మాంద్యం కాదట.. వృద్ధి తగ్గిందట..

Update: 2019-09-15 08:17 GMT
ఆర్థికమాంద్యం.. ఇప్పుడు దేశాన్ని పట్టిపీడిస్తున్న గడ్డుపరిస్థితి. దీని దెబ్బకు ఆటో మొబైల్ - ఐటీ - ఫార్మా - పారిశ్రామికరంగం కుదేలై దివాళా తీస్తోంది. కేంద్రం ఉద్దీపన చర్యలు తీసుకుంటున్నా పరిస్థితులో మార్పు రావడం లేదు. అయితే ఇందంతా కేంద్రం చేసిన నోట్ల రద్దు - జీఎస్టీ ప్రభావమేనని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇది ఆర్థిక మాంద్యం అస్సలే కాదంటున్నారు ఆర్థిక వేత్తలు..

తాజాగా 14వ ఆర్థిక సంఘం సభ్యుడు - సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ సలహాదారు అయిన ఆర్ధికవేత్త ఎం గోవింద్ రావు.. దేశంలో వచ్చింది అసలు ఆర్థిక మాంద్యమే కాదని కొత్త నిర్వచనం ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థ గతంలో కంటే నిదానంగా వృద్ధిలోకి వెళుతోందని ఆయన తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థకు మాంద్యం భయం లేదని.. కేవలం మందగమనంలో మాత్రమే కొనసాగుతోందన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నాయని.. ప్రభుత్వం దాన్ని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తోందన్నారు..

వరుసగా రెండు త్రైమాసికాల్లో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పూర్తిగా క్షీణించినప్పుడే దాన్ని ఆర్థిక మాంద్యంగా పిలుస్తామని ఆర్థికవేత్త ఎం గోవింద్ రావు తెలిపారు. తొలి త్రైమాసిక 5శాతం మాత్రమే వృద్ధిరేటు నమోదైందని.. ఇప్పుడు రెండో త్రైమాసికంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. సంస్కరణలు, పెట్టుబడుల కల్పనకు ప్రాధాన్యం, ఉద్దీపన చర్యలతో మందగమన పరిస్థితుల నుంచి బయటపడుతుందని ఆయన చెబుతున్నారు.

మరి ఇప్పుడు వచ్చిన తీవ్ర ఆర్థిక మాంద్యం ప్రభావం పూర్తిగా తెలియాలంటే ఈ మూడు నెలల ఫలితాల తర్వాత చెప్పవచ్చు అంటున్నారు ఆర్థిక వేత్త.. మరి మోడీ ప్రభుత్వ ఉద్దీపనం పనిచేస్తుందా.? దేశం నిలదొక్కుకుంటుందా అన్న దానిపై వేచిచూడాల్సిందే.


Tags:    

Similar News