చిరు మూవీ రిలీజ్ అయితే టికెట్లు దొరకవంటూ.. సీఎం జగన్ పై వైసీపీ ఎమ్మెల్యే పొగడ్తలు

Update: 2022-03-11 04:01 GMT
మాటకారితనం బాగా ఉండగానే సరికాదు. తమకున్న టాలెంట్ ను బయటపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే.. కొన్ని సందర్భాల్లో కొందరి టాలెంట్ అనూహ్యంగా బయటకురావటమే కాదు.. అప్పటివరకు లేని కొత్త ఇమేజ్ ను తెచ్చేసుకుంటారు. ఇప్పుడుఆ కోవలోకే వస్తారు శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.

రోటీన్ రాజకీయ నేతల మాటలకు భిన్నంగా ఆయన అసెంబ్లీలో చేసిన ప్రసంగం విన్నంతనే..భలే మాట్లాడారే అన్న భావన కలగకమానదు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్ని పొగిడే తీరులో ఆయన కొత్త తీరును ప్రదర్శించారు.

జగన్ ప్రభుత్వం అమలు చేసే పథకాల్లో ముఖ్యమైన ‘నాడు-నేడు’  పథకంపై ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తన మాటల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన తెచ్చి.. అందరి ముఖాన నవ్వులు పూసేలా చేశారు. భలే పోల్చారే అన్నట్లుగా ఉన్న ఆయన మాటల్ని చూస్తే.. ‘‘చిరంజీవి సినిమా రిలీజ్ అయితే టికెట్లు దొరకవు. ఇప్పుడు అలానే ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు లేవన్న బోర్డులు పెడుతున్నారు.

 దేశ.. రాష్ట్ర చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు. ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల విషయంలో చంద్రబాబు సహకరించాలి. ఆయన అనుకుంటే అవుతుంది. చంద్రబాబు రాష్ట్రం ఏమైపోతోందని పదే పదే యాంకర్ మాదిరి మైకు పట్టుకొని మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి ఏమైంది? బాగానే ఉంది కదా?’’ అంటూ వ్యాఖ్యానించారు.

అసెంబ్లీకి రాకుండా చంద్రబాబు తప్పించుకు తిరుగుతున్నారని.. నలభై ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి సభకు వచ్చి మాట్లాడాలన్నారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నాడు - నేడు పథకం పుణ్యమా అని.. ప్రభుత్వ స్కూళ్లు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మారాయన్నారు.

 చదువుకు గతంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం తెచ్చి ప్రాధాన్యతను తెస్తే.. నేను జగన్ ఇంగ్లిష్ మీడియంను ప్రవేశ పెట్టి కొత్త అధ్యాయానికి తెర తీశారన్నారు.

ఏపీకి పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుకు వెళితే.. ముఖ్యమంత్రి జగన్ ను తిట్టుకుంటున్నారన్న ఆయన.. ఎందుకు తిడుతున్నారంటూ తాను అడిగితే అనూహ్యమైన సమాధానం వారి నుంచి వచ్చిందన్నారు.

గతంలో ఆంధ్రా నుంచి బెంగళూరుకు వచ్చి పనులు చేసేవాళ్లని.. ఇప్పుడు రావటం లేదని.. అందుకు ఏపీ ముఖ్యమంత్రి కారణమంటున్నారన్నారు. పనులకు వెళ్లే పిల్లలు స్కూళ్లకు వెళ్లి చదువుకుంటున్నారని.. ఆంధ్రాకు పనుల కోసం ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్తున్నారన్నారు.

ఇంగ్లిషు ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ.. తనకు కూడా ఇంగ్లీషు సరిగా రాదని.. తన కొడుకు తనను ప్రత్యేకంగా ఇంగ్లిషు టీచర్ ను పెట్టుకొని నేర్చుకోవాలని చెప్పారన్నారు. నేటి పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ రాకపోతే బయట చులకనగా చూస్తున్నారన్నారు.

ప్రతి ఒక్కరికి చదువు చాలా ముఖ్యమని.. దేశంలోని మిగిలిన రాష్ట్రాలన్నీ ఏపీ వైపు చూస్తున్నాయన్నారు. ప్రతిపక్షాలు నాడు - నేడు పథకాన్ని గమనించాల్సిందిగా కోరారు. సభలోని అధికారపార్టీ సభ్యులు మాత్రమే కాదు.. స్పీకర్ సైతం బియ్యపు మధుసూదన్ రెడ్డి మాటలకు ఫిదా కావటమే కాదు.. ఆయన్ను మెచ్చుకోవటం గమనార్హం.

తన ప్రసంగంలో భాగంగా బియ్యపు మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఏ స్కూలుకు వెళ్లినా గాంధీ.. అంబేడ్కర్ ఫోటోలు ఉన్నాయని.. రాబోయే రోజుల్లో చదువుకొని మంచి స్థాయికి వెళ్లిన వారంతా సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటారన్నారు.

నాడు - నేడు విషయంలో ఏ నియోజకవర్గానికి వెళ్లైనా చూసి రావాలంట విపక్ష సభ్యులకు సూచన చేసిన ఆయన.. అవసరమైతే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి వెళదామన్నారు. గతంలో సర్కారీ స్కూళ్లలో నాలుగు గుడ్లు ఇచ్చి నలభై రాసుకునేవారని.. ఇప్పుడు స్కూళ్లల్లో పౌష్టికాహారాన్ని స్టూడెంట్లకు ఇస్తున్నారన్నారు.  


Tags:    

Similar News