సీమ రగులుతోందా...మైసూరారెడ్డి హాట్ కామెంట్స్... ?

Update: 2021-11-11 14:30 GMT
వైసీపీ సర్కార్ కి సమస్యలు అన్ని వైపుల నుంచి ఒకేసారి తోసుకువస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీకి కానీ జగన్ కి కానీ నిజానికి రాయలసీమ గట్టి దన్నుగా ఉంటూ వస్తోంది. జగన్ని వైఎస్సార్ కుమారుడిగా, ఏపీ భావి సీఎం గా మొదట గుర్తించింది కూడా సీమ జిల్లాలే. ఇక 2019 ఎన్నికల్లో అయితే అక్కడ వైసీపీ కంప్లీట్ గా స్వీప్ చేసి పారేసింది. మరి అలాంటి చోట, తాము కోరుకున్న వారు ముఖ్యమంత్రి అయితే జనాల రియాక్షన్ ఎలా ఉంది అంటే జవాబు నిరాశేనట. ఆ మాట ఎవరో చెబితే ఏమో అనుకోవచ్చు, కానీ సీమ‌లో పుట్టి పెరిగి ఎన్నో పదవులు అలంకరించిన సీనియర్ మోస్ట్ లీడర్ ఎంవీ మైసూరారెడ్డి లాంటి వారు చెబితే కచ్చితంగా మ్యాటర్ ఉందని అర్ధం చేసుకోవాల్సిందే.

ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మైసూరారెడ్డి జగన్ పాలన మీద హాట్ కామెంట్స్ చేశారు. స్కీములతో కధ నడవదు అంటూ ఖరాఖండీగా చెప్పేశారు. తాము జనాలకు పధకలను పంచిపెడితే మళ్లీ గెలిచేయవచ్చు అని జగన్ అనుకుంటే అంత కంటే తప్పు ఉండదని కూడా చెప్పుకొచ్చారు. తెలంగాణాలో ఉన్న హుజూరాబాద్ లాంటి ఫలితాలే ఏపీలోనూ వస్తాయని గుర్తుంచుకోవాలని కూడా ఆయన హెచ్చరించారు. ఇక రాయలసీమ జనాలలో వైసీపీ పాలన మీద అసంతృప్తి బాగా పెరిగిపోతోంది అని కూడా ఆయన అంటున్నారు.

సీమ వాసులు రాజధాని కోరుకుంటే హైకోర్టు ఇచ్చినట్లుగా చెప్పి దానికి న్యాయ రాజధాని పేరు పెడితే సరిపోతుందా అని ఆయన నిలదీశారు. మూడు రాజధానులు చేసిన జగన్ సీమకు పాలనా రాజధాని ఎందుకు తరలించరు అని ఆయన ప్రశ్నించారు. ఇక సీమలో సాగు నీటి ప్రాజెక్టులకు తీరని అన్యాయం జరుగుతున్నా జగన్ సర్కార్ పట్టనట్లుగా కూర్చోందని ఆయన విమర్శించారు. విభజన తరువాత ఎక్కువగా నష్టపోయింది సీమ ప్రాంతమే అని అన్నారు. క్రిష్ణా జలాల విషయంలో రాయలసీమకు పూర్తి న్యాయం జరగాలి అంటే హంద్రీ నీవా, వెలుగొండ, గాలేరు నగరి వంటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసిన మీదటనే కొత్త బోర్డులు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.

ఇక విభజన తరువాత రాయలసీమకు అడుగడుగునా అన్యాయం జరుగుతోందని, అందువల్ల ప్రత్యక సీమ రాష్ట్రం ప్రతిపాదన ఉందని, కరోనా వల్ల తాము జనాల్లోకి వెళ్లలేకపోయామని, రేపటి రోజున అందరి అభిప్రాయాలు తీసుకుని ప్రత్యేక‌ రాష్ట్రం గురించి పోరు చేస్తామని కూడా మైసూరారెడ్డి స్పష్టం చేశారు. ఇక సీమకు జగన్ రెండున్నరేళ్లలో చేసింది ఏమీ లేదని కూడా తేల్చేశారు. వైసీపీ మీద సీమలోనే కాదు, ఏపీ వ్యాప్తంగా వ్యతిరేకత బాగా పెరిగిందని, మరో రెండున్నరేళ్లలో ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారో ఇప్పటి నుంచే చెప్పడం కష్టం అయినా వైసీపీ కనుక ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోకపోతే ఇబ్బందులు తప్పవని కూడా హెచ్చరించడం విశేషం. మొత్తానికి ఒకనాటి వైఎస్సార్ సహచరుడు, ప్రియమైన శత్రువు, వైసీపీలో కొన్నాళ్ళు జగన్ తో పాటు పనిచేసిన మైసూరారెడ్డి జగన్ సర్కార్ మీద గట్టిగానే బాంబులు వేశారనుకోవాలి.
Tags:    

Similar News