రేవంత్ తో రెడీ అంటున్న పవన్!

మధ్యలో తెలంగాణా మంత్రులు వైసీపీ మీద విమర్శలు చేసినా ఇటు నుంచి కొందరు వైసీపీ మంత్రులు అటు వారిని విమర్శించినా మొత్తానికి పెద్దల మధ్య సఖ్యత అలాగే ఉంది.

Update: 2024-11-18 11:03 GMT

ఉమ్మడి ఏపీ రెండుగా చీలిన తరువాత ఎవరి రాజకీయం వారిది అన్నట్లుగానే కధ సాగుతోంది. తెలంగాణాకు తొలి సీఎంగా కేసీఆర్ అయ్యారు. ఏపీకి చంద్రబాబు అయ్యారు. ఈ ఇద్దరి మధ్య కొంతకాలం దాకా సామరస్యంగానే అంతా సాగింది. ఆ తరువాత పెద్దగా కలవకపోయినా ఓపెన్ గా విమర్శలు చేసుకున్నది అయితే లేదు. ఇక జగన్ ఏపీకి సీఎం అయ్యాక కేసీఆర్ తో బాగానే రిలేషన్స్ మెయింటెయిన్ చేశారు. మధ్యలో తెలంగాణా మంత్రులు వైసీపీ మీద విమర్శలు చేసినా ఇటు నుంచి కొందరు వైసీపీ మంత్రులు అటు వారిని విమర్శించినా మొత్తానికి పెద్దల మధ్య సఖ్యత అలాగే ఉంది. దాంతో లైట్ తీసుకున్నారు.

ఇక ఇపుడు ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అక్కడ తెలంగాణాలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరింది. రేవంత్ రెడ్డి టీడీపీలో చాలా కాలం పనిచేశారు. దాంతో ఏపీ సీఎం తెలంగాణా సీఎం ఒకసారి సమావేశం అయి రెండు రాష్ట్రాల మధ్య సమస్యల గురించి చర్చించారు.

ఆ మీదట ఎవరి మటుకు వారు పనిచేసుకుంటున్నారు. ఏపీ గురించి తెలంగాణా కాంగ్రెస్ నేతలు విమర్శించడం లేదు అలాగే కూటమి నేతలు కాంగ్రెస్ సర్కార్ గురించి మాట్లాడడం లేదు. అయితే మహారాష్ట్ర ఎన్నికల పుణ్యమా అని ఈ సామరస్యానికి దెబ్బ పడే చాన్స్ ఉందా అన్న చర్చ సాగుతోంది.

పవన్ కళ్యాణ్ జనసేన తరఫున బీజేపీకి మద్దతుగా మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఆయన ప్రచారం మొత్తం కనుక గమనిస్తే ఆరెస్సెస్ భావజాలానికి అనుకూలంగా సాగుతోంది. ఆయన జనసేన శివసేన ఒక్కటే అని నినదించడాన్ని చూస్తే పక్కా హిందూత్వ నినాదాన్ని అందుకున్నారని అర్ధం అవుతోంది.

ఈ దేశానికి కానీ మహారాష్ట్రకు కానీ బీజేపీ వస్తేనే అభివృద్ధి అని పవన్ ఒకటికి పదిసార్లు చెబుతూ వస్తున్నారు. బీజేపీ దేశాన్ని ఏకం చేసే పార్టీ అయితే కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు దేశాన్ని చీల్చే విధంగా వ్యవహరిస్తున్నాయని పవన్ ఆరోపించారు. ఆయన అంతటితో ఊరుకోకుండా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు.

తెలంగాణాలో కాంగ్రె పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని ఘాటుగానే విమర్శించారు. అధికారంలోకి వస్తే ప్రతీ నెలా మహిళలకు ఇస్తామని చెప్పిన ఆర్ధిక సాయం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదని పవన్ ఆరోపించారు. తెలంగాణా అంటే తన గుండె ఎలా కొట్టుకుంటునో అందరికీ తెలుసు అంటూ బండెనక బండి కట్టి పాటను ఆయన పాడి వినిపించారు. అది తనకు చాలా ఇష్టమైన పాట అని కూడా అన్నారు.

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని పవన్ విమర్శించారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గట్టిగానే పాల్గొంటున్నారు. ఆయన బీజేపీని ఫుల్ గా టార్గెట్ చేస్తున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా అమలు చేసిన కార్యక్రమాల గురించి కూడా చెబుతూ వస్తున్నారు. బీజేపీని బందిపోటు ముఠాతో ఆయన పోల్చారు.

దానికి కౌంటర్ చేస్తూ పవన్ మాట్లాడారు. అలా ఆయన రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. అంతే కాదు మజ్లీస్ పార్టీని ఒవైసీని కూడా పవన్ విమర్శించారు. ఎవరి బెదిరింపులకు ఎవరూ భయపడరని కూడా పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవ్వన్నీ పక్కన పెడితే పవన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద చేసిన కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో చిచ్చు పెట్టేలా ఉన్నాయని అంటున్నారు.

పవన్ చేసిన విమర్శలను ఖండిస్తూ కౌంటర్ ఇవ్వడానికి తెలంగాణా కాంగ్రెస్ నేతలు రెడీ అవుతున్నారు. వారు కూడా ఏపీలో కూటమి హామీల మీద మాట్లాడితే అపుడు రాజకీయ రచ్చ అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇపుడు పక్క రాష్ట్రం ఎన్నికల రాజకీయాలు తెలుగు రాష్ట్రాల మధ్యన రాజకీయ రచ్చను స్టార్ట్ చేసేలా ఉన్నాయని అంటున్నారు. ఇక చంద్రబాబు ప్రభుత్వం మీద కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తే అపుడు ఇటు నుంచి కూడా కౌంటర్లు వెళ్తారు. సో ఏపీ తెలంగాణా పాలిటిక్స్ హీటెక్కుతుందా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News