విధేయ ఎమ్మెల్యే ఫ్లెక్సీ ఉత్సాహం కేసీఆర్ కు కొత్త తలనొప్పులు

Update: 2022-10-11 04:27 GMT
గతంలో మాదిరి పరిస్థితి లేదు. రాజకీయమే జీవితంగా భావిస్తూ బతికే నాయకులు.. ప్రజా ప్రతినిదులు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చిన్న తేడా వచ్చినా మొదటికే మోసం వచ్చేలాంటి పరిస్థితి. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవటంతో పాటు..

చురుగా మారిన సోషల్ మీడియా కారణంగా చిన్న తప్పులకు పెద్ద మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి. దసరా పండుగ రోజున తన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్.. జాతీయ రాజకీయాల మీద తన ఫోకస్ ఎంత సీరియస్ అన్న విషయాన్ని చేతలతో చెప్పేశారు.

ఇదంతా బాగానే ఉన్నా.. తమ అధినేతను కీర్తించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొత్త చిక్కులు తెచ్చి పెట్టటమే కాదు.. ఆయనకు లేని ఇమేజ్ ను తీసుకొచ్చి బద్నాం చేసేలా ఉండటం గమనార్హం. సొంత పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో.. భారత మ్యాప్ ను తప్పుగా ప్రింట్ చేయించటం కొత్త లొల్లిగా మారింది. ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తాజాగాఒక భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

అందులో తమ అధినేత కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేలా ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో ప్రింట్ అయిన భారతదేశం చిత్రపటంలో పైన ఉండాల్సిన కశ్మీర్ లో కొంత భాగమే చూపించటం.. పాక్ అక్రమిత కశ్మీర్ భాగం చూపించకపోవటం వివాదంగా మారింది. ఈ ఫ్లెక్సీలో ప్రింట్ చేసిన ఇండియా మ్యాప్ చూసిన తర్వాత.. పాక్ ఆక్రమించిన కశ్మీర్ ను ఫ్లెక్సీలో చూపించలేదంటే.. పాక్ కు కేసీఆర్ మద్దతుగా నిలిచినట్లుగా స్పష్టమవుతుందన్న వాదనకు తెర తీశారు.

ఇలాంటి అవకాశాన్ని చేజార్చుకోని తెలంగాణ బీజేపీ నేతలు తమ గళాన్ని విప్పారు. హైదరాబాద్ సంస్థానాన్ని పాక్ లో కలపాలని ప్రయత్నించిన నిజాం రాజు వారసత్వాన్ని కేసీఆర్ అనుసరిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీ బీజేపీ ఫైర్ బ్రాండ్ కమ్ ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ..

పాక్ అక్రమించిన కశ్మీర్ ను ఫ్లెక్సీలో ముద్రించిన దానిలో లేదంటే.. కేసీఆర్ పాకిస్థాన్ కు మద్దతుగా నిలిచినట్లు అవుతుందన్న వాదనను వినిపించారు. ఇలాంటి ప్రచారం మరింత ఎక్కువ కాక ముందే.. ఈ మ్యాప్ లో దొర్లిన తప్పునకు చెంపలు వేసుకుంటే గులాబీ బాస్ కు మేలు జరుగుతుందని చెబుతున్నారు. మరి.. దానం వారు తన తప్పునకు చెంపలేసుకునే ఆలోచనలో ఉన్నారా? లేదంటే.. మరింత సాగదీసి తలనొప్పులు మరింత పెంచనున్నారా?

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News