వ‌ర్షాల‌కు చంద్రుళ్లకు లింకుందా?

Update: 2015-07-16 09:11 GMT
తొమ్మిదిన్న‌రేళ్లు చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు భ‌యంక‌ర‌మైన క‌రువుతో తెలుగు ప్ర‌జ‌లు ప‌డిన క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. బాబు త‌ర్వాత ముఖ్య‌మంత్రిగా వైఎస్ అధికారంలోకి రావ‌టం.. ఆయ‌న హ‌యాంలో విస్తారంగా వ‌ర్షాలు పడ్డాయి. దాన్ని  ప్ర‌స్తావిస్తూ అప్పుడ‌ప్ప‌డు వైఎస్ వ్యంగ్యంగా చంద్ర‌బాబును ఎట‌కారం చేసే వారు కూడా.

ఆయ‌న వ్యంగ్యంగా అన్న మాట‌ల్ని మిగిలిన వారు నింద‌లుగా మార్చేసి.. బాబు హ‌యాంలో వ‌ర్షాలు లేవ‌ని.. బాబు అంటే క‌రవు గ్యారెంటీ అని ప్ర‌చారం చేసేవారు. ఇదంతా వైఎస్ హ‌వా న‌డిచిన రోజుల్లో ఇలాంటి వ్యాఖ్య‌లు వినిపించేవి.
మ‌ళ్లీ ఇన్ని రోజుల త‌ర్వాత ఇలాంటి వ్యాఖ్య‌లే మ‌ళ్లీ మొద‌లుకావ‌టం విశేషం. కాక‌పోతే..ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు తోడుగా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా ఉండటం ఒక‌రికొక‌రు అన్నట్లు ఉంది.

వైఎస్ తో పెద్ద‌గా పొస‌గ‌ని కాంగ్రెస్ నేత మ‌ధుయాష్కీ నోట వైఎస్ వ్యాఖ్య‌లు రావ‌టం కాస్తంత ఆస‌క్తిక‌రం. తాజాగా ఆయ‌న ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌పై విరుచుకుప‌డ్డారు. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు అమావాస్య చంద్రుళ్లు అని ధ్వ‌జ‌మెత్తారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అమ‌వాస్య చంద్రుళ్ల పాల‌న‌తో వ‌ర్షాలు ప‌డ‌టం లేదంటూ మండిప‌డిన ఆయ‌న రాజ‌మండ్రి తొక్కిస‌లాట‌కు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నైతిక బాధ్య‌త వ‌హించాల‌న్నారు. నిజానికి పాల‌కుల‌కు వ‌ర్షాల‌కు లింకు ఉందా? అన్నది ఒక ప్ర‌శ్న అయితే.. ఇలాంటి వాటికి శాస్త్రీయంగా ఎలాంటి చెల్లుబాటు ఉండ‌నప్ప‌టికీ.. పాల‌కుల మీద వ్య‌తిరేక‌త పెంచేందుకు.. వారి మీద చెర‌ప‌లేని మ‌ర‌క వేసేందుకు ఇలాంటివి వ్యాఖ్య‌లు ప‌ని చేసే వీలుంది.

 ఇప్ప‌టివ‌ర‌కూ సెంటిమెంట్ తో దెబ్బ కొట్ట‌ట‌మే కాదు.. దెబ్బ తిన‌టం అల‌వాటు లేని గులాబీ ద‌ళం.. మ‌ధుయాష్కీ వ్యాఖ్య‌ల‌కు ఎలా స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News