ఉగ్రదాడుల్లో కంటే ప్రేమ వ‌ల్లే ఎక్కువ మరణాలు

Update: 2017-04-03 05:40 GMT
ప్రేమ.. రెండక్షరాల పదమే కానీ ఇది ఎన్నో ప్రాణాలను తీస్తున్నది. సినిమాల్లోనే కాదు నిజ జీవితాల్లోనూ కల్లోలం సృష్టిస్తున్నది. ఉగ్రదాడుల్లో మృతిచెందిన వారికంటే ప్రేమ విఫలమై - ప్రేమ వ్యవహారాలతో చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువగా ఉందంటే ఆశ్చర్యం వేయకమానదు. ప్రేమించిన వ్యక్తి మోసం చేశారనో, కులాలు అడ్డొచ్చాయనో కారణం ఏదైనా చివరకు అది ప్రాణాలను బలిగొంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో ప్రేమ కారణాలతో 2001 నుంచి 2015 వరకు పదిహేనేళ్ల‌ వ్యవధిలో 38,585 మంది హత్యకు గురైనట్టు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. మరో 79,189 మంది ఆత్మహత్యలకు కూడా ప్రేమ వ్యవహారాలతో సంబంధాలున్నాయని ఇవి స్పష్టంచేస్తున్నాయి. పెళ్లి పేర ఎత్తుకెళ్లారనే ఫిర్యాదులతో మరో 2.6 లక్షల అపహరణ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఇదే 15 ఏళ్ల‌లో ఉగ్రవాదుల దాడుల్లో సామాన్య పౌరులు - భద్రతాదళాలు కలిపి మొత్తం 20 వేలమంది మృత్యువాతపడ్డారు. ఈ లెక్కన ఉగ్రదాడుల కం టే ప్రేమ మరణాలే ఎన్నో రెట్లు ఎక్కువ చోటుచేసుకుంటున్నాయి. పిల్లలు పారిపోయారని - బంధుమిత్రులు ఏమనుకుంటారోనని పలువురు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

-దేశంలో ప్రేమ వ్యవహారాలతో రోజుకు సరాసరి ఏడు హత్య కేసులు - 14 ఆత్మహత్యలు - 47 అపహరణ కేసులు నమోదవుతున్నాయి.

-ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ - ఉత్తరప్రదేశ్ - మహారాష్ట్ర - తమిళనాడు - మధ్యప్రదేశ్‌ లో జరిగిన ఎక్కువ హత్యలకు ప్రేమే కారణమని లెక్కలు చెబుతున్నాయి. పైన పేర్కొన్న ఒక్కో రాష్ట్రంలో 15 ఏండ్లలో 3 వేల చొప్పున హత్య కేసులు నమోదయ్యాయి.
 
-ప్రేమించిన వ్యక్తి మోసం చేశారని కోపంతో - నిరాశతో ప్రాణాలు వదులుతున్న వారు కొందరైతే - కులాల ఆధిపత్యం ఇతర ప్రేమ వ్యవహారాలతో మరికొందరు హత్యలకు గురవుతున్నారు.

- పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 14 ఏళ్ల‌ను పరిశీలిస్తే (2012 ఏడాదిలో ఆత్మహత్యకు పాల్పడిన కేసుల సంఖ్య అందుబాటులో లేదు) ప్రేమ వ్యవహారాలతో అత్యధికంగా 15 వేల మందికిపైగా బలవన్మరణాలకు పాల్పడిన కేసులు నమోదయ్యాయి. రెండోస్థానంలో తమిళనాడు నిలువగా ఇక్కడ 9,405 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు.

- అసోం - ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ - ఒడిశా - మధ్యప్రదేశ్‌లో ఒక్కో రాష్ట్రంలో 5వేలకు పైగా బలవన్మరణాల కేసులు నమోదయ్యాయి.

-దేశంలోని 19 రాష్ర్టాలు - కేంద్రపాలిత (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) ప్రాంతాల్లో ప్రేమ వ్యవహారాలతో ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిలో మహిళలే ఎక్కువ మంది ఉన్నట్టు లెక్కల్లో తేలింది.

-ప్రేమ వ్యవహారాలతో జరిగిన మరణాలు చాలా ఎక్కువని నిపుణులు చెబుతుండగా.. హర్యానా - ఉత్తరప్రదేశ్‌ లోని పశ్చిమ ప్రాంతాల్లో ఎన్నో కేసులు పోలీసుల చెంతకే రావడంలేదు. కొన్ని ఠాణాలకు వచ్చినా కేసులుగా మారడంలేదు.

పితృస్వామ్యం - కుల వ్యవస్థను నమ్మడమే ఈ హింసకు కారణం అని స్త్రీ - పురుషుల వివక్షపై అధ్యయనం చేసిన పదవీ విరమణ ఆచార్యులు ఉమా చక్రవర్తి చెప్పారు. ఇందులో సంస్థాగతంగా ప్రేరేపించిన ఆత్మహత్యలే ఎక్కువ అని సినీ డాక్యుమెంటరీ నిర్మాత నకుల్ సింగ్ సావ్‌ నీ తెలిపారు. 2012లో ఇజ్జత్‌ నగ్రికీ అసభ్య భేటియాన్ పేరుతో హర్యానా - పశ్చిమ యూపీలో స్థానిక పరిస్థితులతో ప్రతిఘటిస్తున్న మహిళలపై ఆయన డాక్యుమెంటరీ తీశారు. రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశపాలన - కుల వర్గాల నిర్వహణతోనే నిస్సహాయ స్థితిలో ఎక్కువ మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అని ఐద్వా నాయకురాలు జగ్‌ మతి సంగ్వాన్ తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News