క‌విత భ‌ర్త ఆస్తుల లెక్క చెప్పండి

Update: 2017-06-02 14:25 GMT
ముచ్చ‌ట‌గా మూడేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకున్న సంతోషంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు ఆ ఆనందాన్ని మిగిల్చేలా క‌నిపించ‌ట్లేదు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేత‌ల తీరు చూస్తుంటే. నిన్న‌టికి నిన్న ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌ కు వ‌చ్చిన కాంగ్రెస్ యువ‌రాజు రాహుల్‌.. కేసీఆర్ స‌ర్కారు మీద అవినీతి ఆరోప‌ణ‌లు చేసి ఉలిక్కిప‌డేలా చేశారు.

తాము నోరు క‌ట్టేసుకొని మ‌రీ పాల‌న చేస్తున్నామంటూ కేసీఆర్ ప‌దే ప‌దే చెప్పుకోవ‌టం క‌నిపిస్తుంది. త‌మ నిజాయితీని ప్ర‌ధాని మోడీ సైతం మెచ్చుకున్నారంటూ గొప్ప‌లు చెప్పుకునే కేసీఆర్ కు చెక్ చెప్పేలా తాజాగా మ‌రో కాంగ్రెస్ నేత చేస్తున్న సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గ‌డిచిన మూడేళ్లేగా లేని ఆరోప‌ణ‌ల్ని వ‌రుస‌పెట్టి మ‌రీ.. చేస్తున్న ఆ నేత ఎవ‌రో కాదు.. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌.. మాజీ ఎంపీ మ‌ధుయాష్కీ. తాజాగా ఆయ‌న కేసీఆర్ కుటుంబ స‌భ్యుల‌పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోప‌ణ‌లు చేయ‌టం గ‌మ‌నార్హం. కేసీఆర్ మూడేళ్ల పాల‌న‌ను ద‌రిద్ర‌పు పాల‌న‌గా అభివ‌ర్ణించిన ఆయ‌న‌.. తెలంగాణ‌కు కాప‌లా కుక్క‌గా ఉంటాన‌న్న కేసీఆర్ ఇప్పుడు అధికారంలో దోచుకుతింటున్నార‌ని మండిప‌డ్డారు.

తెలంగాణ అమ‌ర‌వీరుల ఉసురు.. ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న రైతుల శాపాలు కేసీఆర్ స‌ర్కారుకు త‌ప్ప‌క ప‌డ‌తాయ‌న్నారు. స‌ర్వేల‌తో టీఆర్ ఎస్ స‌ర్కారు స‌ర్వ‌నాశ‌నం అవుతుంద‌ని శాప‌నార్థాలు పెట్టిన ఆయ‌న‌.. కేసీఆర్ కుటుంబం తాము సంపాదించిన అవినీతి సంపాద‌న‌ను విదేశాల్లో దాచుకున్న‌ది నిజం కాదా? అని ప్ర‌శ్నించారు.

కేటీఆర్ కంటే కూడా క‌విత మీదా.. ఆమె భ‌ర్త మీద తీవ్ర‌స్థాయిలో అవినీతి ఆరోప‌ణ‌లు చేశారు. ఎంపీ క‌విత మీద అనేక వేల కోట్ల రూపాయిల ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌ని.. ఆమె భ‌ర్త పేరు మీద ఉన్న ఆస్తులు ఎంత‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. క‌విత‌.. ఆమె భ‌ర్త పేరిట ఉన్న ఆస్తుల లెక్క చెబుతారా? అంటూ నిలదీసిన యాష్కి.. మియాపూర్ భూ కుంభ‌కోణంలో త‌లసాని ముందున్నార‌ని..  వెన‌కాల మాత్రం కేసీఆర్ కుటుంబ‌మే ఉండి ఉండొచ్చ‌న్న అనుమానాన్ని యాష్కీ వ్య‌క్తం చేశారు.

కేసీఆర్ ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న అవినీతిపై కేంద్రం విచార‌ణ జ‌ర‌పాల‌న్న యాష్కీ.. తెలంగాణ యువ‌త‌కు ఎన్ని ఉద్యోగాలు వ‌చ్చాయో లెక్క చెప్పాల‌ని కేటీఆర్‌ను ప్ర‌శ్నించారు. ఐటీ హ‌బ్ పేరుతో గ‌బ్బు చేస్తున్నార‌న్న ఆయ‌న‌.. పేద‌ల‌కు ఇండ్లు క‌ట్టించడానికి డ‌బ్బుల్లేవు గాని తాను మాత్రం బుల్లెట్‌ఫ్రూప్ బాత్రూం క‌ట్టించుకోవ‌టానికి మాత్రం డ‌బ్బులు ఉన్నాయా? అని ప్ర‌శ్నించారు.కేసీఆర్ కుటుంబ దోపిడీపై రాహుల్ వేసిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల‌న్న యాష్కీ ఈ అవినీతిపై త్వ‌ర‌లో సీబీఐ విచార‌ణ‌ను కోరుతామ‌న్నారు. చాలా రోజుల త‌ర్వాత ఒక తెలంగాణ కాంగ్రెస్ నేత..ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌ర్కారు పైనే కాదు.. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేయ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. మ‌రి.. దీనిపై కేసీఆర్ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News