రైత‌న్న‌పై పేలిన తూటా.. ఐదుగురు మృతి

Update: 2017-06-07 04:57 GMT
క‌ష్ట‌ప‌డి పండించిన పంట‌కు మద్ద‌తు ధ‌ర అడ‌గ‌ట‌మే అన్న‌దాత త‌ప్పైంది. అదే వారి ప్రాణాలు తీసే వ‌ర‌కూ వెళ్లింది. మ‌ద్ద‌తు ధ‌ర కోరుతూ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లో నిర్వ‌హించిన ఆందోళ‌న హింసగా మార‌టం.. ఆందోళ‌కారుల‌పై పోలీసులు కాల్పులు జ‌ర‌ప‌టం.. చివ‌ర‌కు ఐదుగురు రైతులు మ‌ర‌ణించ‌టం లాంటి దారుణాలు వ‌రుస‌గా జ‌రిగిపోయాయి. సంచ‌ల‌నంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని మంద్ సౌర్‌.. పిప్లియా మండీ ప్రాంతాల‌కు చెందిన రైతులు తాము పండించిన పంటల‌కు మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించాల‌ని కోరుతూ ఆందోళ‌న నిర్వ‌హించారు. ఈ ఆందోళ‌న‌ను అణిచివేసేందుకు పోలీసులు ప్ర‌య‌త్నించ‌టంతో రైతుల్లో ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. వారిని అదుపు చేయ‌డానికి పోలీసులు లాఠీఛార్జి చేయ‌టంతో ఆగ్ర‌హావేశాల‌కు గురైన రైతులు క‌నిపించిన వాహ‌నానికి నిప్పు పెట్ట‌ట‌మే కాదు.. రైల్వేట్రాక్‌ లు.. క్రాసింగ్ గేట్ల‌ను ధ్వంసం చేశారు. పోలీసుల‌పైకి రాళ్లు రువ్వారు. దీంతో.. సీఆర్ఫీఎఫ్ సిబ్బంది.. పోలీసులు కాల్పుల‌కు దిగారు.

ఈ అనూహ్య ప‌రిణామాల కార‌ణంగా పోలీసుల కాల్పుల్లో ఐదుగురు రైతుల అసువులు బాశారు. కాల్పుల్లో అన్న‌దాత‌లు మ‌ర‌ణించార‌న్న వార్త‌.. మంద్ సౌర్‌.. పిప‌ల్యా మండీ ప్రాంతాల్ని అట్టుడికిపోయేలా చేసింది. ప‌రిస్థితి పూర్తిగా అదుపు త‌ప్ప‌టంతో.. క‌ర్ఫ్యూ విధించారు. ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని ర‌ద్దు చేశారు.

ఇదిలా ఉంటే.. రైతుల‌పై పోలీసుల కాల్పుల్ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రంగా ఖండించారు. కాల్పుల ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించారు. కాల్పుల్లో మ‌ర‌ణించిన రైతు కుటుంబాల‌కు కోటి రూపాయిల న‌ష్ట‌ప‌రిహారాన్ని.. మృతి చెందిన కుటుంబాల‌కు ఉద్యోగం ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం చౌహాన్‌. గాయ‌ప‌డిన వారికి రూ.5 ల‌క్ష‌లు.. ఉచిత చికిత్స అందించ‌నున్న‌ట్లు చెప్పిన ముఖ్య‌మంత్రి.. కిలో ఉల్లిని రూ.8 చొప్పున కొనుగోలు చేస్తామ‌ని.. పెస‌లు రైతులు కోరిన ధ‌ర‌కు ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తుంద‌ని వ‌రాల మూట‌ను విదిల్చారు.

ఇదిలా ఉంటే.. రైతుల‌పై కాల్పులు జ‌రిపిందే లేదంటూ మ‌రో కొత్త వాద‌న‌కు తెర తీశారు ఆ రాష్ట్ర హోంమంత్రి భూపేంద్ర సింగ్‌. రైతుల ఆందోళ‌న‌లో సంఘ విద్రోహ‌క శ‌క్తులు ప్ర‌వేశించాయ‌ని.. కాల్పులు జ‌రిపింది వారేన‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే.. రైతుల‌పై బీజేపీ స‌ర్కారు యుద్ధం ప్ర‌క‌టించింద‌న్న కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్‌.. పోలీసులు కాల్పులు జ‌రిపిన మంద్ సౌర్‌కు వెళ్ల‌నున్నారు. అక్క‌డి రైతుల్ని ప‌రామ‌ర్శించ‌నున్నారు. ఏమైనా.. కాల్పుల్లో మ‌ర‌ణించిన రైతుల‌కు కోటి రూపాయిల ప‌రిహారం లెక్క క‌ట్ట‌టం ద్వారా.. ప‌రిహారానికి  కొత్త లెక్క‌ల్ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి తీసుకొచ్చార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News