విజయమ్మ ఆత్మీయ సమావేశాన్ని ఒక్కమాటలో తేల్చేసిన మధుయాష్కీ

Update: 2021-09-05 08:30 GMT
చూసేందుక సాఫ్ట్ గా కనిపించే కాంగ్రెస్ సీనియర్ నేత.. ప్రస్తుతం టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న మధు యాష్కీ గౌడ్ నోరు తెరిస్తే ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పదిహేనేళ్ల క్రితం ఆయన మాట్లాడే వేళలో ఆచితూచి అన్నట్లుగా ఉండేది. ఈ మధ్య కాలంలో ఆయనలో మాటలో చాలానే తేడా వచ్చేసింది. ఆ మాటకు వస్తే ఆహార్యంలోనూ పూర్తిగా మారిపోయారు. ఒక సెలబ్రిటీని తలపించేలా మధు యాష్కీ ఉండేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా.. తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త తరహాలో దర్శనమిస్తున్న ఆయన.. తాజాగా విలేకరులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా టీ కాంగ్రెస్ అసమ్మతి నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తీవ్రంగా మండిపడటమే కాదు.. విజయమ్మ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఏపీసీఎం జగన్ ను అసరా చేసుకొని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. వైఎస్ వర్థంతి వేళ విజయమ్మ నిర్వహించింది ఆత్మీయ సమ్మేళనం ఎంతమాత్రం కాదని.. అది పక్కా రాజకీయ సమ్మేళనంగా ఆయన ఒక్క మాటలో తేల్చేశారు. వైఎస్ జీవితం లక్ష్యం రాహుల్ ను ప్రధానమంత్రిని చేయటమన్నారు.

వైఎస్ బతికి ఉంటే తెలంగాణ వచ్చేది కాదని విజయమ్మ వ్యాఖ్యానించారని.. ఆమె వ్యాఖ్యల్ని కోమటిరెడ్డి సమర్థిస్తారా? అని ప్రశ్నించిన ఆయన.. 'కాంగ్రెస్ లో ఉండాలంటే ఉండొచ్చు. బయటకు పోవాలనుకుంటే పోవచ్చు. కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లండి. కానీ వెన్నుపోటు పొడవొద్దు. కాంగ్రెస్ ను వ్యతిరేకించే రాజకీయ వేదిక మీదకు వెళ్లి మాట్లాడటం పార్టీకి నష్టమే' అని మండిపడ్డారు.

విజయమ్మ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం రాజకీయాలకు అతీతమైనదే అయితే.. ఆ సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు హాజరు కాలేదు? అని ప్రశ్నించారు. 'తండ్రి ఆత్మీయ సమ్మేళనానికి రాని కొడుకు ఉంటారా?' అని ప్రశ్నించారు. సీతక్క చంద్రబాబుకు రాఖీ కట్టటాన్ని రాజకీయం చేయటం జ్ఞానం లేని వారు చేసే పనిగా అభివర్ణించారు. ప్రధాని మోడీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ లు భేటీ కావటం.. దొంగలు.. దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా ఉందన్నారు. మొత్తానికి ఒక్క ప్రెస్ మీట్ లో విజయమ్మ ఆత్మీయ సమ్మేళనం గాలి తీయటమే కాదు.. ఇటీవల కాలంలో మరే కాంగ్రెస్ నేత కూడా విరుచుకుపడనంత తీవ్రంగా కోమటిరెడ్డిపై ఫైర్ అయ్యారని చెప్పాలి.
Tags:    

Similar News