టీఆర్ ఎస్ అంటే తెలంగాణ రాబందుల స‌మితి

Update: 2017-07-08 15:26 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నిజామాబాద్ మాజీ ఎంపీ - కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ మధు యాష్కీ తీవ్ర వ‌స్థాయిలో మండిప‌డ్డారు. తెలంగాణ రాష్ట్ర స‌మితికి కాకుండా తెలంగాణ రాబందులు సమితికి అధ్యక్షుడిగా కేసీఆర్ మారిపోయార‌ని మధు యాష్కీ ధ్వ‌జ‌మెత్తారు. అధికార దాహంతో తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపించారు. అల్ ఇండియా కాంగ్రెస్ క‌మిటీ (ఏఐసీసీ) కార్యదర్శిగా రెండవ సారి నియమకమైన సంద‌ర్భంగా నిజామాబాద్‌కు వ‌చ్చిన మధు యాష్కీకి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికి స‌న్మానం చేశాయి.

ఈ సంద‌ర్భంగా మ‌ధుయాష్కీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర క‌ల నెర‌వేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాల‌కు ఓర్చి, న‌ష్టాల‌కు సిద్ధప‌డి సైతం నిర్ణ‌యం తీసుకుంద‌ని అన్నారు. అమ‌రుల ఆకాంక్ష‌లు నెర‌వేర్చుతూ సుదీర్ఘ‌పోరాటాన్ని గౌర‌విస్తూ తెలంగాణ‌ను ఏర్పాటు చేసిన ఘ‌న‌త కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీకి ద‌క్కింద‌ని చెప్పారు. అయితే ఎన్నిక‌ల అనంత‌రం అధికారంలోకి వచ్చి టీఆర్ ఎస్ పార్టీ ప్ర‌జా సంక్షేమాన్ని విస్మ‌రించింద‌ని యాష్కీ ఆరోపించారు. కేసీఆర్ సార‌థ్యంలోని ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల కోణంలో ప‌నిచేయ‌డం లేద‌ని, ఆయ‌న కుటుంబం దోపిడీ చేస్తోంద‌ని విమ‌ర్శించారు. అమరవీరుల ఆకాంక్ష‌ల‌ను పట్టించుకోవ‌డం లేద‌ని, అవినీతికి అడ్డ‌గా మారిన కేసీఆర్ తెలంగాణ రాబందుల స‌మితికి నాయ‌కుడిగా మారిపోయార‌ని మ‌ధుయాష్కీ ఆరోపించారు.

తెలంగాణ కోసం బిల్లు పాస్ అయ్యేవిధంగా క్రియాశీలంగా ప‌నిచేసిన‌ మాజీ లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ విష‌యంలో కేసీఆర్ ద్వంద్వ వైఖ‌రి బ‌య‌ట‌ప‌డుతోందని మ‌ధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా మీరాకుమార్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా బీజేపీ అభ్యర్థి రాంనాథ్ కోవింద్‌ కు టీఆర్ ఎస్ త‌ర‌ఫున మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం ద్రోహమ‌ని ఆయ‌న ఆరోపించారు. కాంగ్రెస్ అధ్య‌క్షుడు సోనియాగాంధీ - ఉపాధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ సార‌థ్యంలో పనిచేస్తూ తెలంగాణ‌లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషిచేయ‌నున్న‌ట్లు మ‌ధుయాష్కీ ప్ర‌క‌టించారు.
Tags:    

Similar News