ‌ర్థంగా త‌ట్టుకుని ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషించ‌గ‌లం అన్నారు. యువ‌త కూడా త‌మ ఆలోచ‌నా ధోర‌ణి మార్చుకుని నిరంత‌రం నేర్చుకునే మ‌న‌స్థ‌త్వాన్ని అల‌వ‌రుచుకోవాల‌న్నారు. జీవితాంతం విద్యార్థిగానే నేర్చుకుంటూనే ఉండాల‌న్నారు.

ఆర్టిఫీషియ‌ల్ ఇంట‌లిజెన్స్‌ - మెషీన్ లెర్నింగ్‌ - బాట్స్  వంటివి బీపీవో - సాఫ్ట్‌ వేర్ రంగాల్లోకి దూసుకొస్తున్నాయ‌న్నారు. భ‌విష్య‌త్తులో ఉద్యోగాలు పొందాలంటే ఇప్పుడున్న నైపుణ్యాలు స‌రిపోవ‌న్నారు. ఇదే నైపుణ్యాల‌ను ప‌ట్టుకుని కూర్చుంటే ఉద్యోగాలు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని నంద‌న్ వివ‌రించారు. కాబ‌ట్టి, అంద‌రి దృష్టీ నైపుణ్యాల మెరుగుపై ఉండాల‌ని సూచించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News