బ్రేకింగ్... పోసాని కృష్ణ మురళిపై సీఐడీ కేసు!
వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణ మురళిపై ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందుతున్న సంగతి తెలిసిందే.
వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణ మురళిపై ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసాని కృష్ణ మురళిపై ఇప్పటికే రాజమండ్రి, విజయవాడ, కడపతో పాటు పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయని అంటున్నారు!
ఇదే సమయంలో ఇటీవల రాజంపేట పోలీస్ స్టేషన్ లోనూ పలువురు టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో పోసానిపై కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పోసానిపై పలు స్టేషన్ లలో ఇప్పటివరకూ 50కి పైగా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో పోసాని కృష్ణ మురళిపై ఏపీ సీఐడీ తాజాగా కేసు నమోదు చేసింది.
అవును... పోసాని కృష్ణ మురళిపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ కేసు నమోదు చేసింది. సెప్టెంబర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసత్య ప్రచారం చేస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా... పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని.. అదేవిధంగా వర్గాల మధ్య విబేధాలు తలెత్తేలా మాట్లాడారని వంశీకృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోసానిపై చర్యలు తీసుకోవాలని సీఐడీని కోరారు. దీంతో.. సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.