ఎల్వీ బ‌దిలీ...జ‌గ‌న్ సంచలనం వెనుక ఏం జ‌రిగింది!

Update: 2019-11-04 12:33 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేశారు. గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా ఆయ‌న్ను నియమించారు. ఈ బ‌దిలీ త‌క్ష‌ణ‌మే అమ‌లులోకి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.  ఇంఛార్జ్ సీఎస్‌గా నీరబ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేర‌కు  ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ పేరుతో ఆదేశాలు జారీ అయ్యాయి.

సుబ్రహ్మణ్యంను ఆకస్మికంగా బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయిన‌ప్ప‌టికీ...దీని వెనుక ఊహించ‌ని ఘ‌ట‌న‌లు కార‌ణ‌మ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి, సీఎంవోలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్‌తో విబేధాల కార‌ణంగానే...ఈ బ‌దిలీ జ‌రిగింద‌ని అంటున్నారు. ఆయ‌న‌ షోకాజ్ నోటీసులు ఇచ్చినందుకు ఎల్వీపై బదిలీ వేటు పడినట్లు చర్చ జరుగుతోంది. వైఎస్సార్ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డ్సు, గ్రామ న్యాయాలయాలకు సంబంధించిన అంశాలపై ప్రవీణ్ వైఖ‌రితో...సీఎస్ అహం దెబ్బతీసినట్లయిందని అంటున్నారు. సీఎం వద్ద ముఖ్య కార్యదర్శిగా ఉన్నానన్న ధీమాతో, నేరుగా ఆయనతోనే మాట్లాడి సీఎస్ పేరుతో కాకుండా తన పేరుతో ఉత్తర్వులిచ్చుకోవడం వ‌ల్ల ఎల్‌వీ హ‌ర్ట‌య్యార‌ని అంటున్నారు.

అందుకే  తనను ధిక్కరిస్తూ, బిజినెస్ రూల్స్‌కు భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటున్నార‌ని పేర్కొంటూ ప్ర‌వీణ్ ప్రకాష్‌కు షోకాజ్ నోటీసులివ్వడం ద్వారా.. సీఎస్ ఎల్వీఎస్ తన హోదాకున్న ప్రాధాన్యతను స్పష్టం చేశారని అంటున్నారు. అయితే, ఈ ఎపిసోడ్ ప్ర‌భుత్వంపై వివిధ రాజ‌కీయ పార్టీలు ఘాటుగా స్పందించేందుకు కార‌ణం అయ్యాయి. దీంతో...ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యంను బ‌దిలీ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు. మరో ఐదు నెలలు సర్వీస్‌ ఉండగానే ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అవ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News